అగ్ని మహా పురాణము

Table of Contents

బ్రహ్మచర్యాశ్రమ వర్ణనము

పుష్కరుడు పలికెను:

ఇపుడు ఆశ్రమవంతులగు వారి ధర్మములను చెప్పెదను. ఇది భుక్తి ముక్తి ప్రదము. స్త్రీల ఋతుకాలము పదునారు రాత్రులు. వీటిలో మొదటి మూడు రాత్రులు నింద్యములు. పురుష సంతానము గోరువారు మిగిలిన వాటిలో సరిసంఖ్యగల రాత్రులలో స్త్రీ సమాగమము చేయవలెను. అది గర్భాదాన సంస్కారము. గర్భవతియైనది అని నిశ్చయము కలుగగనే, శిశువు కదలక పూర్వమే పుంసవన సంస్కారము చేయవలెను. ఆ రోజున పుంలింగ నక్షత్ర మున్నచో మంచిది. బాలుడు పుట్టిన తరువాత నాభిచ్ఛేదమునకు పూర్వమే జాతకర్మ సంస్కారము చేయవలెను. సూతకము తొలగిన తరువాత నామకరణము-బ్రాహ్మణుని పేరుకు చివర శర్మా అనియు క్షత్రియునకు వర్మా అనియు వైశ్య, శూద్రులకు క్రమముగ గుప్త, దాస అనియు చేర్చుట మంచిది. ఆ సంస్కారముచేయు సమయమున పత్ని ఇతడు నీ పుత్రుడు అని చెప్పుచు భర్త ఒడిలో బాలుని ఉంచవలెను. పిదప కులాచారము ప్రకారము చూడాకరణము చేయవలెను. బ్రాహ్మణునకు ఉపనయన సంస్కారము గర్భాష్టమము నందు, లేదా ఎనిమిదవ యేటను, క్షత్రియునకు గర్భైకాదశమునందును, వైశ్యునకు గర్భ ద్వాదశమునందును చేయవలెను. బ్రాహ్మణాదులకు షోడశాద్యబ్దములు దాటిన పిమ్మట ఉపనయనము చేసియు ప్రయోజనములేదు.

మూడు వర్ణముల వారికిని వరుసగ ముంజ, ప్రత్యంచా, వల్కలములతో చేసిన మేఖల విధింపబడినది. ఇట్లే వరుసగా మృగ, వ్యాఘ్ర, అజచర్మలు, పలాశ, పిప్పల, బిల్వ దండములు విధింపబడినవి. బ్రాహ్మణ బ్రహ్మచారి దండము ఆతని కేశముల వరకును, క్షత్రియుని దండము లలాటమువరకును, వైశ్యుని దండము లలాటము వరకును పొడవు ఉండవలెను. దండములు వంకరగాను, చర్మరహితముగాను ఉండగూడదు. నిప్పు తగిలినవి కాకూడదు. మూడు వర్ణముల వారికి వస్తములు వరుసగా పత్తి పట్టు ఉన్ని-వీటితో నిర్మించినవి కావలెను. బ్రాహ్మణ బ్రహ్మచారి భిక్ష అడుగునపుడు భవచ్ఛబ్దమును వాక్యము మొదటి ప్రయోగించవలెను. క్షత్రియుడు వాక్య మధ్యమునందును, వైశ్యుడు అంతము నందును ప్రయోగించవలెను. తప్పక లభించును అనుచోటనే ప్రథమభిక్ష యాచించవలెను. స్త్రీలకు వివాహముతప్ప మిగిలిన అన్ని సంస్కారములును మంత్ర రహితముగ జరుపవలెను. వివాహము మాత్రము వైదికమంత్రముతో జరుపవలెను. శిష్యునకు ఉపనయనము చేసి గురువు ముందుగా సదాచారము, శౌచాచారము, అగ్ని కార్యము, సంధ్యోపాసన నేర్పవలెను. తూర్పు ముఖముగా కూర్చుండి భోజనము చేయువాడు ఆయుర్దాయమును అనుభవించును. దక్షిణాభిముఖముగా చేయువాడు కీర్తిని, పశ్చిమ ముఖముగా చేయువాడు ఐశ్వర్యమును, ఉత్తరాభిముఖముగా చేయువాడు సత్యమును అనుభవించును. బ్రహ్మచారి సాయం ప్రాతః కాలములందు అగ్ని కార్యము చేయవలెను. అపవిత్ర వస్తువును హోమము చేయరాదు. హోమ సమయమున చేతి వ్రేళ్ళను దూరముగా ఉంచుకొనవలెను. మధు మాంసములను, జనులతో కూడికను నృత్య సంగీతములను, హింసను, ఇతర నిందను, అశ్లీల సంభాషణమును విడువవలెను. దండములను ధరించి ఉండవలెను. ఆ దండము విరిగిపోయిన దానిని జలమునందు విసర్జించి క్రొత్తది గ్రహింపవలెను. వేదాధ్యయన అనంతరము గురువుకు దక్షిణ సమర్పించి వ్రతాంత స్నానము చేయ వలెను. లేదా నైష్ఠిక బ్రహ్మచారియై ఆ జీవనాంతము గురుకులమునందే ఉండిపోవలెను. (153)