అగ్ని మహా పురాణము

Table of Contents

నానా మంత్రాది కథనము

పరమేశ్వరుడు చెప్పెను: అభిషేకానంతరము దీక్షితుడు శివ, విష్ణు, సూర్యాది దేవతలను పూజించవలెను. శంఖ భేర్యాది వాద్య ధ్వనులతో దేవతలకు పంచగవ్యములతో స్నానము చేయించువాడు, తన కులమును ఉద్ధరించి తాను దేవలోకమునకు వెళ్లును. దేవతల శరీరమునకు ఆజ్యాభ్యంగనము చేయుటచే, కోటి సహస్రవర్ష సంచితమైన పాపము భస్మమైపోవును. ఒక ఆడకము (అడ్డెడు) నెయ్యి మొదలైన వాటితో దేవతలకు స్నానము చేయించిన మనుష్యుడు దేవతయగును. చందనము పూసి గంధాదులతో దేవ పూజ చేయువానికి గూడ అదే ఫలము లభించును. కొంచెము ప్రయాసతో మాత్రమే స్తోత్ర పాఠముచే దేవతాస్తుతి చేసినచో భూతభవిష్య జ్ఞానము, మంత్ర జ్ఞానము, భోగ మోక్షములు లభించును. ఎవరైన మంత్రమునకు సంబంధించిన శుభాశుభ ఫలములను గూర్చి ప్రశ్నించినచో, ఆ ప్రశ్న వాక్యములో నున్న అక్షరములు లెక్కించి, రెండుచే భాగించగా ఒకటి శేషించినచో శుభము, శూన్యముగాని, రెండుగాని శేషించినచో అశుభము. మూడుచే భాగించినచో మూలధాతు రూపజీవుని విషయము తెలియును. ఒకటి శేషించినచో వాత జీవుడు, రెండు శేషించినచో పిత్తజీవుడు, మూడు శేషించినచో కఫ జీవుడు, నాలుగుతో భాగించినచో బ్రాహ్మణాది వర్షబుద్ధి కలుగును. ఐదుచే భాగించినచో భూతతత్త్వాది జ్ఞానము కలుగును. ఈ విధముగనే జయ పరాజయాది జ్ఞానముకూడ కలుగును, మంత్ర పదాంతమునందు ఒక త్రికము (మూడు బీజాక్షరములు) న్నను, అధిక బీజాక్షరములు ఉన్నను, ప, మ, కలు ఉన్నను వీటిలో మొదటిది అశుభము, మధ్యలో నున్నది మధ్యమము, చివరిది శుభము. చివర సంఖ్యా సమూహమున్నచో అది జీవనకాలము పది సంవత్సరములు అని సూచించును. దశ సంఖ్య ఉన్నచో పది సంవత్సరముల పిమ్మట ఆ మంత్ర సాధకుడు తప్పక మరణించును. సూర్య, గణపతి, శివ, దుర్గా, లక్ష్మీ, విష్ణు మంత్రముల అక్షరములతో, అంగుష్ఠస్పృష్టమైన కమలపత్రము మీద, గోమూత్రాకార రేఖపై, ఒక త్రికము (మూడు అక్షరములు)తో ప్రారంభించి పండ్రెండు త్రికముల వరకును వ్రాయవలెను.

అరువది నాలుగు కోష్ఠముల మండలము చేసి దానిపై యం, హం, యం అను బీజాక్షరముల త్రికములను మొదటి కోష్ఠమునుండీ ఎనిమిది కోష్ఠమువరకు వ్రాయవలెను. ఈ స్థానములపై పాచిక వేయుటచేతగాని, స్పృశించుటచేత గాని శుభాశుభజ్ఞానము కలుగును. పాచిక లేదా స్పర్శ విషమ సంఖ్యాకల దానిపై పడినచో శుభము, సమ సంఖ్య గల దానిపై అశుభము. ‘యం హం హం’ అను మూడు బీజాక్షరముల ఎనిమిది త్రికములు ధ్వజాదులగు ఎనిమిది త్రికములు ధ్వజాదులగు ఎనిమిది ఆయములకు ప్రతీకములు. వీటిలో సమమైనవి అశుభములు, విషమములు శుభప్రదములు. ‘క’ మొదలగు అక్షరములను పదునారు స్వరములతోడను, అట్లే పదునారు స్వరములను కాద్యక్షరములతో చేర్చి, వాటికి ‘అం ఈం’ అను పల్లవములను కూర్చవలెను. వీటి మొదట ‘హ్రీం’, చివర ‘నమః’ చేర్చవలెను, ఈ విధముగ పూజావినియుక్తములగు ఈ మంత్రముల ప్రస్తారముచే ఇరువదివేల నూట అరువది మంత్రములు ఏర్పడును. సరస్వతీ, చండీ, గౌరీ, దుర్గా మంత్రములకు ‘ఆం హ్రీం’ అను బీజములును, శ్రీదేవీ మంత్రమునకు ‘ఆం శ్రీం’ అను బీజములును, సూర్య మంత్రమునకు ‘ఆం క్షౌం’లును, శివ మంత్రమునకు ‘ఆం హూం’ లును, గణేశ మంత్రములకు ‘ఆం గం’లును, విష్ణువునకు ‘ఆం అం’లును ఉండును. కాది వ్యంజనములు అకారాది షోడశ స్వరములు కలిసి మొత్తము ఏబది యొక్క అక్షరములగును. ఈ విధముగ సస్వరములగు కాద్యక్షరములను ఆదియందును, సస్వర క్షాది కాంతాక్షరములను అంతమునందును ఉంచగా సంపూర్ణ మంత్రమగును.

మొత్తము మండలముల సంఖ్య 1440 కాగా సూర్య, శివ, దేవీ, దుర్గా, విష్ణువుల మండలములు మూడు వందల అరువది చొప్పున అగును. అభిషిక్తుడైన గురువు ఈ అన్ని మంత్రముల జపము, దేవతల ధ్యానముచేసి, శిష్యునకు పుత్రునకును దీక్ష ఇవ్వవలెను. (91)