అగ్ని మహా పురాణము

Table of Contents

ఆగ్నేయ పురాణ మాహాత్మ్యము

అగ్నిదేవుడు పలికెనుః

నీకు బ్రహ్మ రూపమగు అగ్ని పురాణమును చెప్పితిని. విద్య విస్తృతము, సంక్షిప్తము అని రెండు విధములు. ఋగ్యజుస్సామాథర్వ రూపమగు విద్య జగత్కారణ భూతుడగు విష్ణువు. ఛందస్సు శిక్షా, వ్యాకరణ, నిఘంటు జ్యోతిష నిరుక్త, ధర్మశాస్త్ర, మీమాంసా, న్యాయ, ఆయుర్వేద, పురాణ, ధనుర్వేద, గాంధర్వ, అర్థశాస్త్ర, వేదాంతాది విద్యలు అన్నియు హరి స్వరూపములు. ఈ విద్య అపర విద్య. పరమగు ఆత్మతత్త్వమును బోధించు విద్యపరవిద్య. ఈ ప్రపంచము అంతయు విష్ణు రూపము అని భావించు వానిని కలియు బాధించదు. మహా యజ్ఞమును చేయకున్నను, పితృస్వధ చేయ కున్నను, భక్తి పూర్వకముగా కృష్ణుని పూజించువాడు పాపములను పొందడు. సర్వకారణభూతుడగు విష్ణువును సర్వదా ధ్యానించువాడు ఎన్నటికిని నశించడు. పారతంత్ర్యాది దోషములు కలవాడును, విషయము లచే ఆకర్షింపబడిన మనస్సు కలవాడు, పాపములు చేసినను గోవిందుని ధ్యానించుటచే ఆ పాపముల నుండి విముక్తుడగును. గోవిందుడన్నదే ధ్యానము. కేశవుడు ఉన్నదే కథ. వానికై చేయునదే కర్మ. చాల చెప్పనేల. నేను చెప్పిన ఈ ఉత్తమ పరమార్థమును తండ్రి కుమారునకు చెప్పు జాలడు. గురువు శిష్యునకు చెప్పజాలడు. సంసారములో భ్రమించుచున్న వాడు పుత్ర దారాడులను అధిక ధనమును మిత్రులను, ఇతరులను కూడ పొందవచ్చును. కాని ఇట్టి ఉపదేశమును పొంద జాలడు. పుత్రదార, మిత్ర, క్షేత్ర, బాంధవాదులచే ఏమి ప్రయోజనము. ఇట్టి ఉపదేశమే పరమ బంధువు. ఈ భూతి మార్గము, దైవము ఆసురమని రెండు విధములు. విష్ణు భక్తి పరమైనది దైవ మార్గము. తద్విపరీతమైనది ఆసురమార్గము. నేను నీకు బోధించిన ఈ పురాణము పవిత్రము, ఆరోగ్యము, ధన్యము, దుఃస్వప్న నాశనము. సుఖప్రీతికరము, మానవులకు మోక్షము నిచ్చునది. వ్రాయబడిన అగ్ని పురాణ గ్రంథము, ఎవరి గృహము నందుండునో, వారికి ఉపద్రవము లేవియు వుండవు. ప్రతి దినము అగ్ని పురాణమును విను వారికి తీర్థ స్నానమెందుకు? గోదాన మెందుకు? యజ్ఞము లెందుకు? ఉపవాసము లెందుకు?

అగ్ని పురాణములోని ఒక శ్లోకము విన్న వానికి తిలప్రస్థము, ఒక మాషము సువర్ణము దానము చేసినవానికి వచ్చు పుణ్యము లభించును. ఒక అధ్యాయమును చదువుట గోదానము కంటే విశిష్టము. దీనిని చదువకోరు వానికి ఒక అహోరాత్రము నందు చేసిన పాపములు నశించును. అగ్ని పురాణము పఠించినవాడు జ్యేష్ఠ పుష్కరమునందు నూరు కపిల గోవులను దానము చేసిన పుణ్యమును పొందును. ధర్మము ప్రవృత్తి, నివృత్యాత్మకము. అగ్నిపురాణముతో సమానమైన శాస్త్రము లేదు. వశిష్టా! నిత్యమును అగ్ని పురాణమును చదివినను విన్నను భక్తుడగు మనుష్యుడు సర్వపాప విముక్తుడగును. అగ్ని పురాణము పుసక్తము ఉన్న గృహమున గృహోపద్రవములు కాని, అనర్థములు కాని, చోర, శత్రు భయముండదు. ఆ యింటిలో గర్భస్రావ భీతికాని, బాల గ్రహములు కాని, పిశాచాది, భయము గాని వుండదు. బ్రాహ్మణుడు దీనిని వినినచో వేదవేత్త యగును. క్షత్రియుడు పృథివీ పతియు అగును. వైశ్యుడు ఐశ్వర్యమును, శూద్రుడు ఆరోగ్యమును పొందును. సమదృష్టియై విష్ణువు నందు మనస్సు నిలిపి, ఈ అగ్ని పురాణమును చదివినచో అచట ఉపద్రవము లన్నియు నశించును. దివ్య, అంతరిక్ష, భౌమాది ఉపద్రవములు, దుస్వప్న అభిచారములు, ఇతర పాపములు వాటిని అన్నింటిని, కేశవుడు నశింపచేయును.

ఈ పురాణమును చదువువానికిని, వినువానికిని, ఈ పుస్తకమును పూజించువానికిని పూర్వోక్త ఫలము లభించును. ఈ పుస్తకమును గంధ పుష్పాదులతో పూజించి, హేమంతము నందు ఎవడు వినునో వానికి అగ్నిష్టోమ ఫలము లభించును. శిశిర ఋతువునందు పుండరీకఫలమును, వసంతము నందు అశ్వమేధ ఫలమును, గ్రీష్మము నందు వాజపేయ ఫలమును, వర్షాకాలమునందు రాజసూయ ఫలమును, శరత్కాలమున గోసహస్ర దాన ఫలమును పొందును.

భక్తి పూర్వకముగ విష్ణు సన్ముఖముఖమున అగ్ని పురాణమును పూజించినవాడు జ్ఞాన యజ్ఞముచే కేశవుని పూజించినవాడగును. అగ్ని పురాణము యొక్క లిఖితపుస్తకము ఎవని గృహము నందు పూజింపబడునో వానికి జయము కలుగును. భుక్తిముక్తులు వానిచేతిలోనుండును. ఈ విధముగ కాలాగ్ని రూపుడగును హరి బ్రహ్మ విద్యాద్వయ స్థానమగు ఈ అగ్ని పురాణమును నాకు బోధించినాడు. వశిష్ఠా! ఈ విద్యా ద్వయమును భక్తులకు మాత్రమే చెప్పగలవు. వశిష్టుడు పలికెను. వ్యాస! విష్ణువు బ్రహ్మకును, అగ్ని, దేవ, ముని సహితుడనగు నాకును బోధించిన విద్యాద్వయాత్మక మగు సర్వ విషయ ప్రదర్శకమైన అగ్ని పురాణము నీకు చెప్పబడినది. వ్యాసా! అగ్నిచే ఉపదేశింప బడినదియు, వేదతుల్యమును అగు ఈ అగ్ని పురాణమును ఎవడు చదువునో, వినునో, వ్రాయునో, వ్రాయించునో, చదివించునో, పూజించునో, ధరించునో ఆతడు సర్వపాప వినిర్ముక్తుడై, సర్వకామములను పొంది స్వర్గమునకు వెళ్లును. ఈ పురాణము వ్రాయించి బ్రాహ్మణులకు దానము చేసినవాడు నూరు తరములను ఉద్ధరించి, బ్రహ్మలోకము పొందును. ఒక్క శ్లోకము చదివినవాడు పాప పంక విముక్తుడగును వ్యాస! అందువలన సర్వదర్శన సంగ్రహరూపమగు ఈ పురాణమును వినదలచిన శుకాది మునులతో కూడ శిష్యులు సర్వదా వినిపించవలెను. అగ్ని పురాణమును చదివినను, చింతనము చేసినను, భుక్తిముక్తులను ఇచ్చును. ఈ పురాణమును చెప్పిన అగ్నికి నమస్కారము.

వ్యాసుడు పలికెనుః

సూతా! పూర్వము వశిష్ఠుడు చెప్పిన పరావిద్యా అపరా విద్యా రూపమగు పురాణమును నీకు చెప్పితిని. దీనిని చదువు భాగ్యవంతులు దుర్లభమగు ఆగ్నేయ రూపమును పొందుదురు. ఆగ్నేయ మును ధ్యానించువారు పరమాత్మ హరిని చేరిరి. విద్యార్థులు విద్యను రాజ్యార్థులు రాజ్యమును పొందిరి. పుత్రులు లేనివారు పుత్రులను, ఆశ్రయము లేనివారు ఆశ్రయమును, సౌభాగ్యము కోరువారు సౌభాగ్యమును, మోక్షమును కోరువారు మోక్షమును పొందిరి. వ్రాసినవారుసు వ్రాయిం చిన వారును పాపరహితులై ఐశ్వర్యము పొందిరి. ఈ అగ్ని పురాణమును శుకపైలవాదులతో కలసి చింతన చేయుము. భుక్తి ముక్తులను పొందెదవు. సందేహములేదు. నీవు కూడ శిష్యులకు భక్తులకును ఈ పురాణము వినిపించుము. సూతుడు పలికెను. శౌనకాది మునులారా! వ్యాసుని అనుగ్రహము వలన బ్రహ్మ రూపమగు ఈ ఆగ్నేయపురాణము, ఆదరపూర్వకముగ వినబడినది. మీరు నైమిశారణ్యమును శ్రద్ధాయుక్తులై పరమేశ్వరుడగు శ్రీహరిని పూజించుచున్నారు కావున మీకు బోధింపబడినది. అగ్ని ప్రోక్తమగు ఈ అగ్నిపురాణము, వేదతుల్యము, ద్వివిధ బ్రహ్మ విద్యలు బోధించునది? భుక్తి ముక్తి ప్రదము. దీనిని మించిన సారము, దీనిని మించిన మిత్రుడు, దీనిని మించిన గ్రంథము, గతి, శాస్త్రము, శ్రుతి, జ్ఞానము, స్మృతి, ఆగమము, విద్య, సిద్ధాంతము, మంగళము, దీనిని మించిన వేదాంతము లేవు. ఇదియే అత్యుత్తమము. దీనిని మించినది ఈ భూలోకమున లేదు. అట్టి వస్తువు దుర్లభము. ఈ అగ్ని పురాణమున సకల విద్యలు ప్రదర్శింపబడినవి. సమస్తమైన, మత్స్యాద్యవతారములు రామాయణము, హరివంశము, భారతము, నవవిధ సృష్టులు వర్ణింపబడినవి. వైష్ణవాగమము, పూజ, దీక్షా, ప్రతిష్టా, పవిత్రారోహణాదికము, ప్రతిమా లక్షణా దికము, ప్రాసాద లక్షణాదికము, భుక్తి ముక్తి ప్రదములగు మంత్రములు, శైవాగమము దాని అర్థము శాక్తేయాగమము, సౌరాగమము మండలములు, వాస్తు, వివిధ మంత్రములు, ప్రతిసర్గ, బ్రహ్మాండ మండ లము, భువన కోశము, ద్వీప వర్షాదులు, నదులు, గయా, గంగా, ప్రయాగాది తీర్థ మాహాత్మ్యము, జ్యోతిశ్చక్రము, జ్యోతిషాదికము, యుద్ధ జయార్ణవము మన్వంతరాదులు వర్ణాది ధర్మములు, అశౌచము, ద్రవ్య శుద్ధి ప్రాయశ్చిత్తము, రాజ ధర్మములు, దాన ధర్మ ములు, వివిధ వ్రతములు, వ్యవహారములు, శాంతులు, ఋగ్వేదాది విధానము, సూర్య వంశము, సోమవంశము, ధనుర్వేదము, వైద్యము, గంధర్వ వేదము, అర్థ శాస్త్రము, మీమాంసా శాస్త్రము, న్యాయ విస్తరము, పురాణ సంఖ్యా మాహాత్మ్యము, ఛందస్సు, వ్యాకరణము, అలంకారము, నిఘంటువు, శిక్షా, కల్పము, నైమిత్తిక ప్రళయము, ప్రాకృతిక ప్రళయము, ఆత్యంతిక ప్రళయము వేదాంతము బ్రహ్మ విజ్ఞానము, అష్టాంగ యోగము స్తోత్రము, పురాణ మాహాత్మ్యము, అష్టాదశ విద్యలు దీని యందు చెప్పబడినవి. ఋగ్వేదాది అపరా విద్యలు, అక్షరమగు పరావిద్య బ్రహ్మయొక్క సప్రపంచ నిష్ప్రపంచ రూపము బోధింపబడినది. ఇది పదిహేను వేల సంఖ్యగలది. దేవలోకమున శతకోటి విస్తరమగు ఈ పురాణము, దేవతలచే పఠింపబడును. అగ్ని లోకహితమును గోరి దీనిని సంక్షిప్తమును చేసి ఉపదేశించెను. శౌనకాది మునులారా! సర్వము బ్రహ్మ స్వరూపమని తెలుసుకొనుడు. ఎవడు వినునో వినిపించునో, చదువునో, చదివించునో వాడు స్వర్గమును పొందును. రాజు నియమవంతుడై గో, భూ, హిరణ్య, దానాదులచేతను, వస్త్రాలంకారాదుల చేతను పురాణ పాఠకుని పూజించ వలెను. అట్లు పూజించి, పురాణ శ్రవణ ఫలమును పొందును. పురాణాంతమున ద్విజులకు భోజ నము పెట్టవలెను. ఇట్లు చేసినవాడు నిర్మలుడై, సకల ప్రయోజనములను పొంది తన వంశముతో స్వర్గము చేరును. పుస్తకము నిమిత్తమై శరయంత్రమును, త్రాడును, పత్రసముదాయమును, పట్టికాబంధమును వస్త్రాదులను ఇచ్చువాడు స్వర్గమును పొందును. పుస్తకము దానము చేసినవాడు బ్రహ్మలోకము పొందును.

ఈ పుస్తకము ఎవరి ఇంటిలో ఉండునో వానికి ఉత్పాత భయము ఉండదు. ఆతడు భుక్తి ముక్తులను పొందును. ఈ అగ్ని పురాణము ఈశ్వర రూపమైనది అని మీరు భావింపుడు, అని పలికి వారిచే పూజింపబడి సూతుడు అచ్చట నుండి నిర్గమించెను. శౌనకాదులు విష్ణువును పొందిరి. (383)

నిర్మలః ప్రాప్తసరార్థః సకులః స్వర్గమాప్నుయాత్।

శరయంత్రం పుస్తకాయ సూత్రం వైపత్ర సంచయమ్.

పట్టికాబంధ వస్త్రాది దద్యార్యః స్వర్గమాప్నుయాత్।

యోదద్యాద్బ్రహ్మలోకే స్సాత్పుస్తకం యస్య వైగృహే

తస్యోత్పాతభయం నాస్తి భుక్తి ముక్తి మవాప్నుయాత్।

యూయం స్మరత చాగ్నేయం పురాణం రూపమశ్వరమ్.

సూతోగతః పూజితస్తైః శౌనకాద్యా హరింయయుః

శ్రీ అగ్ని మహాపురాణము సమాప్తము

శ్రీః శ్రీః శ్రీః శ్రీః శ్రీః