అగ్ని మహా పురాణము

Table of Contents

వాసుదేవ ప్రతిష్ణా విధి

హయగ్రీవుడు చెప్పెను-బ్రహ్మదేవా! పిండికాస్థాపనము కొరకై, విద్వాంసుడు దేవాలయము లోని గర్భగృహమును ఏడు భాగములుగా విభజింపవలెను. ప్రతిమను బ్రహ్మభాగము నందు స్థాపింపవలెను. దేవ, మనుష్య, పిశాచ భాగములందు ఎన్నడును స్థాపింపగూడదు. బ్రహ్మభాగములో కొంతభాగము విడచి, దేవభాగమనుష్య భాగములలో కొన్ని భాగములు గ్రహించి, ఆ భూమిపై ప్రయత్నపూర్వకముగ పిండికను స్థాపింపవలెను. నపుంసక శిలపై రత్నన్యాసము చేయవలెను. నృసింహ మంత్రముతో హోమము చేసి, ఆ మంత్రముతోనే రత్నన్యాసము కూడ చేయవలెను. వ్రీహులు, రత్నములు, లోహము మొదలగు ధాతువులు, చందనము మొదలగు పదార్థములను పూర్వాది దిశలందును, మధ్యభాగమునందును ఉంచిన కుండములలో, తన అభిరుచిని అనుసరించి ఉంచవలెను. పిమ్మట ఇంద్రాది మంత్రములతో పూర్వాదిదిశలలో ఉన్న గుంటలను గుగ్గులముచే కప్పి, రత్నన్యాసవిధి పూర్తియైన పిదప గురుశలాకలతో కూడిన కుశసమూహముల చేతను, సహదేవమను ఓషధి చేతను ప్రతిమను బాగుగా రాయవలెను. బైటను, లోపలను తగు సంస్కారములు చేసి పంచగవ్యములతో శుద్ధి చేయవలెను. పిమ్మట కుశోదకము, నదీజలము, తీర్థజలము ఆ ప్రతిమపై ప్రోక్షించవలెను.

హోమము కొరకు ఇసుకతో ఒకటిన్నర హస్తముల విస్తారముగల, చతురస్రము, సుందరము అగు వేదిని ఏర్పరుపవలెను. ఎనిమిది దిక్కులందును, యథా స్థానమున కలశములు ఉంచవలెను. ఆ పూర్వాది కలశలకు ఎనిమిది రంగులు వేయవలెను. పిమ్మట అగ్నిని వేదిపై స్థాపించి, కుశలతో సంస్కారముచేసి ‘త్వమగ్నే ద్యుభిః’ అను మంత్రముతోను, గాయత్రీ మంత్రముతోను సమిధలను హోమము చేయవలెను. అష్టాక్షర మంత్రముతో నూట ఎనిమిది ఆజ్యాహుతులుచేసి, పూర్ణాహుతి ఇవ్వవలెను. పిమ్మట నూరుపర్యాయములు మూలమంత్రము జపించి అభిమంత్రించిన శాంత్యుదకమును మామిడి చిగుళ్ళతో ఇష్టదేవత శిరస్సుపై చల్లవలెను. ఆ సమయమున “శ్రీశ్చలక్ష్మీశ్చ” ఇత్యాది మంత్రము పఠింపవలెను. “ఉత్తిష్ఠ బ్రహ్మణస్పతే” అను మంత్రముతో ప్రతిమను పైకి ఎత్తి, బ్రహ్మ రథముపైనుంచి, “తద్విష్ణోః” ఇత్యాది మంత్రము పఠించుచు దేవాలయమువైపు తీసికొని వెళ్ళవలెను. అక్కడ శ్రీహరి ప్రతిమను పల్లకీపై ఎక్కించి నగరమునందు గీత-వాద్య వేదమంత్రాది ధ్వనులతో ఊరేగించి, తిరిగి దేవాలయ ద్వారము వద్దకు తీసికొని రావలెను.

పిమ్మట గురువు సువాసినీ స్త్రీల చేతను, బ్రాహ్మణుల చేతను, ఎనిమిది మంగళ కలశముల ఉదకముతో శ్రీహరికి స్నానముచేయించి, మూలమంత్రోచ్చారణ పూర్వకముగ గంధాద్యుపచారములు సమర్పించి పూజచేసి “అతో దేవాః” ఇత్యాది ఋక్కు చదువుచు వస్త్రాద్య ష్టాంగార్ఘ్యము ఇవ్వవలెను. పిమ్మట స్థిరలగ్నమున “దేవస్యత్వా” ఇత్యాది మంత్రము చదువుచు ఆ అర్చా విగ్రహమును ప్రతిష్ఠచేయవలెను. “సచ్చిదానంద స్వరూపా! త్రివిక్రమా! నీవు మూడు పాదములతో ముల్లోకములను ఆక్రమించితివి. నీకు నమస్కారము” అని ప్రార్థింపవలెను. ఈ విధముగ పండితుడు ప్రతిమను పిండిక మీద స్థాపించి, “ధ్రువాద్యౌః” “విశ్వతశ్చక్షుః” ఇత్యాది మంత్రములు చదువుచు స్థిరము చేయవలెను. పంచగవ్యములతో స్నానము చేయించి, గంధోదకముతో ప్రతిమా ప్రక్షాళనముచేసి, సకలీకరణానంతరము శ్రీహరికి సాంగోపాంగ సాధారణ పూజ చేయవలెను.

ఈ విధముగ ధ్యానించవలెను-“ఆకాశము శ్రీ మహావిష్ణువు యొక్క విగ్రహము; పృథివి ఆతని పీఠము (సింహాసనము).” పిమ్మట పరమాత్ముని శరీరము తైజస పరమాణువులతో ఏర్పడినట్లు భావన చేయుచు ఇట్లు చెప్పవలెను, ఇరువదియైదు తత్త్వములలో వ్యాపించి యున్న జీవుని ఆవాహన చేయుచున్నాను. ఆ జీవుడు చైతన్య స్వరూపుడు. పరమానందరూపుడు; జాగ్రత్స్వప్న సుషుప్త్వవస్థా శూన్యుడు. దేహేంద్రియ, మనో, బుద్ధి, ప్రాణ, అహంకార రహితుడు. బ్రహ్మ మొదలు కీటకము వరకును ఉన్న సకలజగత్తు నందును, వ్యాపించి, అందరి హృదయములలో ఉన్నవాడు. పరమేశ్వరా! నీవే ఆ జీవ చైతన్యము. నీవు హృదయమునుండి ప్రతిమలో ప్రవేశించి స్థిరముగా నుండుము. ఈ ప్రతిమను సజీవము చేయుము. అన్ని దేహములందును అంగుష్ఠ మాత్ర పురుషుడు ఉన్నాడు. అతడు జ్యోతిః స్వరూపుడు; జ్ఞాన స్వరూపుడు; ఏకమాత్ర అద్వితీయ పరబ్రహ్మ.” ఈ విధముగ ప్రతిమను సజీవముచేసి ప్రణవముతో భగవంతుని మేల్కొల్పవలెను. పిదప భగవంతుని హృదయము స్పృశించి పురుషసూక్తమును జపించవలెను. దీనికి సానిధ్యకరణ కర్మ” యని పేరు. భగవద్ధ్యానము చేయుచు ఈ రహస్య మంత్రమును పఠించవలెను.

“ప్రభూ! నీవు సకలదేవాధీశుడవు. సంతోష వైభవ స్వరూపుడవు. నీకు నమస్కారము. జ్ఞానవిజ్ఞానములు నీ స్వరూపము. త్రిగుణాతీతము. నీవు అంతర్యామివి; పరమాత్మవు. నాశ రహితుడగు పురాణ పురుషుడవు. నీకు నమస్కారము. మహావిష్ణూ! నీవు ఇచట సన్నిహితుడవు కమ్ము. నీ పరమతత్త్వము, జ్ఞానమయ శరీరము ఒక సంఘాతముగ ఏర్పడి ఈ అర్చా విగ్రహము నందు ఆవిర్భూతమగుగాక”. ఈ విధముగ శ్రీహరి సాన్నిధ్యకరణము చేసి ఆతని ఎదుట బ్రహ్మాది పరివార దేవతలను స్థాపింపవలెను. శ్రీహరి దర్శనార్థమై వచ్చువారి యాత్రలను బట్టియు, వర్షాదులను బట్టియు శ్రీహరి అచట సన్నిహితుడై యున్నాడను విషయమును గ్రహింపవలెను. నమస్కరించి, స్తుతించి, స్తోత్రాదులు పఠించి, అష్టాక్షర్యాది మంత్రములు జపించుచు భగవంతుడు అచట సన్నిహితుడై ఉన్నాడని గ్రహింపవలెను,

పిమ్మట ఆచార్యుడు దేవాలయమునుండి బైటకు వచ్చి ద్వారమువద్ద నున్న చండ, ప్రచండులను ద్వారపాలకులకు పూజ చేయవలెను. మరల మండపములోనికి వెళ్ళి గరుత్మంతుని స్థాపింపవలెను. అన్ని దిక్కులందును ఆయా దిక్పాలకులను, ఇతర దేవతలను స్థాపించి, శంఖ చక్రాదులకు గూడ పూజ చేయవలెను. అందరు పార్షదులకును, భూతములకును బలి సమర్పింపవలెను. (యజమానుడు) ఆచార్యునకు గ్రామ, వస్త్ర, సువర్ణాడులను దక్షిణగా ఈయవలెను. యజ్ఞమునకు ఉపయోగించు ద్రవ్యములు కూడ ఆచార్యునకు ఈయవలెను. ఋత్విక్కులకు ఆచార్య దక్షిణలో సగము ఈయవలెను. పిమ్మట బ్రాహ్మణులకుగూడ దక్షిణ ఇచ్చి భోజనము పెట్టవలెను. అచటకు వచ్చు బ్రాహ్మణునెవ్వనిని అడ్డు పెట్టరాదు. అందరిని సత్కరించవలెను. పిమ్మట గురువు యజమానునకు ఫలము ఈయవలెను. భగవద్విగ్రహ ప్రతిష్ఠ చేసిన పుణ్యాత్ముడు తన వంశీయులు అందరిని తనతో పాటు శ్రీమహావిష్ణువు సమీపమునకు తీసికొనిపోవును. ఇది అందరు దేవతలకును సాధారణమైన విధానము. కాని ఆయా దేవతల మూలమంత్రములు మాత్రము వేరువేరుగ ఉండును. మిగిలిన కార్యములు అన్నియు సమానమే. (60)