అగ్ని మహా పురాణము

Table of Contents

యుద్ధ జయార్ణవ జ్యోతిశాస్త్ర సారము

అగ్నిదేవుడు పలికెను:

శంకరుడు పార్వతికి చెప్పిన ప్రకారము నేను ఇప్పుడు యుద్ధజయార్ణవ ప్రకరణ సారమైన సమయమును, మంత్రమును, ఔషధములు మొదలగువాటిని వర్ణించి చెప్పెదను. పార్వతి: దేవా! దేవతలు అసురులపై విజయము ఎట్లు సాధించిరి? ఆ విషయమును యుద్ధ జయార్ణవోక్త శుభాశుభ వివేకాది జ్ఞానమును గూర్చి వర్ణింపుము అని ప్రశ్నించెను. శంకరుడు చెప్పెను: పరమాత్మేచ్ఛ ప్రకారము పదునైదు అక్షరముల ఒక శక్తి ఆవిర్భవించినది, దాని నుండియే చరాచర జీవుల సృష్టి ఏర్పడినది. ఆ శక్తిని ఆరాధించుటచే మానవుడు అన్ని విషయములను తెలిసికొనగల్గును. ఇపుడు ఐదు మంత్రములతో ఏర్పడిన మంత్రపీఠమును వర్ణించెదను. ఆ మంత్రములు అన్ని మంత్రముల జీవన మరణములందు ఉన్నవి. ఋగ్యజుఃసామాథర్వ వేద మంత్రములు ప్రథమ మంత్రములు. సద్యోజాత మంత్రములు ద్వితీయ మంత్రములు. బ్రహ్మ విష్ణు రుద్రులు తృతీయ మంత్ర స్వరూపులు. ఈశ్వరుడు: సప్త శిఖలు గల అగ్ని, ఇంద్రాది దేవతలు-వీరు చతుర్థ మంత్ర స్వరూపులు, అ, ఇ, ఉ, ఏ, ఓ, అను ఐదు స్వరములు పంచమమంత్ర స్వరూపులు. ఈ స్వరములకే మూల బ్రహ్మ అని కూడ పేరు. కఱ్ఱలో వ్యాపించి ఉన్న అగ్ని ఆ కఱ్ఱను అంటించకుండ పైకి కనబడనట్లు శరీరమున నున్న శివశక్తి ప్రీతి జ్ఞానము లేకుండ కాజాలదు. పార్వతీ! ఓంకార స్వర భూషితమైన శక్తి మొదట ఆవిర్భవించినది. తరువాత బిందువు ఏకార రూపమున పరిణతమైనది. పిదప ఓంకారమునందు శబ్ద మావిర్భవించినది. దాని నుండి ఉకారము ఆవిర్భవించినది. ఈ ఉకారము హృదయములో శబ్దము చేయుచు ఉండును. అర్ధచంద్రుని నుండి మోక్షమార్గ ప్రదర్శకముగ ఇకారము ఆవిర్భవించినది. పిదప భోగమోక్షముల నిచ్చు అవ్యక్త ‘అ’ కారము ఆవిర్భవించినది. ఆ ‘అ’కారము స్వర శక్తిమత్తు. ప్రవృత్తి నివృత్తి బోధకము. ‘అ’ కారము ప్రాణ(శ్వాస) రూపమున శరీరమునందు స్థిరముగా నుండును. దీనికే ‘ఇడు’ అని పేరు. ‘ఇ’ కారము ‘ప్రతిష్ఠ’ అను పేరుతో రస రూపమునను, పాలక స్వరూపమునను ఉండును, దీనికే ‘పింగల’ అని పేరు. ‘ఈ’ అను స్వరమును క్రూరశక్తి యందును, హరబీజము (ఉకారము) శరీరములో అగ్ని రూపమున నుండును. ఇదియే సమానబోధిక విద్య. దీనిని ‘గాంధారి’ అందురు. దీనిలో దహనాత్మక శక్తి ఉన్నది. ‘ఏ’ కారము శరీరములో జలరూపమున నున్నది. దీనిలో శాంతి క్రియ ఉన్నది. ‘ఓ’ కారము శరీరములో వాయు రూపమున ఉన్నది. ఇది అపాన, వ్యాన, ఉదానాది పంచ స్వరూపములను పొంది, స్పర్శ చేయుచు, గతి శీలమై యుండును.

పంచ స్వరముల సంమిలిత సూక్ష్మరూపమగు ఓంకారము ‘శాన్త్యతీతము’ అను పేరుతో బోధితమై శబ్దగుణకమగు ఆకాశము రూపమున నుండును. ఈ విధముగ ఏర్పడిన ఐదు స్వరములకు క్రమముగా కుజ, బుధ, గురు, శుక్ర, శనులు. కకారాది వర్ణములు ఈ స్వరములకు క్రింద నుండును. ఇవే ప్రపంచమూలకారణములు. వీటి వలననే అన్ని చరాచర పదార్థముల జ్ఞానము కలుగును. ఇపుడు విద్యాపీఠ స్వరూపమును చెప్పెదను. దీనియందు ఓంకారము శివరూపముగ చెప్పబడినది. సాక్షాత్తు ఉమసోమ (అమృత) రూపిణి. ఈమెనే వామా, జ్యేష్ఠా, రౌద్రీ నామములతో కూడ వ్యవహరింతురు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులే వరుసగ మూడు గుణములు, సృష్టి, స్థితి, సంహార కారణభూతులు. శరీరములోపల మూడు రత్ననాడులు ఉన్నవి; వీటికి స్థూల, సూక్ష్మ, పరలని పేరు. ఇవి శ్వేతవర్ణములు. వీటి నుండి సర్వదా అమృతము స్రవించుచుండును. దానిచే ఎల్లప్పుడును ఆత్మ తడుపబడుచుండును. దీనిని ఈ విధముగ దివారాత్రులు ధ్యానించ వలెను. దేవీ! అట్టి సాధకుని శరీరము అజరమగును. అతడు శివ సాయుజ్యమును పొందును. మొదట అంగుష్ఠాదులందును, నేత్రములందును, దేహమునందును అంగన్యాసము చేసి, పిదప మృత్యుంజ యార్చన చేసి యాత్ర చేయువాడు యుద్ధాదులందు విజయవంతుడగును. ఆకాశము శూన్యము, నిరాధారము, శబ్దగుణకము. వాయువునందు స్పర్శగుణమున్నది. అది అడ్డముగా ప్రసరించుచు స్పృశించును. రూపము (అగ్ని) ఊర్ధ్వగతి గలది. జలము అధోగతి గలది. గంధగుణముగల పృథివి అన్ని స్థానములను విడచి మధ్య యందు ఉండి, అన్నింటికిని ఆధారముగా నుండును. శివుడు నాభి మూలమునందు కంద (దుంప)రూపమున ఉన్నాడు. శక్తి సముదాయముతో గూడ సూర్య, చంద్ర, విష్ణువులును, పంచతన్మాత్రలతో దశ ప్రాణములును అచటనే ఉన్నవి. ఆ శివమూర్తి కాలాగ్నివలె దేదీప్యమానమై సర్వదా ప్రకాశించుచుండును. అదే చరాచర జీవలోకమునకు ప్రాణము. ఆ మంత్రపీఠము నష్టమైనపుడు వాయురూపుడగు జీవుడు నశించినట్లు తెలిసికొన వలెను. (124)