అగ్ని మహా పురాణము

Table of Contents

భూపరిగ్రహ వర్ణనము

హయగ్రీవుడు చెప్పెను: బ్రహ్మ! ఇపుడు నేను విష్ణ్వాది దేవతా ప్రతిష్ఠను గూర్చి చెప్పెదను; సావధానముగ వినుము. ఈ విషయము నేను చెప్పిన పంచరాత్ర సప్త రాత్రములను ఋషులు మానవలోకమునందు ప్రచారము చేసిరి. ఆది హయశీర్ష తంత్రము, త్రైలోక్య మోహనతంత్రము, వైభవ తంత్రము, పుష్కర తంత్రము, ప్రహ్లాద తంత్రము, గార్గ్య తంత్రము, గాలవ తంత్రము, నారదీయ తంత్రము, శ్రీ ప్రశ్న తంత్రము, శాండిల్య తంత్రము, ఈశ్వర తంత్రము, సత్య తంత్రము, శౌనక తంత్రము, వసిష్ఠోక్త జ్ఞాన సాగర తంత్రము, స్వాయంభువ తంత్రము, కాపిల తంత్రము. తార్క్ష్య (గారుడ) తంత్రము, నారాయణీయ తంత్రము, ఆత్రేయ తంత్రము, నారసింహ తంత్రము, ఆనంద తంత్రము, బౌధాయన తంత్రము, అష్టాంగ తంత్రము, విశ్వతంత్రము అని అవి మొత్తము ఇరువదియైదు తంత్రములు.

ఈ తంత్రముల ప్రకారము- మధ్య దేశాదులలో జనించిన ద్విజుడు దేవతా విగ్రహముల ప్రతిష్ఠ చేయవలెను. కచ్ఛ దేశము, కావేరీతటవర్తి దేశము, కోంకణ దేశము, కామరూప, కళింగ, కాంచీ, కాశ్మీర దేశములు వీటియందు పుట్టిన బ్రాహ్మణుడు దేవ ప్రతిష్ఠాదికము చేయరాదు. ఆకాశము, వాయువు, తేజస్సు, జలము, పృథివి అను మహాభూతములే పంచరాత్రములు. చేతనా శూన్యములై, అజ్ఞానాంధకారముచే కప్పబడినవి పంచరాత్రరహితములు, “నేను పాపవిముక్తుడనైన పరబ్రహ్మను, విష్ణువును” అను భావన కలవాడే దేశికుడు అగును. అతడు బాహ్యలక్షణములు వేషాదికము ఏవియు లేకున్నను తంత్రవేత్తయైన ఆచార్యుడుగా చెప్పబడినాడు.

దేవతా విగ్రహమును నగరాభిముఖముగ స్థాపింపవలెను; దేవతల పృష్ఠభాగము నగరము వైపు ఉండగూడదు. దేవాలయ నిర్మాణమును కురుక్షేత్రగయాది తీర్థ స్థానములందు గాని, నదీ సమీపమునందు గాని చేయవలెను. బ్రహ్మాలయమును సగర మధ్యము నందును, ఇంద్రాలయమును నగరమునకు తూర్పునను నిర్మించిన ఉత్తమమని చెప్పబడినది. అగ్నిదేవునకు, మాతృకలకును ఆగ్నేయ దిక్కునందును, భూతగణములకు, యమధర్మరాజునకును దక్షిణమునను, చండికా, పితృగణ, దైత్యాదులకు నైరృతి దిక్కునందును, వరుణునకు పశ్చిమమునందును, వాయుదేవునకు, నాగులకు వాయవ్య దిక్కునందును, యక్షులకు లేదా కుబేరునకు ఉత్తరమునందును చండీశ మహేశునకు ఈశాన్యమునందును ఆలయమును నిర్మింపవలెను. విష్ణ్వాలయము అన్ని దిక్కులందును నిర్మింపవచ్చును. బుద్ధిమంతుడెన్నడును, పూర్వము నుండియు ఉన్న దేవాలయమును చిన్నదిచేసి చిన్న దేవాలయమునుగాని, సమానమైనదానినిగాని, విశాలమైన దానినిగాని నిర్మింపరాదు. ఏదైన ఒక దేవాలయమునకు సమీపమున దేవాలయము నిర్మించునపుడు రెండు దేవాలయముల మొత్తము ఎత్తుకు రెట్టింపు సీమా ప్రదేశము విడచి నూతన దేవాలయమును నిర్మింపవలెను. విద్వాంసుడు రెండు దేవాలయములకును పీడ కలుగకుండునట్లు చూడవలెను.

భూమి శోధనానంతరము భూ పరిగ్రహము చేయవలెను. పిమ్మట ప్రాకారము సరిహద్దు వరకు మినుములు, పసుపు, పేలాలు, పెరుగు, సక్తువులు వీటితో భూతబలి ఇవ్వవలెను. అష్టాక్షర మంత్రము చదువుచు, “ఈ ప్రదేశము నందు నివసించు రాక్షస పిశాచాదులు ఇచటి నుండి తొలగిపోవుగాక, నేను ఇచట మహావిష్ణ్వాలయమును నిర్మింపనున్నాను” అని చెప్పుచు, ఎనిమిది దిక్కులందును సక్తువులు చల్లవలెను. భూమిని నాగలిచే దున్నించి, ఆవులను దానిపై నడిపింపవలెను. ఎనిమిది పరమాణువులు ఒక రథరేణువు. ఎనిమిది రథరేణువులు ఒక త్రసరేణువు. ఎనిమిది త్రసరేణువులు ఒక వాలాగ్రము. ఎనిమిది వాలాగ్రములు ఒక లిక్ష. ఎనిమిది లిక్షలు ఒక మూర. ఎనిమిది మూరలు ఒక యవమధ్యము. ఎనిమిదియవలు ఒక అంగుళము. ఇరువదినాలుగు అంగుళములు ఒక కరము. ఇరువది యెనిమిది అంగుళములు ఒక పద్మహస్తము. (39)