అగ్ని మహా పురాణము

Table of Contents

పిండికాది లక్షణము

హయగ్రీవుడు చెప్పెను: బ్రహ్మదేవా! ఇపుడు నేను పిండిక లక్షణము చెప్పెదను. పిండిక పొడవు ప్రతిమతో సమానముగ ఉండును. ఎత్తు మాత్రము ప్రతిమలో సగము ఉండును. పిండికకు అరువది నాలుగు కోష్ఠకములు ఏర్పరచి, క్రింది రెండు పంక్తులు విడచి, దానిపైనఉన్న కోష్ఠము నాలుగువైపుల, రెండు పార్శ్వములందును, లోపలినుండి తుడిచివేయవలెను. అట్లేపై రెండుపంక్తులు విడచి దానిక్రిందనున్న కోష్ఠమును లోపలినుండి తుడిచివేయవలెను. ఈ విధముగ రెండు పార్వములందును చేయవలెను. రెండు పార్వముల మధ్యనున్న రెండురెండు చతుష్మములను గూడ తుడిచి వేయవలెను. పిమ్మట దానిని నాలుగు భాగములుగా విభజించి పై రెండు పంక్తులను మేఖలగా గ్రహించి, దాని ప్రమాణములో సగము ప్రమాణము ఉండునట్లుగ దాని యందు గొయ్యి తవ్వవలెను. రెండు పార్శ్వ భాగములందును సమానముగ ఒక్కొక్క భాగము విడచి బైట పదమును నాలి (తూము) నిర్మించుటకై విడువవలెను. దానియందు తూము నిర్మింపవలెను. మూడు భాగములలోని ఒక భాగమునకుముందు నీరు ముందుకు పోవుటకై మార్గము ఉండవలెను.

వివిధాకారముగల ఈ పిండికకు “భద్ర” అని పేరు. లక్ష్మీదేవి ప్రతిమ ప్రమాణము ఎనిమిది జానలుండవలెను. ఇతరదేవుల ప్రతిమలుకూడ ఇట్లే ఉండవలెను. రెండు కను బొమ్మలును నాసిక కంటె ఒక యవ అధికముగా ఉండవలెను. నాసిక వాటి కంటె ఒక యవ తక్కువ ఉండవలెను. ముఖ గోలకము నేత్ర గోలకముకంటె పెద్దదిగా ఉండవలెను. అది ఎత్తుగాను, వంకరటింకరగాను ఉండకూడదు. నేత్రములు పెద్దవిగా మూడును పావు యవల ప్రమాణములో ఉండవలెను. ముఖము పొడవు ఒక కోణము నుండి మరియొక కోణమువరకు ఎంత ఉండునో సూత్రముతో కొలిచి కర్ణ పాశము అంత ఉండునట్లు చేయవలెను. దాని పొడవు పైన చెప్పిన సూత్రము కంటె కొంచెము ఎక్కువ పొడవే ఉండవలెను. రెండు స్కంధములు కొంచెము వంగి ఒక కళ తగ్గినట్లు చేయవలెను. కంఠము పొడవు ఒకటిన్నర కళల పొడవు ఉండవలెను. వెడల్పుకూడ అంతే ఉండవలెను. రెండు ఊరువుల విస్తారము కంఠముకంటె ఒకనేత్రము తక్కువ ఉండవలెను. మోకాళ్ల చిప్పలు, పిండలి, పాదములు, పీఠము, నితంబము, కటిభాగము మొదలగు వాటిని యథా యోగ్యముగ కల్పింపవలెను. చేతి వ్రేళ్లు పెద్దవిగా ఉండవలెను. పరస్పరావరుద్ధములు కాకూడదు. పెద్ద వ్రేలి కంటె చిన్న వ్రేళ్ళు ఏడవ వంతు తక్కువ ఉండవలెను. పిక్కలు, తొడలు, కటి వీటి పొడవు క్రమముగ ఒక్కొక్క నేత్రము తక్కువ ఉండవలెను.

శరీర మధ్య ప్రాంతము గుండ్రముగా ఉండవలెను. కుచములు దగ్గరగా బలిసి ఉండవలెను. స్తనములు జానెడు ఉండవలెను. కటి ప్రదేశము వాటికంటె ఒకటిన్నర కళలు పెద్దదిగా ఉండవలెను. మిగిలిన చిహ్నములన్నియు వెనుకటివలెనే. లక్ష్మికి కుడిచేతిలో కమలము, ఎడమచేతిలో బిల్వ ఫలము ఉండవలెను. చామరము ధరించిన స్త్రీలు ఆమె పార్శ్వములందు నిలిచి ఉండవలెను. పెద్ద ముక్కుగల గరుత్మంతుడు ఎదుట నిలిచి ఉండవలెను. ఇపుడు చక్రాంకిత (సాల గ్రామాది) మూర్తులను గూర్చి చెప్పెదను. (45)