అగ్ని మహా పురాణము

Table of Contents

రాజధర్మములు -1

పుష్కరుడు పలికెను:

రాజు ఒక్కొక్క గ్రామమునకు ఒక్కొక్క అధిపతిని నియమించవలెను. పదేసి గ్రామములకు ఒక అధ్యక్షుని, నూరేసి గ్రామములకు మరొక అధ్యక్షుని నియమించవలెను. వారందరిపైనను మొత్తము రాష్ట్రమునకు శాసకుడుగ ఒకనిని నియమించవలెను. వారందరికిని వారివారి పనులను బట్టి వేరువేరుగా భృతిని నిర్ణయించవలెను. గూఢచారుల ద్వారా ప్రతిదినమువారి ప్రవృత్తులనుగూర్చి తెలుసుకొనుచుండవలెను. గ్రామములో ఏదైన దోషము (వ్యవహారము) ఉత్పన్నమైనచో గ్రామాధిపతి దానిని పరిష్కరించవలెను. తాను పరిష్కరింపజాలకున్నచో దశ గ్రామాధిపతి వద్దకు వెళ్ళి ఆ విషయములన్నియు ఆతనికి తెలుపవలెను. విషయమునంతను తెలిసికొనిన పిమ్మట దశ గ్రామాధిపతి ఆ దోషమును పరిష్కరించుటకు ప్రయత్నించవలెను. రాజ్యము సురక్షితముగా ఉన్నయెడలనే రాజునకు దానినుండి ధనాదులు లభించును. ధనవంతుడే ధర్మము నార్జించగలుగును. అతడే కామ సుఖములను అనుభవింపగలుగును. ధనములేనిచో గ్రీష్మమునందు నదుల నీరు ఎండి పోయినట్లు కార్యములన్నియు విఫలములై పోవును. ఈ ప్రపంచమునందు పతితునకును, దరిద్రునకును భేదమేమియు లేదు. పతితుని చేతినుండి ఎవరును ఏ వస్తువును తీసికొనరు. దరిద్రుడుకూడ ఏమియు లేనివాడగుటచే ఇతరుల కేమియు ఇవ్వజాలడు. భార్యకూడ దరిద్రుని మాటవినదు. అందుచే రాష్ట్రమును పీడించి, దానిని నిస్సారము చేయు రాజు చిరకాలము నరకములో నుండును. ఎట్లు గర్భవతియైన స్త్రీ తన సుఖము కొరకు చూచుకొనక గర్భస్థ శిశువు క్షేమానికై ప్రయత్నించునో, అట్లే రాజు కూడ ప్రజా రక్షణమునే సర్వదా దృష్టిలో నుంచుకొనవలెను. ప్రజలను రక్షించజాలని రాజు యజ్ఞము, తపస్సుచేసి ఏమి ప్రయోజనము? ప్రజలను బాగుగా రక్షించువాని గృహమే స్వర్గము. ప్రజలు కష్టపడుచున్న రాజు గృహమే నరకము. ప్రజల పుణ్య పాపములలో ఆరవవంతు రాజుకు చెందును. రక్షించుటచే ప్రజల పుణ్యమునందలి ఆరవ భాగమును పొందినట్లే రక్షించక పోవుటచే వారి పాపములోని ఆరవవంతుగూడ పొందును. పరస్త్రీ లంపటులగు దురాత్ముల నుండి పతివ్రతలను రక్షించుట రాజు ధర్మము. రాజ బంధువులచేతను, చోరుల చేతను, అధికారుల చేతను పీల్చివేయబడుచున్న ప్రజలను రక్షించవలెను. ప్రజలను బాగుగా రక్షించినచో వారు రాజుకు ఉపయోగపడుదురు. ప్రజలను రక్షించకున్నచో వారు పైన చెప్పిన రాజ బంధ్వాదులకు గ్రాసమై పోదురు. అందుచే రాజు దుష్టులను శిక్షించి శాస్త్రోక ప్రకారము ప్రజలనుండి పన్ను తీసికొనవలెను, రాజ్యమునందలి సగము ఆయమును కోశాగారములో రక్షించి సగము బ్రాహ్మణులకు ఈయవలెను. శ్రేష్ఠుడైన బ్రాహ్మణుడు దానినంతను గ్రహించి నాల్గవవంతు క్షత్రియులకును, ఎనిమిదవ భాగము వైశ్యులకును, పదునారవ భాగము శూద్రులకును ఇవ్వవలెను. ధనమును ధర్మానుసారముగా సత్పాత్రలకు దానము చేయవలెను. అసత్యము పలుకువానిని దండించవలెను. వాని ధనములో ఎనిమిదవ వంతు దండముగా తీసికొనవలెను. స్వామి ఎవరో తెలియని ధనమును రాజు మూడు సంవత్సరములపాటు తన వశములో నుంచుకొనవలెను. మూడు సంవత్సరముల లోపుగా ధన స్వామి వచ్చినచో ఆ ధనమును ఆతడు తీసికొనవచ్చును. ఆ సమయము దాటినచో ఆ ధనము రాజధనమై పోవును. మూడు సంవత్సరములలోపున వచ్చి ‘ఇది నా ధనము’ అని చెప్పుచు, ధనస్వామి దాని స్వరూపము, సంఖ్య మొదలగు వాటిని రాజు ఎదుట సరిగా చెప్పగలిగినచో ఆ ధనము పొందవచ్చును. చిన్న పిల్లవానికి చెందిన సొత్తును రాజు, అతనికి సమావర్తన సంస్కారమగు వరకును లేదా అతని బాల్యావస్థ తీరువరకును తన అధీనమునందు ఉంచుకొనవలెను. సంరక్షులు ఎవ్వరును లేని కాలమునందు పిల్లలు చిన్నవారైనపుడు స్త్రీల పోషణ బాధ్యతకూడ రాజు వహించవలెను.

పతివ్రతలైన స్త్రీలు వైధవ్యము పొందినను, రోగగ్రస్తులైనను వారిని కూడ ఈ విధముగనే రక్షించవలెను. అట్టి స్త్రీలు జీవించి ఉండగా వారి బంధువులెవ్వరైన వాళ్ళ ధనమును అపహరించినచో రాజు వారిని చోరులను దండించినట్లు దండించవలెను. చోరులు ప్రజల ధనమును అపహరించినపుడు రాజు పోయినంత ధనమును ప్రజకిచ్చి, దానిని రక్షాధికారుల నుండి రాబట్టవలెను. ధనము అపహరింప బడకపోయినను అపహరింపబడినట్లు చెప్పిన వానిని దండించి రాజ్యము నుండి బైటకు పంపివేయవలెను. ధనమును ఇంటిలోనివారే దొంగిలించినపుడు రాజు తన ధనమును ఈయవలసిన పనిలేదు. రాజ్యమునందలి ఆపణముల నుండి వారి ఆదాయములో ఐదవవంతు పన్నుగా రాజు గ్రహించవలెను. పరదేశము నుండి వస్తువులు దిగుమతి చేసుకొనునపుడు ఎంత ఖర్చు, నష్టము అగునో దానిని కాతా పుస్తకము ద్వారా పరిశీలించి, వస్తువుల మీద పన్ను ఎంత ఇచ్చుచున్నారో చూచి, ప్రతి వ్యాపారస్తుని మీదను ఆతనికి నష్టము కలుగకుండునట్లు పన్ను వేయవలెను. రాజు ఆదాయములోని ఇరువదవ వంతు మాత్రమే తీసికొనవలెను. ఎవరైన అధికారి అంతకంటె ఎక్కువ వసూలు చేసినచో ఆతని దండించవలెను. స్త్రీల నుండియు, సన్యాసుల నుండియు నావ దాటించుటకు కేవు తీసుకొనగూడదు. నావికుని పొరబాటుచేత ఏ వస్తువైన నష్టమైనచో ఆ నష్టము నావికుని నుండి వసూలు చేయవలెను. శూక ధాన్యములో (వరి, గోధుమ మొ!!) ఆరవవంతు, శింబి ధాన్యములో (శనగ మొ!!) ఎనిమిదవ వంతు పన్నుగా తీసికొనవలెను. అడవిలో పండు ఫలమూలాదులపై గూడ దేశకాలానుసారముగా పన్ను గ్రహించవలెను. పశువులలో ఐదవ భాగము, బంగారములో ఆరవ భాగము తీసికొనవలెను. గంధము, ఓషధులు, రసము, పుష్పములు, ఫలములు, మూలములు, పత్రములు, శాకములు, తృణము, వెదురు, చర్మ, వెదురు బుట్టలు, శిలా పాత్రలు, మధువు, మాంసము, నెయ్యి వీటిపై కూడ ఆదాయములో ఆరవ వంతు మాత్రమే వసూలు చేయవలెను.

బ్రాహ్మణుల నుండి ప్రియవస్తువేదియు లేదా పన్ను తీసికొనగూడదు. శ్రోత్రియులైన బ్రాహ్మణులు ఏ రాజు రాజ్యములో ఆకలితో బాధపడుచుందురో ఆ రాజ్యము రోగములు, కరువు, దోపిడీ దొంగలు వీటిచే పీడింపబడును. అందువలన బ్రాహ్మణుల విద్యా సదాచారాదులను తెలిసికొని వారికి అనుకూలమగు జీవికను ఏర్పాటు చేయవలెను. తండ్రి తన కుమారుని పాలించినట్లు రాజు సదాచారవంతులును, విద్వాంసులును అగు బ్రాహ్మణులను పాలించవలెను. రాజుచే రక్షింపబడి బ్రాహ్మణుడు ఆచరించు స్వధర్మానుష్ఠానముచే రాజు యొక్క ఆయుర్దాయము పెరుగును. రాష్ట్రము, కోశము కూడా వృద్ధి పొందును. శిల్పకారులు వేతనము తీసికొనకుండ, భోజనము మాత్రముచేసి మాసము నందు ఒక రోజు రాజు పనులు చేయవలెను. రాజ్యములో నివసించుచు శరీర పరిశ్రమచే జీవించు ఇతరులు కూడ ఈ విధముగనే మాసము నందు ఒక రోజు రాజు కార్యములు చేయవలెను. (223)