అగ్ని మహా పురాణము

Table of Contents

కశ్యప వంశ వర్ణనము

ఓ మునీశ్వరుడా! ఇపుడు కశ్యపునకు ఆదిత్యాదుల యందు పుట్టిన సంతానమును గూర్చి చెప్పెదను. చాక్షుష మన్వంతరమునందు తుషిత దేవతలుగా ఉన్నవారే మరల వైవస్వత మన్వంతరము నందు-విష్ణువు, శక్రుడు, త్వష్ట, ధాత, ఆర్యముడు, పూష, వివస్వంతుడు, సవిత, మిత్రుడు, వరుణుడు, భగుడు, అంశువు అను ద్వాదశ ఆదిత్యులుగా అదితియందు కశ్యపునకు జనించిరి. అరిష్టనేమి భార్యలకు పదునారుగురు పుత్రులు జనించిరి.

విద్వాంసుడైన బహుపుత్రునకు నలుగురు విద్యుత్తులు (ఒక దేవయోనులు) కుమార్తెలుగా పుట్టిరి. కృశాశ్వుని శ్రేష్ఠమైన సుర ఆయుధములు ప్రత్యంగిరసుని వలన జనించినవి. ప్రతియుగము నందును, సూర్యుని ఉదయాస్తమయములవలె, వీరి ఉదయాస్తమనములు (పుట్టుక, తిరోధానము) జరుగుచుండును.

దితికి కశ్యపుని వలన హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు అను కుమారులును, విప్రచిత్తి భార్యయైన సంహిక అను కుమార్తెయు జనించిరి. ఆమెకు రాహువు మొదలగు పుత్రులు పుట్టి సైంహికేయులని ప్రసిద్ధి పొందిరి.

హిరణ్యకశిపునకు ప్రసిద్ధమైన తేజస్సుగల అనుహ్రాదుడు, హ్రాదుడు, గొప్ప విష్ణుభక్తుడైన ప్రహ్లాదుడు, సంహ్రాదుడు అను నలుగురు పుత్రులు జనించిరి. హ్రాదుని పుత్రుడు ప్రదుడు, ఆయుష్మంతుడు, శిబి, బాష్కలుడు అనువారు సంహ్రాదుని కుమారులు. ప్రహ్లాదుని కుమారుడు విరోచనుడు. విరోచనునకు బలి అను పుత్రుడు కలిగెను. బలికి నూర్గురు కుమారులు జనించిరి. వారిలో బాణుడు జ్యేష్ఠుడు.

పూర్వ కల్పమునందు బాణుడు ఉమాపతిని అనుగ్రహింపచేసికొని ఆతని నుండి ఆతని సమీపముననే విహరించుట అను వరమును పొందెను.

స్వర్భానువునకు సుప్రభ అను కన్యయు, పులోమునకు శచియు జనించిరి. ఉపదనువు కుమార్తె హయశిరస్సు, వృషపర్వుని కుమార్తె శర్మిష్ఠ, పులోమకాలక అను ఇరువురును వైశ్వానరుని కుమార్తెలు. వారిద్దరును కశ్యపుని భార్యలు. వారికి కోట్ల కొలది పుత్రులు జనించిరి.

ప్రహ్రాదుని కులమునందు నాలుగు కోట్ల నివాతకవచులు పుట్టిరి. కశ్యపుని భార్యయైన తామ్రకు ఆరుగురు కుమారులును; కాకి, శ్యేని, భాసి, గృధ్రిక, శుచిగ్రీవ అను భార్యలకు కాకులు మొదలగునవి జనించినవి. తామ్రవలననే అశ్వములును, ఒంటెలును జనించినవి. వినతవలన అరుణుడును, ఆగరుడును పుట్టిరి. సురసనుండి వేయి సర్పములు పుట్టినవి. శేషుడు, వాసుకి, తక్షకుడు మొదలైన వేయిమంది కద్రువకు పుత్రులు. వీరందరును కోరలు కలిగినవారు. చాలకోపము కలవారు. భూమిపై నివసించువారు. జలములో వీరు రెక్కలు కలిగియుందురు. సురభి (కామధేనువు నందు) గోవులు, మహిష్యాదులును పుట్టెను. ఇరనుండి తృణాదులు పుట్టెను. ఆ కశ్యపముని వలననే ఖసయను అప్సరసయందు యక్షులు, రాక్షసులును, అరిష్టయందు గంధర్వులును జనించిరి. ఈ విధముగ కశ్యపుని నుండి చరాచరజగత్తు జనించినది. వీరి పుత్రాదులు అసంఖ్యాకులు, ఒకప్పుడు దేవతలు దానవులను జయించిరి. ఈ విధముగా పుత్రులు నశించగా దితి ఇంద్రుని సంహరింపగల కుమారుడు కావలెనని కోరుచు కశ్యపుని అనుగ్రహింపచేసికొని అట్టివానిని పొందెను.

ఆమె పాదప్రక్షాళనము చేసికొనకుండగనే నిద్రించెను. ఇంద్రుడు ఆ అవకాశమును చూచుకొని ఆమె గర్భమును ఛేదించెను. వారు (గర్భ ఖండములు) గొప్ప తేజస్సుగల వారును, ఇంద్రునికి సహాయము చేయువారును అగు నలుబది తొమ్మండుగురు మరుత్తులు అను దేవతలుగా అయిరి (నవి).

హరియు, బ్రహ్మయు, పృథువును రాజ్యాభిషిక్తుని చేసి దీనినంతను ఆతనికి ఇచ్చిరి. ప్రభువైన హరి క్రమముగ ఇతరులకు ఆయా రాజ్యాధికారములను ఇచ్చెను.

బ్రాహ్మణులకును, ఓషధులకును చంద్రుడు రాజు. జలములకు వరుణుడు, రాజులకు వైశ్రవణుడు, సూర్యులకు విష్ణువు, వసువులకు అగ్ని, మరుత్తులకు ఇంద్రుడు, ప్రజాపతులకు దక్షుడు, దానవులకు ప్రహ్లాదుడు, పితృదేవతలకు యముడు, భూతాదులకు శివుడు, శైలములకు హిమవంతుడు, నదులకు సముద్రుడు, గంధర్వులకు చిత్రరథుడు, నాగులకు వాసుకి, సర్పములకు తక్షకుడు, పక్షులకు గరుత్మంతుడు, గజేంద్రములకు ఐరావతము, గోవులకు వృషభము, మృగములకు పులి, వనస్పతులకు పక్షము, అశ్వములకు ఉచ్ఛైః శ్రవము ప్రభువులు. తూర్పున సుధన్వ, దక్షిణమున శంఖపదుడు, పశ్చిమమున కేతుమంతుడు, ఉత్తరమున హిరణ్య రోమకుడును పాలకులు. ఈ విధముగ అవాంతర సృష్టి (ప్రతి సర్గము) చెప్పబడినది. (19)