అగ్ని మహా పురాణము
మంత్ర పరిభాష
అగ్నిదేవుడు పలికెను:
వశిష్టా! ఇపుడు భుక్తిముక్తి ప్రదమగు మంత్ర విద్యను చెప్పెదను వినుము. ఇరువది కంటే అక్షరములు అధికముగల మంత్రములు మాలా మంత్రములు. పది అక్షరములు మించియున్నవి మంత్రములు. పదికి తక్కువ అక్షరములున్నవి బీజ మంత్రములు. ఇవి వార్ధక్యమున సిద్ధిని ఇచ్చును. మాలా మంత్రములు యౌవనమున సిద్ధిని ఇచ్చును. ఐదుకు మించిన అక్షరముగల మంత్రములు అన్ని ఫలములను ఇచ్చును. మంత్రజాతులు స్త్రీ పురుష నపుంసక భేదములచే మూడు విధములు. స్వాహాయనునది అంతమందు గలవి స్త్రీ మంత్రములు. నమః అనునది. చివరగలవి నపుంసక మంత్రములు. మిగిలినవి పురుష మంత్రములు. అవి వశీకరణమునందును ఉచ్చాటనము నందును ప్రశస్తమైనవి. క్షుద్ర క్రియయందును, రోగ శాంతి యందును, స్త్రీ మంత్రములు మంచివి. నపుంసక మంత్రములు ఇతర కార్యములందు మంచివి. ఆగ్నేయములు, సౌమ్యములు అని మంత్రములు రెండు విధములు. ఆదియందు ఓంకారము చేర్చినవి ఆగ్నేయములు. ఓంకారము చివర యున్నవి సౌమ్య మంత్రములు. వీటిని అగ్ని చంద్ర నాడి సమయమున జపించవలయును. ఓం, క్ష, ర, హ అనునవి అధికముగా గల మంత్రములు ఆగ్నేయములు. మిగిలినవి సౌమ్యములు. ఈ రెండును వరుసగా క్రూర సౌమ్య కర్మలయందు ప్రశస్తములు. ఆగ్నేయ మంత్రములు, ప్రాయశః చివర నమః చేర్చుటచే సౌమ్యములగును. సౌమ్యమంత్రము కూడ చివర ఫట్ చేర్చినచో ఆగ్నేయమగును. మంత్రము నిద్రించినను అపుడే లేచినను సిద్ధి ప్రదము కాదు. వామనాడి చలించునపుడు ఆగ్నేయ మంత్రమునకు, నిద్రా సమయము. దక్షిణ నాడి చలించునపుడు జాగరణ సమయము. సౌమ్య మంత్రము యొక్క నిద్ర జాగరణ సమయములు ఇందుకు విపరీతముగనుండును. రెండు నాడులు చలించునపుడు రెండు మంత్రములకు జాగరణ సమయము. దుష్ట నక్షత్ర దుష్టరాశి, శత్రు రూపాది అక్షరములు గల మంత్రములను తప్పక విడిచి వేయవలయును. ‘రాజ్య లాభోపకారాయ’ మొదలు ‘లిపి’ వరకు ఉన్న శ్లోకములో మొదటి నుండి ‘పుల్లౌ’ యను వరకును లిపి చెప్పబడినది. ఈ వర్ణమాలను నక్షత్రములతో కూడ, అశ్విన్యాది క్రమమున చేర్చవలయును. ‘అం, అః’ అను రెండును సర్వదా రేవతీ నక్షత్రముతో చేరి యుండును. వా, లా, గౌ, రం, ఖు, రం, శో, నం, భా, య సంఖ్యలలో విభక్తములగు అకారాద్యక్షరములు క్రమముగ మేషాది రాశులలో ఉన్నట్లు గ్రహించవలయును. శ, ష, స, హ అను అక్షరములను ఐదవదగు కన్యారాశియందు చేర్చవలెను. ‘క్ష’ కారమును మీన రాశి యందు చేర్చవలెను. చతుష్కోణము నందున్న ప్రథమ కోష్టము నందలి నాలుగు పంక్తులు సిద్ధములు. రెండవ కోష్టమునందున్న నాలుగు పంక్తులు సాధ్యములు. మూడవ కోష్టము నందున్న నాలుగు పంక్తులు సుసిద్ధములు. నాలుగవ కోష్టమునందలి పంక్తులు అరి. సాధకుని నామ ఆది అక్షరము ఏచతుష్కము నందుపడునో అది వానికి సిద్ధచతుష్కము. రెండవది సాధ్యము ఇట్లే గ్రహించవలెను. సిద్ధమంత్రము అత్యంత గుణయుక్తము. దాని జపమాత్రము చేతనే సిద్ధి కలుగును. సాధ్యమంత్రము జపపూజాదులచే సిద్ధించును. సుసిద్ధ మంత్రము ధ్యాన మాత్రముచే సిద్ధించును. అరిమంత్రము సాధకుని నశింపజేయును. అధికముగ దుష్ట వర్ణములు గల మంత్రము అందరిచేతను నిందింపబడినది.
శిష్యుడు అభిషేకాంత దీక్ష యథావిధిగా గ్రహించి గురువుద్వారా తంత్రోక్త విధానము తెలుసుకొని గురువు ఇచ్చిన అభీష్ట మంత్రమును సాధించవలెను. ధీరుడు, సమర్థుడు, పవిత్రుడు, భక్తి సంపన్నుడు, జప, ధ్యానాది తత్పరుడు సిద్ధుడు, తపశ్శాలి, కుశలుడు, తంత్రజ్ఞుడు, సత్యవాది, నిగ్రహానుగ్రహ సమర్థుడైన వాడే గురువు. శాంతుడు జితేంద్రియుడు సమర్థుడు, బ్రహ్మచారి హవిష్యమును తినువాడు, గురు సేవాతత్పరుడు మంత్ర సిద్ధికై ఉత్సాహము కలవాడుయైన వ్యక్తియే యోగ్యుడైన శిష్యుడు. అట్టి శిష్యునకును, తన పుత్రునకును మంత్రోపదేశము చేయవలయును. శిష్యుడు వినయవంతుడై గురువునకు ధనమును ఇవ్వవలెను. గురువు అట్టి శిష్యునకు మంత్రో పదేశము చేసి తన్మంత్ర సిద్ధికై తాను సహస్ర జపము చేయవలయును. అకస్మాత్తుగా విన్నది వంచనచే కాని, బలముచే గాని పొందబడినది పుస్తకములలో వ్రాయబడినది గాథలలో ఉన్నదియగు మంత్రము జపించకూడదు. అట్లు జపించినచో అనర్థము కలుగును. హోమ అర్చనాది వివిధ క్రియలతో మంత్ర సాధన చేయువానికి స్వల్పకాలమునందే మంత్ర సిద్ధి కలుగును. ఒక్క మంత్రము నైనను విధి పూర్వకముగ సిద్ధి చేసికొనినవానికి అసాధ్యమైనది ఏదియు వుండదు. అనేక మంత్రముల సిద్ధి సంపాదించినవాని, మాహాత్మ్యము వర్ణనాతీతము. అతడు సాక్షాత్తు శివుడే. ఏకాక్షర మంత్రమును పది లక్షలు జపించినచో సిద్ధించును. మంత్రము నందలి వర్ణములు పెరిగిన కొలది జపసంఖ్య తగ్గును. ఈ విధముగ జప సంఖ్యను ఊహించుకొనవలయును. మాలా మంత్రములను బీజ మంత్రము కంటే రెండు మూడు రెట్లు అధికముగా జపించవలెను. జపసంఖ్య చెప్పని మంత్రములను నూట యెనిమిది పర్యాయములు కాని, ఒక వెయ్యి యెనిమిది పర్యాయములుకాని జపించవలయును. జపములో దశాంశము హోమము తర్పణము చేయవలయును.
విశేష ద్రవ్యమును దేనిని చెప్పనప్పుడు హోమమునందు ఘృతమును ఉపయోగించ వలయును. హోమాసమర్థుడు హోమమునకు బదులు జపసంఖ్యలో దశాంశ జపము చేయవలయును. అంగాది మంత్రములకు కూడ జపము చెప్పబడినది. సశక్తికమగు మంత్రమును జపించుటచే (దేవతలు) మంత్ర దేవతలు అభీష్ఠ ఫలములను ఇత్తురు. సాధకుడు చేసిన ధ్యాన హోమ అర్చనాదులచే తృప్తి చెందుదురు. ఉచ్చస్వరముతో జపము చేయుటకంటే ఉపాంశు జపము పదిరెట్లు శ్రేష్ఠము. జిహ్వ మాత్రమే కదుపుచు చేసిన జపము నూరురెట్లు శ్రేష్ఠము. మానసిక జపము వెయ్యిరెట్లు శ్రేష్ఠము. మంత్ర జపమును పూర్వాభిముఖుడైగాని, దక్షిణాభిముఖుడైగాని ప్రారంభించవలయును. మౌనము అవలం బించి మితమైన ఆహారమును స్వీకరించుచు, ప్రణవాది మంత్రములన్నింటిని జపించ వలయును. ఆసనముపై కూర్చుండి దేవతను, ఆచార్యుని ఒక్కరుగా భావించుచు జపించ వలయును. పర్ణశాల, ఏకాంతమైన పవిత్ర ప్రదేశము, దేవాలయము, నదీతటాకాదుల తీరములు జపమునకు ఉత్తమ ప్రదేశములు, మంత్ర సిద్ధికోరువాడు గంజి, అపూపములు, పాలు, హవిష్యము ఆహారముగ తీసుకొనవలయును. సాధకుడు మంత్ర దేవతలకు సంబంధించిన తిథివారములందును కృష్ణపక్ష అష్టమి చతుర్దశులయందును గ్రహణాది పర్వములయందును మంత్ర దేవతలను పూజించ వల యును. అశ్విన్యాది నక్షత్రములకు క్రమముగ అశ్వినీ కుమారులు, యముడు, అగ్ని, ధాత, చంద్రుడు, రుద్రుడు, అదితి, బృహస్పతి, సర్పము, పితృ దేవతలు, భగుడు, అర్యమ, సూర్యుడు, త్వష్ట, వాయువు, ఇంద్రాగ్నులు, మిత్రుడు, ఇంద్రుడు, జలము, నిఋరుతి, విశ్వేదేవులు, విష్ణువు, వసు గణము, వరుణుడు, అజైకపాత్, అహిర్బుధ్న్యుడు, పూష అనువారు దేవతలు. ప్రతిపత్తు మొదలు చతుర్దశి వరకును తిథులకు క్రమముగ, అగ్ని, బ్రహ్మ, పార్వతి, గణేశుడు, నాము, స్కందుడు, సూర్యుడు, మహేశ్వరుడు, దుర్గ, యముడు, విశ్వేదేవతలు, విష్ణువు, కామదేవుడు, ఈశ్వరుడు, దేవతలు, పూర్ణమికి చంద్రుడును, అమావాస్యకు పితృదేవతలును దేవతలు. శివుడు దుర్గ బృహస్పతి, విష్ణువు, బ్రహ్మ, లక్ష్మి, కుబేరుడు, వీరు వరుసగ రవ్యాది వారములకు దేవతలు ఇపుడు లిపి న్యాసమును చెప్పెదను.
అకారాది వర్ణములను సాధకుడు వరుసగ, కేశాంతము, ముఖము, నేత్రద్వయము, శ్రవణ ద్వయము, నాసాపుట ద్వయము, కపోలద్వయము, ఓష్ఠద్వయము, హృదయము, ఊర్ధ్వదంతపంక్తి, అధోదంత పంక్తి, వీటిపై ‘ఓం, అంనమః’, ‘కేశాంతేషు’ ఇత్యాది విధమున చెప్పుచు, న్యాసము చేయవలయును. శిరస్సుయందు, ముఖవృత్తమునందు, దక్షిణ బాహు మూలమునందు, దక్షిణ కూర్పరమునందు, దక్షిణ మణిబంధమునందు దక్షిణ హస్తాంగుళి మూలమునందు, ఓం, అం, నమః యని ప్రారంభించి, ఓం, వం, నమః అను వరకు చెప్పుచు న్యాసము చేయవలయును. ఐదు వర్ణముల ఐదేసి వర్గములను, బాహుచరణ సంధుల యందును, పార్శ్వములందును షృష్ఠ, నాభి, హృదయములందును క్రమముగ వుంచవలయును. యకారాది వర్ణములను త్వక్, అసృక్, మాంస, మేధస్సు, అస్థి, మజ్జ, శుక్రములను ఏడు ధాతువులందును న్యాసము చేయవలయును. ప్రారంభమున ప్రణవమును, అంతమున నమఃను చేర్చి లిపీశ్వర, మాతృకేశ్వర న్యాసము చేయవలయును. శ్రీకంఠ, అనంత, సూక్ష్మ, త్రిమూర్తి, అమరేశ్వర, ఆర్దీశ, భావభూతి, తితీశ స్థాణుక, హర, దండీశ, భౌతిక, సద్యోజాత, అనుగ్రహేశ్వర, అక్రూర, మహాసేనులు స్వరమూర్తి దేవతలు. క్రోధీశ, చండీశ, పంచాంతక, శివోత్తమ, రుద్ర, కూర్మ త్రినేత్ర, చతురానన, అజేశ, శర్మ, సోమేశ, లాంగలి, దారుక, అర్ధనారీశ్వర, ఉమాకాంత, అషాడిన్, దండి, అద్రిమీన, మేష, లోహిత, శిఖి, చగలాండ, ద్విరండ, మహాకాల, కపాలి, భుజంగేశ, పినాకి, ఖడ్గీశ, బక, శ్వేత, భృగు, నకులీ, శివ, సంవర్తకులు వ్యంజన మూర్తి దేవతలు. శ్రీ కంఠాది రుద్రులను, వారి శక్తులతో క్రమముగ న్యాసము చేయవలయును. అంగముల న్యాసము కూడ చేయవలయును. అన్ని మంత్రములను సాంగములైననే సిద్ధి ప్రదము లగును. ఉల్లేఖకు వ్యోమబీజము కలిపి ఈ అంగన్యాసము చేయవలయును. హృదయాది అంగమంత్రములను అంతమునందు చేర్చి పలుక వలయును. హృదయము నందు ‘నమః’ శిరస్సునందు ‘స్వాహా’, శిఖ యందు ‘వషట్’, కవచము నందు ‘హూం’ నేత్రము నందు వౌషట్, హస్తమునందు ‘ఫట్’ చెప్పవలయును. నేత్ర న్యాసము లేనిచో పంచాంగ న్యాసమగును. మంత్రము నిరంగమైనచో స్వరూపముచేతనే అంగన్యాసముచేసి, వాగీశ్వరీదేవీ మంత్రమును ఒక లక్ష జపించి దశాంశము తిల హోమము చేయవలయును. లిపి దేవియైన వాగీశ్వరి తన హస్తములలో అక్షమాల, కలశం, పుస్తకము, కమలములను ధరించి యుండును. కవిత్వాదులను ఇచ్చును. అందుచే జప కర్మాది సిద్ధి కొరకై వాగీశ్వరి న్యాసము చేయవలయును. ఇట్లు చేయుటచే కవి కానివాడు కూడ కవియగును. మాతృకా న్యాసముచే అన్ని మంత్రములును సిద్ధించును. (293)
