అగ్ని మహా పురాణము

Table of Contents

ఉత్తర కాండము

నారదుడు ఇట్లు చెప్పెను. రాజ్యము చేయుచున్న రామునివద్దకు పూజనీయులైన అగస్త్యాదులు వెళ్లిరి. ఋషులు ఇట్లు పలికిరి-నీవు ఇంద్రజిత్తును సంహరించితివి. ఈ విధముగ విజయవంతుడవైన నీవు ధన్యుడవు.

బ్రహ్మకు పులస్త్యుడను కుమారుడు కలిగెను. ఆతని కుమారుడు విశ్రవసుడు. అతని భార్య కైకసి. ఆతని ప్రథమ భార్య పుప్పోద్భవ. పెద్దదైన పుష్పోద్భవకు కుబేరుడు పుత్రుడుగ జనించెను. కైకసికి ఇరువది బాహువులును, పది ముఖములునుగల రావణుడు పుట్టెను. ఆతడు బ్రహ్మ ఇచ్చిన వరములచే దేవతల నందరిని జయించెను. నిద్రాపరవశుడైన కుంభకర్ణుడును, ధార్మికుడైన విభీషణుడును పుట్టిరి. వారికి శూర్పణఖ సోదరి. రావణునకు మేఘనాధుడను కుమారుడు పుట్టెను. రావణుని కంటె అధిక బలవంతుడైన ఆతడు ఇంద్రుని జయించి ఇంద్రజిత్తను పేరుపొందెను. దేవతాదుల క్షేమమునకై నీవు లక్ష్మణునిచే ఆతనిని చంపించితివి.

ఆ అగస్త్యాదులగు బ్రాహ్మణులు ఈ విధముగ చెప్పి రామునిచే పూజితులై వెళ్లి పోయిరి. దేవతలచేత ప్రార్థింపబడిన రాముని ఆజ్ఞచే శత్రుఘ్నుడు లవణుడను రాక్షసుని సంహరించెను. పూర్వము మథుర అను పట్టణము ఒకటి ఉండెను. రామునిచే ఆజ్ఞాపింపబడిన భరతుడు తీక్ష్ణములైన బాణములచే మూడు కోట్ల శైలూష పుత్రులను సంహరించెను. సింధు తీరము నందు నివసించు దుష్ట గంధర్వుడైన శైలూషునికూడ చంపెను. పిమ్మట ఆ దేశములలో పుత్రులైన తక్షుని, పుష్కరుని పాలకులనుగా చేసి భరతుడు శత్రుఘ్న సమేతుడై వచ్చి రాముని సేవించెను. ఈ విధముగ మానవ రూపుడైన రాముడు దుష్టులను యుద్ధమున సంహరించి, శిష్టులను పాలించెను.

లోకాపవాదముచే విడువబడిన సీతకు వాల్మీక్యాశ్రమములో జనించిన కుశలవులను, వారు చేసిన రామాయణ కథాశ్రవణమును బట్టి తెలిసికొని వాళ్ళను రాజ్యమునందు అభిషిక్తులను చేసెను. ఈ విధముగ రాముడు ఆ పరమాత్మనే నేను అను ధ్యానమునందు తత్పురుడై పదివేల సంవత్సరముల కాలము ధనస్సుచే లోకములను రక్షించుచు, అనేక యాగములు చేసి, దేవతలు కొనియాడ, పౌరులును, తమ్ములును వెంటరాగా స్వర్గమునకు వెళ్ళెను. సీతా పుత్రుడైన కుశుడు రాజ్యము పొందెను. అని అగ్ని పలికెను. వాల్మీకి నారదునినుండి విని రామాయణమును సవిస్తరముగ రచించెను. దీనిని వినువాడు స్వర్గమునకు వెళ్లును. (11)