అగ్ని మహా పురాణము

Table of Contents

ప్రాసాద దేవతాస్థాపన భూతశాస్త్ర విధానము

అటు పిమ్మట హయగ్రీవుడు ఇట్లు చెప్పెను: బ్రహ్మదేవా! దేవాలయములో స్థాపింపదగిన దేవతలను గూర్చి చెప్పెదను వినుము. పంచాయతన దేవాలయమునందు, మధ్యనున్న ప్రధానాలయమున వాసుదేవుని స్థాపింపవలెను. మిగిలిన నాలుగు ఆలయములలో ఆగ్నేయ ఆలయమునందు వామనుని, నైరృతాలయమునందు నరసింహుని, వాయవ్యాలయమునందు హయగ్రీవుని, ఈశాన్యాలయము నందు వరాహమూర్తిని స్థాపింపవలెను లేదా మధ్య యందు నారాయణుని స్థాపించినచో ఆగ్నేయమున దుర్గాదేవిని, నైరృతియందు సూర్యుని, వాయవ్యమున బ్రహ్మను, ఈశాన్యమున లింగరూపుడుగా శివుని స్థాపింపవలెను లేదా ఈశాన్యమున రుద్రమూర్తిని స్థాపింపవలెను. లేదా ఎనిమిది దిక్కులందును ఎనిమిది ఆలయములను, మధ్యయందు ఒక ఆలయమును నిర్మించి, వాటిలో మధ్యనున్న ఆలయమునందు వాసుదేవుని స్థాపించి, తూర్పు మొదలగు దిక్కులందు పరశురాముడు మొదలగు ముఖ్యమైన తొమ్మిది అవతారములను, ఇంద్రాది లోకపాలులను స్థాపింపవలెను. లేదా మొత్తము తొమ్మిది స్థానములందు ఐదు ప్రధాన ఆలయములను కట్టించి మధ్యాలయమునందు పురుషోత్తముని స్థాపింపవలెను.

తూర్పున లక్ష్మిని, కుబేరుని, దక్షిణమున మాతృకాగణము- కుమారస్వామి, గణపతి, శివులను, పశ్చిమమున సూర్యాది నవగ్రహములను, ఉత్తరమున మత్స్యాది దశావతారములను స్థాపింపవలెను. అట్లే ఆగ్నేయమున చండీదేవిని, నైరృతి దిక్కున అంబికను, వాయవ్యమున సరస్వతిని, ఈశాన్యమున లక్ష్మిని స్థాపింపవలెను. మధ్యభాగమునందు వాసుదేవుని లేదా నారాయణుని స్థాపింపవలెను, లేదా పదమూడు గదులుగల దేవాలయ మధ్య భాగమునందు విశ్వరూపుడగు మహావిష్ణువును స్థాపింపవలెను. లేదా తూర్పు మొదలగు దిక్కులలో కేశవాది ద్వాదశ విగ్రములను స్థాపించి మిగిలిన గృహమునందు సాక్షాత్తు శ్రీహరిని స్థాపింపవలెను. భగవత్ప్రతిమను మట్టి, కఱ్ఱ, లోహము, రత్నములు, ఱాయి, చందనము, పుష్పము అను ఏడు వస్తువులతో నిర్మింపబడి ఏడు విధములుగ ఉండును. పుష్పములతో, మట్టితో, చందనముతో నిర్మించిన ప్రతిమను వెంటనే పూజింపవలెను. చాల సమయము ఉంచకూడదు. పూజింపబడిన ఈ ప్రతిమలు సమస్త కామములను శ్రీఘ్రముగ ఫలింపజేయును.

ఇప్పుడు శిలానిర్మిత ప్రతిమను గూర్చి చెప్పెదను. పర్వతమునుండి తీసికొని వచ్చిన ఱాయితో చేసిన ప్రతిమ ఉత్తమమైనది. పర్వతములు లేని పక్షమున భూమిలో లభించిన ఱాయిని ఉపయోగింపవచ్చును. బ్రాహ్మణాది వర్ణముల వారికి వరుసగ తెల్లని, ఎఱ్ఱని, పచ్చని, నల్లని ఱాళ్ళు ఉత్తమమైనవి. తగిన వర్ణముగల శిల లభించనిచో ఆ లోపమును తీర్చుటకై నరసింహ మంత్రముతో హోమము చేయవలెను. శిలపై తెల్లని రేఖ ఉన్నచో అది చాలా ఉత్తమమైనది. నల్లరేఖ ఉన్నచో నరసింహ హోమము చేసిన పిమ్మట అది ఉత్తమముగాను, కంచు ఘంటవంటి ధ్వని వచ్చుచు, భేదించినపుడు అగ్ని కణములు వచ్చు శిల “పుంలింగము”, ఆ చిహ్నములు తక్కువగా ఉన్న శిల “స్త్రీ లింగము”. ఈ రెండు చిహ్నములూ లేనిది “నపుంసక లింగము” ఏదైన మండలము వంటి గుర్తు ఉన్న శిల ‘సగర్భ’, దానిని పరిత్యజింపవలెను.

ప్రతిమలను నిర్మించుటకై అడవిలోనికి వెళ్ళి వనయాగము ప్రారంభింపవలెను. అచట ఒక కుండము త్రవ్వి, దానిని అలికి, మండపముపై విష్ణుమూర్తిని పూజింపవలెను. విష్ణువునకు బలి సమర్పించి ప్రతిమా నిర్మాణకర్మయందు ఉపయోగించు టంకము మొదలగు శస్త్రములను పూజించవలెను. హోమము చేసిన పిమ్మట బియ్యపు నీళ్ళతో అస్త్ర మంత్రమును (అస్త్రాయఫట్) ఉచ్చరించుచు ఆ శిలను తడుపవలెను. నరసింహ మంత్రముతో దానికి రక్షచేసి మూలమంత్రముతో (ఓం నమో నారాయణాయ) పూజచేయవలెను. పూర్ణాహుతి హోమము చేసిన పిమ్మట ఆచార్యుడు భూతములకు బలి సమర్పింపవలెను. అచట కనబడకుండ నివసించు జంతువులు, రాక్షసులు, యక్షులు, సిద్ధులు మొదలగు వారికి అందరకు పూజలు చేసి “కేశవుని ఆజ్ఞచే మేము ప్రతిమల కొరకై ఈ యాత్రపై వచ్చితిమి. శ్రీమహావిష్ణుని కార్యము మీ కార్యముకూడ అగును. అందుచే మేము ఇచ్చిన ఈ బలిచే తృప్తులై మీరు వెంటనే ఈ స్థానమును విడచి, కుశల పూర్వకముగ మరొక చోటికి వెళ్ళుడు” అని చెప్పుచు క్షమా ప్రార్థన చేయవలెను. ఈ విధముగ ప్రార్థింపబడిన వారందరును ప్రసన్నులై సుఖముగ ఆస్థానమును విడచి మరొక ప్రదేశమునకు వెళ్ళి పోవుదురు. పిమ్మట శిల్పులతో కలసి యజ్ఞ చరువును భక్షించి రాత్రి నిద్రించు సమయమున స్వప్న మంత్రమును ఈ విధముగ జపించవలెను “సమస్త ప్రాణులకును వాసస్థానమైన వాడును, సర్వవ్యాపకుడును సర్వస్రష్టయు, విశ్వరూపుడును, స్వప్నాధి పతియు అగు శ్రీహరికి నమస్కారము దేవా! దేవేశ్వరా! నేను నీ సమీపమున నిద్రించుచున్నాను. నా మనస్సులో ఏ కార్యములను సంకల్పించితినో వాటి విషయమున నాకు అంతయు తెలుపుము” ఇట్లు ప్రార్థించి “ఓం ఓం హ్రూం ఫట్ విష్ణవే స్వాహా” అను మంత్రమును జపించి నిద్రించగా శుభస్వప్నము వచ్చినచో శుభము కలుగును. చెడు స్వప్నము వచ్చినచో నరసింహ మంత్రముచే హోమము చేయగా శుభమే కలుగును. ఉదయమున లేచి, అస్త్రమంత్రముతో శిలపై అర్ఘ్యము ఈయవలెను. పిమ్మట అస్త్రపూజ చేయవలెను. గునపము, టంకము మొదలగు అస్త్రముల ముఖమును అతనికి చూపవలెను.

శిల్పి ఇంద్రియ నిగ్రహవంతుడై, టంకము చేతగైకొని ఆ శిలను చతురస్రముగా ఉండునట్లు చేయవలెను. పిమ్మట పిండిని చేయుటకై దానిని కొంచెము చిన్నది చేయవలెను. పిమ్మట ఆ శిలకు వస్త్రము చుట్టి, రథముపై ఉంచి, శిల్పశాలకు తీసికొని వచ్చి, మరల దానికి పూజ చేయవలెను. పిమ్మట ప్రతిమ నిర్మింపవలెను.