అగ్ని మహా పురాణము

Table of Contents

విష్ణుపవిత్రారోపణ విధి

అగ్నిదేవుడు చెప్పెను: ప్రాతః కాలమున స్నానాదికముచేసి, ద్వారపాలుర పూజ చేసిన పిదప గుప్తస్థానమునందు ప్రవేశించి, వెనుక అధివాసితములైన పవిత్రకముల నుండి ఒక దానిని ప్రసాదముగా గ్రహింపవలెను. మిగిలిన వస్త్రములును, అలంకారములును, గంధమును, నిర్మాల్యమును తొలగించి భగవంతునకు స్నానము చేయించి పూజ చేయవలయును. పంచామృత, కషాయ, గంధోదకములచే స్నానము చేయించి ముందుగనే సిద్ధము చేసికొని ఉంచుకొనిన వస్త్ర, గంధ, పుష్పములను దేవునకు సమర్పింపవలెను. నిత్యహోమము చేసిన విధముగ అగ్నిలో హోమముచేసి, భగవంతుని స్తుతించి, ప్రార్థించి భగవచ్చరణములపై శిరస్సు ఉంచవలెను. తన సమస్త కర్మలను భగవంతునకు సమర్పించి పిదప నైమిత్తిక పూజ చేయవలెను. ద్వారపాల, విష్ణు, కుంభ, వర్ధనులను ప్రార్థింప వలెను. “అతో దేవాః” ఇత్యాది మంత్రముచేగాని, మూలమంత్రముచేగాని కలశముపై శ్రీహరిని ఈ విధముగా ప్రార్థింపవలెను. “ఓ కృష్ణా! కృష్ణా! నీకు నమస్కారము. ఈ పవిత్రమును గ్రహింపుము. ఇది ఉపాసకుని పవిత్రునిగ చేసి సంవత్సరముపాటు చేయు పూజయొక్క సంపూర్ణ ఫలమును ఇచ్చును. పరమేశ్వరా! నేను చేసిన పాపములను నశింపచేసి నన్ను పరమ పవిత్రుని చేయుము. సురేశ్వరా! నీ కృపచే నేను పరిశుద్ధుడనగుదును”. హృదయశిరోమంత్రములచే పవిత్రమునకును, తనకును అభిషేకముచేసి విష్ణుకలశమును ప్రోక్షించిన పిమ్మట దేవుని దగ్గరకు వెళ్ళవలెను. దేవుని రక్షాబంధమును తొలగించి, పవిత్రమును సమర్పించి- “ప్రభో! నేను నిర్మించిన ఈ బ్రహ్మసూత్రమును స్వీకరింపుము. ఇది కర్మ పరిపూర్తి సాధనము. నాయందు ఏ విధమైన దోషములను ఉండని విధముగ ఈ పవిత్రారోపణ కర్మను సంపన్నము చేయుము” అని ప్రార్థింపవలెను.

ద్వారపాలురకును, యోగపీఠాసనమునకును, ముఖ్య గురువులకును పవిత్రకము సమర్పింపవలెను. వీటిలో కనిష్ఠ పవిత్రకమును (నాభివరకు వచ్చుదానిని) ద్వారపాలురకును, మధ్యను పవిత్రకమును (తొడలవరకువచ్చు దానిని) యోగ పీఠాసనమునకును, ఉత్తమ పవిత్రకమును (మోకాళ్ళ వరకు వచ్చుదానిని) గురువులకును ఇవ్వవలెను. “నమో విష్వక్సేనాయ” అను మంత్రము చదువుచు విష్వక్సేనునకు కూడ పవిత్రకము సమర్పింప వలెను. అగ్నిలో హోమముచేసి అగ్నిలో ఉన్న విశ్వాదిదేవతలకు పవిత్రకము అర్పింపవలెను. పూజానంతరము ప్రాయశ్చితార్థమై మూలమంత్రముతో పూర్ణాహుతి చేయవలెను. అష్టోత్తర శతముతోగాని, ఐదు ఉపనిషన్మంత్రములతో గాని పూర్ణాహుతి ఇవ్వవలెను. అష్టోత్తర శతము లెక్కపెట్టుటకు, మణిమాలగాని, మందార పుష్పాదులుకాని ఉపయోగింపవలెను. చివర-“ఓ గరుడధ్వజా! నేను చేసిన ఈ వార్షికపూజ సఫలమగుగాక. వనమాల నీ వక్ష స్థలమును ప్రకాశింపచేయుచున్నట్లే ఈ పవిత్రక తంతువులును, వీటి ద్వారా నేను చేసిన పూజలో తెలిసిగాని తెలియకగాని కలిగిన లోపములను, విధినిర్వహణములో విఘ్నముల వలన కలిగిన లోపములను, కర్మలోపములను తొలగించి, పూజ పూర్ణముగ సఫలమగునట్లు చేయుము” అని ప్రార్థించవలెను.

ఈవిధముగ ప్రార్థనా నమస్కారములు, అపరాధ క్షమాపణముచేసి, పవిత్రకమును శిరస్సుపై ఉంచవలెను. తగు విధముగ బలి ఇచ్చి, వైష్ణవ గురువును దక్షిణలచే సంతోషపెట్టవలెను. ఒక దినమునగాని, ఒక పక్షముపాటు గాని భోజనవస్త్రాదులను ఇచ్చి బ్రాహ్మణులను సంతోషపెట్టవలెను. స్నాన సమయమున పవిత్రమును తీసివేసి పూజింపవలెను. ఉత్సవ దివసమునందు వచ్చువారిని ఎవరిని కాదనక అందరికిని తప్పక అన్నదానముచేసి తాను కూడా భోజనము చేయవలెను. విసర్జన దివసమున పవిత్రకమును పూజించి- “ఓ పవిత్రకమా! నేను చేసిన ఈ వార్షికపూజ సుసంపన్నమగునట్లు చేసితివి. ఇప్పుడు నిన్ను విసర్జించుచున్నాను. నీవు విష్ణు లోకమునకు పొమ్ము’ ‘అని ప్రార్థింపవలెను. ఉత్తర-ఈశాన్యములమధ్య విష్వక్సేన పూజచేసి, ఆతని పవిత్రకములను పూజించి వాటిని బ్రాహ్మణులకు ఇచ్చివేయవలెను. ఆ పవిత్రకములో ఎన్ని తంతువులున్నవో అన్నివేల యుగముల కాలము ఉపాసకుడు విష్ణులోకములో నివసించును. పవిత్రారోపణము చేసిన సాధకుడు తనవెనుక నూరు తరములను ఉద్ధరించి, తనకు పూర్వము పదితరముల వారిని తరువాతి పది తరముల వారిని విష్ణు లోకమునకు చేర్చును. తాను కూడ ముక్తుడు అగును. (36)