అగ్ని మహా పురాణము

Table of Contents

చతుర్దశీ వ్రతములు

అగ్ని దేవుడు పలికెను:

భుక్తి ముక్తి ప్రదాయకములగు చతుర్దశీ వ్రతములను చెప్పెదను. కార్తిక చతుర్దశి నాడు నిరాహారుడై శివుని పూజించవలెను. అది మొదట ప్రతిమాసము శివచతుర్దశినాడు వ్రతము-శివ పూజనము ఒక సంవత్సరము పాటు జరుపవలెను. ఇట్లు చేయువాడు భోగ, ధన, దీర్ఘాయుః సంపన్నుడగును. మార్ఘశీర్ష శుక్ల పక్షమున అష్టమీ-తృతీయా, ద్వాదశీ-చతుర్దశులలో ఒకనాడు మౌనవ్రతము అవలంబించి, ఫలములు మాత్రము భుజించుచు దేవతాపూజ చేయవలెను. కొన్ని ఫలములు త్యజించి, వాటిని దానము చేయవలెను. ఈ విధముగ ఫలచతుర్దశీ వ్రత మాచరించువాడు రెండు పక్షముల చతుర్దశీ-అష్టమీ తిథులయందు ఉపవాస ముండి శివుని పూజించవలెను. ఇట్లు రెండు పక్షములందును చతుర్దశీవ్రతము చేయువానికి స్వర్గము లభించును. కృష్ణ పక్ష అష్టమీ-చతుర్దశులందు రాత్రి భోజనము మాత్రము చేయువాడు ఇహలోకమున అభీష్ట భోగములను పరలోకమున శుభగతిని పొందును. కార్తిక కృష్ణ చతుర్దశినాడు స్నానమాచరించి, ధ్వజాకారమగు వెదురుగడపై ఇంద్రుని పూజించువాడు సుఖవంతుడగును. పిదప ప్రతి మాసము నందును శుక్ల చతుర్దశినాడు కుశలతో విష్ణు విగ్రహము నిర్మించి దానిని జలపూర్ణ కలశముపై నుంచి పూజించవలెను. ఆనాడు ఒకప్రస్థము బియ్యము పిండితో అప్పములు వండి సగము బ్రాహ్మణునకు దానముచేసి, సగము తాను ఉపయోగించవలెను. నదీ తటమున ఈ వ్రత పూజాదులు చేసి, అనంతవ్రత కథ వినిపించవలెను. పదునాలుగు ముడులుగల అనంతసూత్రము నిర్మించి దానిని అనంతునిగ పూజించి- ఓ వాసుదేవా! అనంతమైన సంసార మహాసముద్రమునందు మునిగిన మమ్ము ఉద్దరించుము. నీ అనంత రూపము నందు మమ్ములను కలుపుకొనుము. ఓ అనంతరూపా! నీకు నమస్కారము’ అను అర్థముగల మంత్రము పఠించుచు, చేతికిగాని కంఠమునకు గాని కట్టుకొనవలెను. ఈ విధముగ అనంత వ్రతమాచరించువాడు పరమానంద సంపన్నుడగును.(192)