అగ్ని మహా పురాణము

Table of Contents

పాండవ చరిత వర్ణనము

అగ్ని పలికెను: ఓ ద్విజుడా! యుధిష్ఠిరుడు రాజ్యము చేయుచుండగా, దృత రాష్ట్రుడును, గాంధారియు, కుంతియు, అరణ్యమునకు వెళ్ళి ఒక ఆశ్రమము నుండి మరియొక ఆశ్రమమునకు సంచరించుచుండిరి.

విదురుడు దావాగ్నిచే దగ్ధుడై మృతిచెందెను. ఈ విధముగ మహావిష్ణువు పాండవులను నిమిత్తముగ చేసికొని, ధర్మ రక్షణము కొరకును, అధర్మ వినాశమునకును పూనుకొని దానవాదికమగు భూభారమును హరించెను. విప్రశాపమను వంకచే, ముసలముచే, భూ భారకరమగు యాదవ కులమును నశింపచేసెను.

శ్రీకృష్ణుడు వజ్రుని రాజ్యాభిషిక్తుని చేసి దేవతల ఆదేశముచే ప్రభాస క్షేత్రమునందు తన దేహమును పరిత్యజించి, ఇంద్రలోక బ్రహ్మలోకములందు స్వర్గవాసులచే పూజింపబడెను. బలరాముడు ఆదిశేషరూప ధారియై పాతాళ స్వర్గము చేరెను. వినాశరహితుడగు ఆ శ్రీహరి యోగులచే ధ్యానింపబడువాడు. అట్టి శ్రీకృష్ణుడు లేని ద్వారకను సముద్రము ముంచివేసెను.

అర్జునుడు యాదవులకు ప్రేత సంస్కారాదులు చేసి ఉదకధనాది దానములు చేసెను. అష్టావక్రుని శాపముచే విష్ణుభార్యలుగా అయిన స్త్రీలను, మరల ఆతని శాపము చేతనే, కఱ్ఱలు ఆయుధములుగాగల గోపాలకులు అర్జునుని ఓడించి తీసికొనిపోయిరి. అర్జునుడు చాల శోకించెను. వ్యాసుడు ఆతనిని ఊరడించెను. కృష్ణుడు ఉన్నప్పుడే నా బలము అని అర్జునుడు గ్రహించెను. ఆతడు హస్తినాపురమునకువచ్చి, రాజ్యపాలకుడైన యుధిష్ఠిరునకు ఇది అంతయు చెప్పెను.

కృష్ణుడు ఈలోకమును విడచి వెళ్ళిపోయినతోడనే అర్జునుని అదే ధనస్సు, అవే అస్త్రములు, అదే రథము, అవే గుఱ్ఱములు, అవన్నియు శ్రోత్రియుడుకాని వానికి ఇచ్చిన దానమువలె నష్టమైపోయెను. ధర్మరాజు ఆ వార్త విని, పరీక్షిత్తును రాజ్యపాలనకై నియోగించి, ఈ సంసారము అనిత్యము అను విషయము గ్రహించినవాడై, ద్రౌపదియు, సోదరులును వెంటరాగా, మహావిష్ణుని అష్టోత్తర శతనామములు జపించుచు మహాప్రస్థానమున బయలుదేరెను.

ఆ మహాప్రస్థానమునందు ద్రౌపది, సహదేవుడు, నకులుడు, అర్జునుడు, భీముడును పడిపోయిరి. రాజు శోకాతురుడు అయ్యెను. ఆతడు ఇంద్రుడు తీసికొని వచ్చిన రథమును అధిరోహించి, సోదర సహితుడై స్వర్గము చేరెను. అచట దుర్యోధనాదులను, వాసుదేవుని చూచి సంతసించెను. నీకు ఈ భారతకథను చెప్పితిని. దీనిని పఠించినవారు స్వర్గమునకు వెళ్లెదరు. (15)