అగ్ని మహా పురాణము
శిలావిన్యాస విధానము
ఈశ్వర ఉవాచ: పిదప ఈశాన్యము మొదలు వాయవ్య దిక్కువరకును, నాల్లు విదిశలలో ఉన్న చరకి మొదలగు నలుగురు మాతృకలను వాస్తు బాహ్యభాగమున పూజించవలెను. చరకికి సఘృతమాంసము, విదారికి పెరుగు, కమలములు, పూతనకు మాంసపిత్త మాంసములును సమర్పింపవలెను. పాపరాక్షసికి ఎముకలు, మాంసము, పిత్తము, రక్తము సమర్పింపవలెను. తూర్పున స్కందునకు కోడిమాంసముగల భోజనము, దక్షిణమున అర్యమకు కిచడి, పుష్పము, పశ్చిమ దిక్కునందు జంభకునకు రక్తమాంసములును సమర్పింపవలెను. ఉత్తరదిక్కునందు పిలిపిచ్చకు రక్త వర్ణాన్నము, పుష్పములు సమర్పించవలెను. లేదా సకల వాస్తు మండపమును కుశ, దధ్యక్షత, జలములతో పూజించవలెను. గృహనగరాదులలో ఎనుబది ఒక పదములతో గూడిన వాస్తు మండలమును పూజించవలెను. ఈ వాస్తు మండలము నందు త్రిపద షట్పదరజ్జువులను వెనుకటివలెనే నిర్మింపవలెను. దానియందు ఈశాది దేవతలు పదికులని చెప్పబడుదురు. ‘ఆప’ మొదలగునవి రెండేసి పదములపై ఉండును. మరీచ్యాది దేవతలు ఆరు పదములందును, బ్రహ్మ తొమ్మిది పదములందును ఉండును. నగర, గ్రా, ఖేటాదులందు శతపద వాస్తు విధానము కూడ చెప్పబడినది. వాటిలో రెండు వంశములు కోణగతములు. అవి సర్వదా దుర్జయములు, దుర్ధరములని చెప్పబడుచున్నది. శతపదవాస్తు మండలమునందు గూడ దేవాలయము నందు వలెనే న్యాసము ఉండును. అందు స్కందాదులు షట్పదాధిష్ఠాతలు చరకి మొదలగు వారు ఐదేసి పదములను అధిష్ఠించి యుందురు. రజ్జువంశాదులను వెనుకటి వలెనే చేయవలెను. దేశ రాష్ట్ర స్థాపనకొరకు వాస్తు మండలమున మూడువేల నాలుగు వందల పదములు ఉండును. మధ్యలో నుండు బ్రహ్మ అరువది నాలుగు పదములకు అధిపతి. మరీచి మొదలగు దేవతల అధికారమున ఏబదినాలుగు చొప్పున పదములుండును. ఆప మొదలగు ఎనమండుగురు దేవతలకు ముప్పది ఆరు చొప్పున స్థానములుండును. ఈశానుడు మొదలగు వారు తొమ్మిదేసి పదములకును, స్కందాదులు వందేసి పదములకును అధిపతులు. చరకి మొదలగువారి పదములు గూడ తదనుసారముగనే ఉండును. రజ్జు వంశాది కల్పన వెనుకటి వలెనే చేయవలెను. వాస్తుదేవపూజ ఇరువదివేల పదముల వాస్తు మండపముమీద కూడ చేయవచ్చును. దానియందు, దేశవాస్తువునందు వలె తొమ్మిది రెట్లు న్యాసము చేయవలెను. చితాస్థాపన సమయమున ఇరువది యైదు పదముల వాస్తు మండలము విహితము. దానికి వతాలమని పేరు. తొమ్మిది పదముల మండలము కూడ ఉండవచ్చును షట్కోణ, త్రికోణ, వృత్తాది మధ్యమున, చతురస్రవాస్తు మండలము కూడ విహితమైనది. ఈ వాస్తువు పునాదులు మొదలగు వాటికై త్రవ్వు గోతులకు ఉపయోగింపబడును. బ్రహ్మ శిలాత్మక వృషన్యాసమునందును శారాక నివేశనమునందును, మూర్తి స్థాపనమునందును గూడ వాస్తువు ఉపయోగించును. వాస్తు మండలమునందున్న సమస్త దేవతలకును క్షీరాన్నము నైవేద్యము చేయవలెను. ఉక్తానుక్తములగు సకలకార్యములందును, సాధారణముగ, ఐదు హస్తముల వెడల్పు, పొడవుగల వాస్తు మండలము నిర్మింపవలెను. గృహ ప్రాసాదమానానుసారముగ నిర్మించిన వాస్తు మండలమే సర్వదా శ్రేష్ఠమని చెప్పబడినది.
పరమేశ్వరుడు చెప్పెను: స్కందా! వాస్తు మండలమునకు బైట, ఈశాన్య దిక్కులందు వెనుకటివలె చరకి మొదలగు దేవతలను పూజించవలెను. ఒక్కొక్క దేవతకును మూడేసి హోమములు చేయవలెను. భూతబలి ఇచ్చి, నిశ్చితమగు లగ్నమునందు శిలా న్యాసోపక్రమము చేయవలెను. ఖాతమధ్య భాగమున ఆధారశక్తి న్యాసము చేయవలెను. అచట అనంతుని మంత్రముచే అభిమంత్రించిన ఉత్తమకలశము స్థాపింపవలెను. ‘లం పృథివ్యై నమః’ అనుమంత్రముతో ఆ కలశముపై పృథివీ స్వరూపమగు శిలను ఉంచవలెను. దానికి పూర్వాది దిక్కులందు క్రమముగ సుభద్రము మొదలగు ఎనిమిది కలశములను స్థాపించవలెను. మొదట వాటి కొరకై గోతులుత్రవ్వి, వాటిలో ఆధారశక్తి న్యాసము చేసిన పిమ్మట ఆ కలశలను ఇంద్రాది లోకపాలుల మంత్రములతో స్థాపించవలెను. పిదప ఆ కలశలపై నందాది శిలలను ఉంచవలెను. ఆ శిలలు తత్త్వ మూర్త్యధి దేవతా వస్త్రములతో కూడి యుండవలెను. గోడలపై మూర్తులను, అస్త్రాదుల చిహ్నములుంచినట్లు ఆ శిలలపై దిగ్వి దిక్కులను చక్కగా విభజించి ధర్మాది దేవతాష్టకమును స్థాపించవలెను. సుభద్ర మొదలగు నాలుగు కలశములపై నందాది శిలాచతుష్టయమును, నాలుగు కోణములందును స్థాపించవలెను. పిదప జయాది కలశచతుష్టయముపై అజితాది శిలాచతుష్టయమును, పూర్వాది దిక్చతుష్టయమున స్థాపింపవలెను. వాటి అన్నింటి పైనను, బ్రహ్మను, వ్యాపకుడగు మహేశ్వరుని స్థాపించి మందిర మధ్యమునందున్న ఆకాశమను పేరుగల అధ్వను చింతించవలెను. ఈ అన్నింటికిని బలి సమర్పించి విఘ్నదోష నివారణార్థమై అస్త్ర మంత్రమును జపించవలెను. పంచశిలా పక్షమున ఈ విధముగ చేయవలెను. మధ్య భాగమున సుభద్ర కలశముపై పూర్ణ అను శిలను స్థాపించవలెను. ఆగ్నేయాది దిక్కులందు క్రమముగా, పద్మాది కలశములపై, నందాది శిలలను స్థాపించవలెను. మధ్య శిలలేని పక్షమున నాలుగు శిలలనే మాతృ భావముతో పూజించి స్థాపించవలెను. ఆ శిలలను ఐదింటిని ఈ విధముగ ప్రార్థించవలెను.
సర్వ సందోహ స్వరూపిణివి, మహా విద్యవు అయిన ఓ పూర్ణా నీవు అంగిరోఋషి పుత్రికవు. ఈ ప్రతిష్ఠాకర్మయందు అంతయు చక్కగ పూర్ణమగునట్లు చేయుము. నందా! నీవు సమస్త పురుషులను ఆనందింపచేయుదానవు. నిన్ను ఇచట స్థాపించుచున్నాను. ఆకాశమునందు సూర్యచంద్ర నక్షత్రాదులు ప్రకాశించుచున్నంత వరకును నీవు పూర్తిగా తృప్తురాలవై ఈప్రాసాదమున స్థిరముగా ఉండుము, వసిష్ఠనందినియైన ఓ నందా! నీవు ప్రాణులకు ఆయువును, సంపూర్ణ మనోరథములను లక్ష్మిని ఇమ్ము. నీవీ ప్రాసాదమునందు స్థిరముగా ఉండి దీనిని యత్నముతో రక్షింపుము. కశ్యప నందినియైన భద్రా నీవు సమస్త లోకములకును సర్వదా కల్యాణము చేయుము. దేవీ! నీవు సర్వదా మాకు ఆయుర్మ నోరథలక్ష్ములను ఇచ్చుచుండుము. ఓ దేవీ! జయా నీవు సర్వదా మాకు లక్ష్మిని, ఆయువును ఇచ్చుచుండుము. భృగు పుత్రియైన జయా! నీవు ఇచట స్థాపితురాలవై ఇచటనే ఉండి ఈ గృహ స్వామినైన నాకు నిత్యము విజయైశ్వర్యాదులను ఇమ్ము. ఓ రిక్తా! నీవు అతిరిక్త దోషములను నశింపచేయుదానవు. సిద్ధిమోక్షదాయినివి అగుము. ఓ శుభా సంపూర్ణదేశ కాలములందు నీ నివాసము. ఈశ రూపిణీ నీవు సర్వదా ఈ ప్రాసాదమున ఉండుము. ఈ విధముగ ప్రార్థించి ఆకాశరూపమగు గృహమును ధ్యానించి, దానియందు మూడు తత్త్వములను న్యాసము చేయవలెను. యథావిధిగ ప్రాయశ్చిత్త హోమములు చేసి యజ్ఞ సమాప్తి చేయవలెను. (94)
