అగ్ని మహా పురాణము

Table of Contents

గణేశపూజావిధి

ఈశ్వరుడు పలికెను: విఘ్న వినాశమునకై గణపతిపూజను గూర్చి చెప్పెదను. ఇది సకలాభీష్టములను ఇచ్చును. “గణంజయాయ స్వాహా హృదయాయనమః; ఏక దంష్ట్రాయ హుం ఫట్ శిరసే నమః, అచల కర్ణినే నమో నమః శిఖాయైనమః, గజవక్త్రాయ నమో, నమః కవచాయ నమః, మహోదరాయ చణ్డాయ నమః, నేత్రాభ్యాం నమః, సుదణ్డ హస్తాయ నమః అస్త్రాయ నమః”అని అంగన్యాసములు చేసికొనవలెను. ముఖ్య కమల మండలముపై దళములందు, క్రింది దళములందును గణ, గురు, గురుపాదుకా, శక్తి, అనంత, ధర్మములను, పూజించి, కమలకర్ణిక మీద బీజమును పూజింపవలెను. తీవ్రా, జ్వాలినీ, నందా! భోగదా, కామరూపిణీ, ఉగ్రా, తేజోవతీ, సత్యా, విఘ్న నాశినీ అను తొమ్మిది పీఠశక్తులను పూజించవలెను. పిమ్మట చందన చూర్ణమును ఆసనముగ సమర్పించవలెను. “యం” అనునది శోషక వాయు బీజము, “రం” అగ్ని బీజము. “లం” పృథివీ బీజము, “వం” అమృతబీజము, “ఓం లమ్బోదరాయ విద్మహే మహోదరాయ ధీమహి, తన్నో దన్తః ప్రచోదయాత్” అనునది గణేశ గాయత్రీ మంత్రము, గణపతి, గణాధిప, గణేశ, గణనాయక, గణక్రీడ, వక్రతుండ, ఏకదంష్ట్ర, మహోదర, గజవక్త్ర, లంబోదర, వికట, విఘ్ననాశన, ధూమ్రవర్ణులను, మహేంద్ర దిక్పాలకులను గణపతి పూజ అంగముగ పూజించవలెను. (71)