అగ్ని మహా పురాణము

Table of Contents

గృహస్థ వృత్తి

పుష్కరుడు పలికెను: బ్రాహ్మణుడు తన కర్మచే జీవించవలెను. అట్లు జీవించజాలని బ్రాహ్మణుడు క్షత్రియ, వైశ్య, శూద్ర ధర్మములచే గూడ జీవించవచ్చును. కాని సంకర జాతులవారి ధర్మము నవలంబింపరాదు. ద్విజుడు ఆపత్కాలమున కృషి, వాణిజ్యము, గో రక్షణము, వడ్డీవ్యాపారముకూడ చేయవచ్చును. కాని గో క్షీరాదులు, బెల్లము, లవణము, క్షారము, మాంసము మొదలైనవాటి వ్యాపారము చేయరాదు. కర్షకులు భూమిని బ్రద్దలు కొట్టుట, ఓషధులను ఛేదించుట, కీటక పిపీలికాదులను చంపుట మొదలగు వాటివలన కలిగిన పాపమును యజ్ఞముచేతను, దేవతా పూజచేతను తొలగించుకొనగలరు. ఎనిమిది ఎద్దుల హలము ధర్మ సమ్మతము, జీవిక కోరువారికి ఆరు ఎద్దుల హలము, క్రూరులకు నాలుగు ఎద్దుల హలము, ధర్మ హింసకులకు రెండెద్దుల హలము చెప్పబడినది. ఋతము (కళ్లములో మిగిలిన వరివెన్నుల ధాన్యపు గింజలు ఏరికొని వాటిపై మాత్రము జీవించుట) చేతగాని, అమృతము (అయాచితముగా లభించినది)చే గాని, మృతము (భిక్షాన్నము)చేత గాని, ప్రమృతము (వ్యవసాయము)చేతగాని, సత్యానృతముల (వర్తకము)చేతగాని జీవించ వలెను. శ్వవృత్తి (సేవావృత్తి)తో ఎన్నడును జీవించరాదు. (152)