అగ్ని మహా పురాణము

Table of Contents

వాస్తు ప్రతిష్ఠా విధి

పరమేశ్వరుడు చెప్పెను: స్కందా! నేనిపుడు సంక్షేపముగ క్రమమున ప్రతిష్ఠను గూర్చి చెప్పెదను. పీఠము శక్తి, లింగము శివుడు. ఈ రెండింటి యోగము వలన శివ సంబంధి మంత్రములచే ప్రతిష్ఠ చేయబడును. ప్రతిష్ఠలో ‘ప్రతిష్ఠ’ మొదలగు ఐదు భేదములున్నవి. వాటిని గూర్చి చెప్పెదను. బ్రహ్మశిలా యోగమున్నప్పుడు విశేషరూపమున చేసిన స్థాపనము ‘ప్రతిష్ఠ’. పీఠముపైననే వీలును బట్టి అర్చా విగ్రహమును స్థాపించినచో అది స్థాపనము. ప్రతిష్ఠాభిన్నమగు స్థాపనమునకు స్థిరస్థాపనమని పేరు. ఆధార పూర్వకముగ చేయు లింగస్థాపనము. ఉత్థాపనము. లింగమును స్థాపించి విద్వాంసులు దానికి సంస్కారము చేసినచో అది ఆస్థాపనము. ఇవి శివప్రతిష్ఠకు సంబంధించిన ఐదు భేదములు. విష్ణ్వాది ప్రతిష్ఠ ‘ఆస్థానము’ ‘ఉత్థానము’ అని రెండు విధములు. ఈ అన్ని ప్రతిష్ఠలందును చైతన్య రూపుడగు పరమశివుని నియోజనము చేయవలెను. పదాధ్వాది భేదములచే ప్రాసాదములలో కూడ ఐదు విధములగు ప్రతిష్ఠ చెప్పబడినది. ప్రాసాదము కొరకై భూ పరీక్ష చేయవలెను. మట్టిరంగు తెల్లగా ఉండి ఘృత సుగంధముగల భూమి బ్రాహ్మణులకు శ్రేష్ఠము. ఇట్లే వరుసగ క్షత్రియులకు ఎఱ్ఱగా, రక్త గంధముకల మట్టి, వైశ్యులకు పచ్చని, సుగంధముగల మట్టి, శూద్రులకు నల్లని సురాగంధముగల మట్టిగల భూములు శ్రేష్ఠ మైనవి. తూర్పునందును, ఈశాన్యమునందును, లేదా అన్ని దిక్కులందును పల్లముగా నుండి, మధ్య ఎత్తుగా ఉన్న భూమి ప్రశస్తమైనది. ఒక చేతిలోతు త్రవ్వి తీసిన మట్టిలో ఆ గోతిని పూడ్చివేయగా మట్టి మిగిలిపోయినచో ఆ భూమి ఉత్తమమైనది. లేదా జలాదులతో దానిని పరీక్షించవలెను. ఎముకలు బొగ్గులు వాటిచే దూషితమగు భూమిని త్రవ్వుట, ఆవులు మొదలగు వాటిని అచట కట్టుట, చాలసార్లు దున్నుట మొదలగు వాటిచే బాగుగా శోధనము చేయవలెను. నగర, గ్రామ, దుర్గ, గృహ, ప్రాసాదాదుల నిర్మాణము కొరకు భూమినిపై విధముగ శోధన చేయవలెను. ద్వారపూజ మొదలు మంత్రతర్పణ పర్యంతమగు సంపూర్ణ కర్మను మండపమునందుచేసి, విధి పూర్వకముగ ఘోరాస్త్ర సహస్రయాగము చేయవలెను. సమముచేసి, అలికిన నేలపై దిక్సాధనము చేయవలెను. సువర్ణ, అక్షత, దధులతో ప్రదక్షిణ క్రమమున రేఖలు గీయవలెను. మధ్య భాగమునుండి ఈశాన కోష్ఠము నందున్న, జలపూర్ణ కలశమునందు శివుని పూజించవలెను. పిదప వాస్తుపూజచేసి ఆ కలశములోని జలముతో గునపము మొదలగు వాటిని తడపవలెను. మండపము వెలుపల విధి పూర్వకముగ రాక్షసగ్రహాది పూజచేసి దిక్కులందు బలులు ఇవ్వవలెను.

కలశముపై పూజచేసి లగ్నము వచ్చిన పిమ్మట అగ్నికోణమునందలి కోష్ఠమునందు మొదట తడిపిన మధులిప్తమగు గునపముతో భూమి త్రవ్వి మట్టి నైరృతి దిక్కునందు వేయవలెను. తవ్విన గోతిలో కలశములోని ఉదకము పోయవలెను. పిదప భూమి తడిపి గునపము మొదలైన వాటిని తడిపి, వాటి పూజ చేయవలెను. పిదప ఈ మరొక కలశమును రెండు వస్త్రములతో ఆచ్ఛాదించి బ్రాహ్మణుని కంఠముపై నుంచి, వాద్య-వేదఘోషలతో నగరము తూర్పు సరిహద్దు వరకు ఎంత వరకు ఇష్టమో అంత దూరము వెళ్లి, అచట క్షణకాలము పాటు ఆగి, అచటినుండి నగరము నాల్గు దిక్కులందును ప్రదక్షిణ క్రమమున తిరుగుచు ఈశాన్యము వరకును ఆ కలశమును త్రిప్పవలెను. ఆ పనితోపాటు సీమాంత చిహ్నములను తడుపుచుండవలెను. ఈ విధముగ రుద్ర కలశమును నగరము నాల్గువైపుల త్రిప్పి భూపరిగ్రహము చేయవలెను. దీనికి అర్ఘ్యదాన క్రియయని పేరు. పిదప శల్యదోష నివారణార్థమై రాళ్ళు లేదా నీరు వచ్చే వరకును భూమి త్రవ్వవలెను. ఎముకలు మొదలైనవి కనబడినచో వాటిని త్రవ్వించి తొలగించవలెను. లగ్న సమయమున ఎవ్వడైన ప్రశ్నవేయగా ఆతని ముఖము నుండి అ క చ ట త ప స హ అనువర్గములకు చెందిన అక్షరములు బయల్వెడలినచో, ఆ దిక్కులందు శల్యములు ఉండునని సూచింప బడుచున్నది. పక్షులు మొదలగునవి వాలినచో అచట శల్యములున్నవని సూచింపబడుచున్నది. కర్తకు ఏ అంగమునందు వికారముండునో తత్సదృశమగు శల్యమున్నదని నిశ్చయించవలెను. పశ్వాది ప్రవేశము వాటి అరపు, పక్షిరవము మొదలగు వాటిచే శల్యములున్న దిక్కు సూచింప బడును. ఒక పట్టికపైగాని, భూమి మీదగాని అకారాద్యష్ట వర్గయుక్తమగు మాతృకా వర్ణములను వ్రాయవలెను. వర్గానుసారము క్రమముగ తూర్పునుండి ఈశాన్యము వరకు నున్న దిక్కులందు శల్యమున్నట్లు తెలియవలెను. అవర్గమైనచో తూర్పున ఇనుము ఉండును. ‘క’వర్గమైనచో ఆగ్నేయమున బొగ్గు ఉండును. ‘చ’ వర్గమైనచో దక్షిణము నందు భస్మము ‘ట’ వర్గమైనచో నైరృతి యందు ఎముకలును ఉండును. ‘త’ వర్గమైనచో పశ్చిమమున ఇటుకలు, ‘ప’ వర్గమైనచో వాయవ్యమున పెంకులు, ‘య’ వర్గమైనచో ఉత్తరమున శవములు కీటకము మొదలగునవి, ‘స’ వర్గమైనచో ఈశాన్యము నందు ఇనుము ఉండును. ‘హ’ వర్గమైనచో వెండి, ‘క్ష’ వర్గయుక్త దిగ్భాగమున ఆ దిక్కునందే అనర్థకరములగు వస్తువులు ఉండును.

ఒక్కొక్క హస్తము పొడవుగల తొమ్మిది శిలా ఖండములను ప్రోక్షించి, వాటిని ఎనిమిదేసి అంగుళముల లోపల మట్టిలో పాతవలెను. పైన నారుపోసి ముద్గరముతో కొట్టవలెను. ఆ రాళ్ళు మూడు వంతుల పొడవు నేలలో దిగిన పిమ్మట, గొయ్యి పూడ్చి, అలికి, అచటి భూమిని చదును చేయవలెను. గురువు సామాన్యార్ఘ్యమును చేత ధరించి, చెప్పబోవు మండపము వైపు వెళ్ళవలెను. మండపద్వారమున ద్వారపాలకపూజచేసి పశ్చిమ ద్వారమునుండి లోనికి ప్రవేశించవలెను. అచట ఆత్మశుద్ధి కుండమండపాది సంస్కారము చేయవలెను. కలశవర్ధన్యాది స్థాపనచేసి లోకపాలులను, శివుని పూజించవలెను. అగ్ని జనన పూజనాదులు అన్నియు వెనుకటి వలెనే చేయవలెను. పిమ్మట గురువు యజమానునితో కలిసి శిలల స్నాన మండపమునకు వెళ్ళవలెను. ధర్మాది సంజ్ఞితములగు నాలుగు ప్రాసాదలింగ శిలలు ఉన్నవి. వాటి ఎత్తు ఎనిమిది అంగుళములున్నచో మంచిది. చతురస్రములుగను ఒక హస్తము పొడవుండునట్లును ప్రస్తర శిలలు నిర్మించవలెను. ఇటుకల ప్రమాణము శిలా ప్రమాణములో సగము ఉండవలెను. ప్రాసాదమునందు శిలలను, ఇటుకలతో కట్టు ఆలయములలో ఇటుకలు ఉపయోగించవలెను. వాటి తొమ్మిది శిలలను లేదా ఇటుకలను వజ్రాది చిహ్నములతో చిహ్నితములు చేయవలెను. లేదా ఐదు శిలలను కమల చిహ్నముతో చిహ్నితము చేయవలెను. ఆలయ నిర్మాణము ఈ అంకిత శిలతోడనే ప్రారంభించవలెను. నంద, భద్ర, జయ, రిక్త, పూర్ణ అనునవి ఐదు శిలల పేర్లు. పద్మము, మహాపద్మము, శంఖము, మకరము, సముద్రము  అనునవి ఐదు నిధి కుంభములు, నంద, భద్ర, జయ, పూర్ణ, అజిత, అపరాజిత, విజయ, మంగళ, ధరణీ, అనునవి తొమ్మిది శిలల పేర్లు. సుభద్ర, విభద్ర, సునంద, పుష్పదంత, జయ, విజయ, కుంభ, పూర్వ, ఉత్తరములు ఈ తొమ్మిదింటి నిధి కలశములు.

ప్రణవ మయాసనమును ఇచ్చి అస్త్ర మంత్రముచే తాడనోల్లేఖనాదులు చేసిన పిదప ఈ శిలలను అన్నింటిని సామాన్య రూపమున కవచ మంత్రముచే ఆచ్ఛాదించవలెను. అస్త్రమంత్రము చివర ‘హూం ఫట్’ చేర్చి దానిని ఉచ్చరించుచు మట్టి, గోమయము, గోమూత్రము, కషాయములు, గంధయుక్త జలము-వీటితో మలస్నానము చేయించవలెను. పిమ్మట పంచగవ్య పంచామృతములతో యథావిధిగ స్నానము చేయించవలెను. గంధోదకముతో స్నానము చేయించిన పిదప స్వీయ నామాంకిత మంత్రముతో శిలను ఫల, రత్న, సువర్ణ, గో శృంగ జల-చందనములతో పూసి, వస్త్రములతో ఆచ్ఛాదించవలెను. స్వర్ణోత్థమగు ఆసనమిచ్చి, యాగమండప పరిక్రమణము చేసి ఆ శిలను తీసికొనిపోయి హృదయ మంత్రముతో శయ్యపైగాని, కుశాస్తరణముపైగాని పరుండబెట్టవలెను. అచట పూజించి, బుద్ధినుండి పృథివి వరకును ఉన్న తత్త్వముల న్యాసముచేసి త్రిఖండ వ్యాపక తత్త్వత్రయమును ఆ శిలలపై క్రమమున న్యాసము చేయవలెను. బుద్ధినుండి చిత్తమువరకు, చిత్తములోపల మాతృకల వరకు, తన్మాత్రలు మొదలు పృథివి వరకును శివ తత్త్వ, విద్యా తత్త్వ, ఆత్మ తత్వములు ఉన్నవి. పుష్పమాలాది చిహ్నిత స్థానములపై క్రమముగా మూడు తత్త్వములను, తదీయ మంత్రములతోను తత్త్వేశులను హృదయ మంత్రముతోను పూజించవలెను. ‘ఓం హూం శివతత్త్వాయ నమః, ఓం హాం శివ తత్త్వాధిపాయ రుద్రాయ నమః, ఓం విద్యా తత్త్వాయ నమః, ఓం హాం విద్యా తత్త్వాధిపాయ విష్ణవే నమః, ఓం హాం ఆత్మ తత్త్వాయ నమః, ఓం హాం ఆత్మ తత్త్వాధిపతయే బ్రహ్మణే నమః’ అనునవి పూజోపయుక్త మంత్రములు, ప్రతి తత్త్వమునందును, ప్రతిశీల యందును భూ, అగ్ని, యజమాన, సూర్య, జల, వాయు, చంద్ర, ఆకాశములను ఎనిమిది మూర్తుల న్యాసము చేయవలెను. పిదప క్రమముగ శర్వ, పశుపతి, ఉగ్ర, రుద్ర, భవ, ఈశాన, మహాదేవ, భీమమూర్తుల న్యాసము చేయవలెను. ‘ఓం ధరామూర్తయే నమః, ఓం ధరాధిపతయే శర్వాయ నమః’ ఇత్యాదులు మూర్తి-మూర్తీశ్వర మంత్రములు, పిదప అనంతాది లోకపాలులను వారి వారి మంత్రముతో న్యాసము చేయవలెను. ల్రూం, రూం,య్రూం, వ్రూం, శ్రూం, ష్రూం, స్రూం, హ్రూం, క్ష్రూం అనునవి ఇంద్రాదిలోక పాలబీజములు. ఇది నవ శిలాపక్షమున చెప్పబడినది. పంపశిలా పక్షమున ప్రత్యేక తత్త్వమయ శిలను స్పృశించి వాటిపై క్రమముగా పృథివ్యాదిమూర్తి న్యాసము చేయవలెను. బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివులు ఐదుగురు మూర్తీశులు. ఈ ఐదింటిని పైన చెప్పిన ఐదు మూర్తులందును వెనుకటివలె పూజించవలెను. ‘ఓం పృథివీమూర్తయే నమః, ఓం పృథివీ మూర్త్యధిపతయే నమః’ ఇత్యాదులు పూజోపయుక్త మంత్రములు.

ఐదు కలశములను వాటి నామ మంత్రములతో పూజించి స్థాపించవలెను. మధ్య శిలాక్రమమున యథావిధిగా న్యాసముచేసి, విభూతి, కుశ, తిలలతో అస్త్ర మంత్రములతో ప్రాకారము ఏర్పరుపవలెను. కుండములందు ఆధారశక్తి న్యాస పూజనములుచేసి, తత్త్వ, తత్త్వాధిప, మూర్తి, మూర్తీశ్వరులకు ఘృతాదులతో తర్పణము చేయవలెను. పిదప బ్రహ్మాత్మ శుద్ధి కొరకై మూలాంగములైన బ్రహ్మ మంత్రముతో క్రమముగ నూరు నూరు హోమములుచేసి, పూర్ణాహుతి వరకును హోమముచేసిన పిదప శాంతి జలముతో శిలలను ప్రోక్షించి పూజించవలెను. కుశలతో స్పృశించి ప్రత్యేక తత్త్వమునందు సాన్నిధ్య సంధానములుచేసి పిదప శుద్ధన్యాసము చేయవలెను. ఈ విధముగ క్రమముగా మూడు భాగములందు కర్మలను చేయవలెను. ‘ఓం ఆం ఈం ఆత్మతత్త్వ విద్యాతత్త్వాభ్యాం నమః’ అనునది మంత్రము. కుశమూలాదులతో క్రమముగ ముగ్గురు తత్త్వేశాదులను స్పృశించి హ్రస్వదీర్ఘ ప్రయోగపూర్వకముగ తత్త్వాను సంధానము చేయవలెను. అందును మంత్రము-ఓం హాం ఉం విద్యాతత్త్వ శివతత్త్వాభ్యాం నమః’ పిదప ఘృతమధు పూర్ణములును, అగ్రమున పంచగ వ్యాభిషిక్తములును పంచలోకపాలకులు దేవతలుగా కలదియు అగు పంచ కలశములను, వాటి మంత్రములచే పూజించి వాటి సమీపమున హోమము చేయవలెను. పిదప సకల శిలాధిదేవతల ధ్యానము చేయవలెను. ఆ శిలాధిదేవతలు విద్యాస్వరూపులు స్నానము పూర్తి చేసికొనిన వారు. వాటి శరీర కాంతి బంగారమువలె దేదీప్యమానముగ ఉన్నది. ఉజ్జ్వలములగు వస్త్రములు ధరించి అలంకృతములైయున్నారు. న్యూనతాది దోష పరిహారార్థమును వాస్తు భూమి శుద్ధి కొరకు అస్త్ర మంత్రముతో పూర్ణాహుతి వరకును నూరు నూరు హోమములు చేయవలెను. (92)