అగ్ని మహా పురాణము

Table of Contents

శ్రీ స్తోత్ర వర్ణనము

పుష్కరుడు పలికెను: పూర్వము తన రాజ్యలక్ష్మిని స్థిరముగా ఉంచుకొనుటకై ఇంద్రుడు ఏ విధముగ లక్ష్మీ స్తవము చేసెనో అట్లే రాజు విజయము కొరకు లక్ష్మీస్తవము చేయవలెను. ఇంద్రుడు పలికెను: సకలలోక జననియు, సముద్ర సంభవయు, వికసిత కమలనేత్రయు, విష్ణువక్షః స్థితయు అగు లక్ష్మికి నమస్కారము. ఓ లోకపావనీ! నీవే సిద్ధివి; స్వాహా, స్వధా, సంధ్యా, రాత్రి, ప్రభా, భూతి, మేధా, శ్రద్ధా, సరస్వతీ రూపిణివి. ప్రకాశించుదానవు ముక్తిరూప ఫలదాత్రివి అగు ఓ దేవీ! యజ్ఞవిద్య, మహావిద్య, గుహ్య విద్య, ఆత్మవిద్య, ఆన్వీక్షికి, త్రయి, వార్త, దండనీతి కూడ నీవే. నీవు సౌమ్యురాలవు, నీతో నిండిన ఈ జగత్తుకూడ సౌమ్యమైనది. దేవీ! గదాధారియైన దేవదేవుడైన శ్రీమహా విష్ణువు యొక్క సర్వయజ్ఞ స్వరూపము, యోగులచే ధ్యానింపబడునది అయిన శరీరమును నీవు తప్ప ఎవరు అధిష్ఠించగలరు? దేవీ! నీవు విడచినంతనే ఈ భువనత్రయము వినష్టమై పోయినది. నీచే ఇప్పుడు పోషింపబడుచున్నది. మహాదేవీ! నీ దృష్టిపడగనే మానవులకు భార్య, పుత్రులు, గృహము, స్నేహితులు, ధాన్యము, ధనము మొదలగునవి నిత్యము లభించును. నీ దృష్టిచే చూడబడిన పురుషులకు ఆరోగ్యము, ఐశ్వర్యము, శత్రుపక్ష వినాశనము, సుఖము-ఇవన్నియు దుర్లభములు కావు. సర్వ భూతములకును నీవే తల్లివి, దేవదేవుడైన శ్రీమహావిష్ణువు తండ్రి. ఈ చరాచర జగత్తునంతను, నీవు, శ్రీమహావిష్ణువు వ్యాపించి యున్నారు. ఓ సర్వపావనీ! నీవు ఎన్నటికిని, నా కీర్తిని, ధనాగారమును, అన్నకోష్ఠమును, గృహమును పరివారమును, శరీరమును, భార్యను విడచివెళ్ళకుము. శ్రీ మహావిష్ణు వక్షస్థలముపై నివసించుదానా! నా పుత్రులను, స్నేహితులను, పశువులను, అలంకారములను విడిచి వెళ్ళకుము. ఓ నిర్మలురాలా! నీచే విడువబడిన వారు, సత్యము చేతను, సమతాశౌచముల చేతను, శీలము మొదలగు గుణములచేతను పరిత్యజింప బడుదురు. నీచే చూడబడినవారు నిర్గుణులైనను వారికి శీలాది సకల గుణములును, కులైశ్వర్యాదులును లభించును. ఓ దేవీ! నాచే చూడబడినవాడే శ్లాఘ్యుడు, గుణవంతుడు, ధన్యుడు, కులీనుడు, బుద్ధిమంతుడు, శూరుడు, విక్రాంతుడు, జగత్తును పోషించు ఓవిష్ణువల్లభా! నీవు ఎవని విషయమున పరాఙ్ముఖురాలవగుదువో ఆతని శీలాది సకల గుణములును వెంటనే విగుణములగును. బ్రహ్మదేవుని నాలుక గూడ నీ గుణములను వర్ణింపజాలదు. ఓ పద్మాక్షీ! దేవీ! అనుగ్రహింపుము. మమ్ములను ఎన్నడును విడువకుము. పుష్కరుడు పలికెను. ఈ విధముగ స్తుతింపబడిన లక్ష్మి ఇంద్రునకు కోరికను, రాజ్య స్థైర్యమును యుద్ధ విజయాదులను అనుగ్రహించెను. తన స్తోత్రమును పఠించు వారికిని, వినువారికిని భుక్తి ముక్తులను వరముగా ప్రసాదించెను. అందుచే మానవుడు సర్వదా శ్రీ స్తోత్రమును చదువవలెను. వినవలెను. (237)