అగ్ని మహా పురాణము

Table of Contents

ధనుర్వేద వర్ణనము -2

అగ్నిదేవుడు పలికెను:

ద్విజుడు పూర్తి పొడవుగల ధనస్సును తయారుచేయించి, దానిని బాగుగా కడిగి తుడిచి, దానిని, గదాధ్యాయుధములను గూడ శుభ్రముచేసి వాటిని, యజ్ఞ భూమిలో నుంచవలెను. పిదప బాణములు గ్రహించి, కవచము ధరించి, ఏకాగ్రచిత్తుడై అంబుల పొడిని వీపుపై కుడి చంకదగ్గర గట్టిగా బంధించవలెను. అట్లు చేయుటచే విలక్ష్యమగు బాణము కూడ ఆ తూణీరము నందు స్థిరముగా నుండును. కుడి చేతితో తూణీరమునుండి బాణమును వెలికితీయవలెను. ఎడమచేతితో ధనస్సును అచటినుండి పైకెత్తి, దాని మధ్య భాగమున బాణ సంధానము చేయవలెను. చిత్తము నందు విషాదమేమియు లేనివాడై, ఉత్సాహ సంపన్నుడై నారిపై బాణపుంఖము నుంచి, సింహకర్ణమను ముష్టితో నారిని బాణపుంఖముతో నొక్కిపెట్టి, సమముగ సంధించి, బాణమును లక్ష్యము వైపు విడువ వలెను. ఎడమచేతితో బాణము విడువవలెనన్నపుడు ఎడమచేతిలో బాణము ధరించి, కుడి చేతిలో ధనస్సు ముష్టిని పట్టుకొనవలెను. లాగినపుడు బాణము ఫలము (అగ్రము) గాని, చెవివరకు వచ్చునట్లు నారిపై బాణము నుంచవలెను. ఆ సమయమున బాణమును తర్జన్య అంగుష్ఠమునే కాక మధ్యమ అంగుళితో కూడ పట్టుకొనవలెను. బాణ ప్రయోగ విధి నెరిగిన యోధుడు ధనస్సునో ముష్టితో గట్టిగా పట్టుకొని, మనస్సును, దృష్టిని లక్ష్యముపై నిలిపి, బాణము శరీరము కుడివైపునకు వచ్చునట్లు చేసికొని లక్ష్యమువైపు విడువవలెను. ధనుర్దండము నేలపై నిలపెట్టినపుడు లలాట సమీపమునకు వచ్చునంత పొడవు ఉండవలెను. దానిపై చంద్రక బాణమును సంధించి, బాగుగా లాగి లక్ష్యముపై విడువవలెను. ఈ విధముగ ఒక బాణము విడచిన పిమ్మట, వెంటనే తూణీరము నుండి, తర్జన్య అంగుష్ఠములతో మాటిమాటికి బాణము పైకితీసి, దానిని మధ్యమ అంగుళి చేత గూడ తన వశమునందు ఉండునట్లుచేసికొని, శీఘ్రముగ లక్ష్యము వైపు విడువవలెను. నలువైపులను, దక్షిణమునందును లక్ష్యవేధము చేయుచు పోవలెను. మొదటి నుండియు నాలుగు వైపుల లక్ష్యమును కొట్టుచు బాణ ప్రయోగము చేయుట అభ్యసించవలెను.

 పిదప అతడు తీక్ష్ణ, పరావృత్త, గత, నిమ్న, ఉన్నత, క్షిప్ర వేధలను అభ్యసించవలెను. పైన చెప్పిన వేధ్య లక్ష్య స్థానములను కొట్టుటకు సత్త్వమును చూపుచు విచిత్రము, దుస్తరమగు పద్ధతిలో అనేక పర్యాయములు హస్తములచే బాణములను తీయుట విడచుట అను పనులచే ధనుస్తర్జనము చేయవలెను. విప్రవరా! వేధ్యములలో అనేక భేదములున్నవి. దృఢము, దుష్కరము, చిత్రదుష్కరమని అవి మూడు విధములు. ఆ మూడును మరల రెండేసి విధములు-నతనిమ్నము, తీక్ష్ణము అనునవి దృఢవేధ్య భేదములు. నిమ్నము, ఊర్ధ్వగతము అని దుష్కర వేధ్యభేదములు. మస్తక పనవ, మధ్యము అని చిత్ర దుష్కర వేధ్య భేదములు. ఈ విధముగ వీరుడు వేధ్యగణముల వేధించుటలో ప్రవీణుడై ముందు కుడి ప్రక్కనుండి గాని, ఎడమ ప్రక్కనుండి గాని శత్రు సైన్యముపై ఆక్రమణము చేయవలెను. దానివలన లక్ష్యముపై విజయము లభించును. ప్రయోగ నిపుణులు వేధ్యవిషయమున ఈ విధానమునే గ్రహించి ప్రతిపాదించి యున్నారు.

యోధునకు వేధ్యముకంటె గూడ భ్రమణము ఉత్తమమని చెప్పబడినది. లక్ష్యమును తనబాణము పుంఖముచే ఆచ్ఛాదించి దానివైపు దృఢముగ శరసంధానము చేయవలెను. భ్రమణశీలము, చంచలము, అగు లక్ష్యమును అన్ని వైపుల నుండియు కొట్టవలెను. దానిని భేదించి, భేదింది, సర్వ విధముల దానికి పీడ కలిగించవలెను. కర్మయోగ విధానము తెలిసిన వాడు ఈ విధముగ తెలిసికొని ఉచిత విధముగ ఆచరించవలెను. మనోనేత్ర దృష్టులను లక్ష్యముపై నిలుప గలిగినవాడు యముని కూడ జయించగలుగును. (250)