అగ్ని మహా పురాణము

Table of Contents

సర్వరోగ రణ ఔషధములు

ధన్వంతరి చెప్పెను:

రోగములు శారీరకములు, మానసము, అగంతుకములు, సహజములు అని నాల్గు విధములు. జ్వరకుష్టాదులు శారీరకములు, క్రోధాదులు మానసములు, దెబ్బలు తగులుట మొదలగునవి ఆగంతుకములు, ఆకలి ముసలితనమనునవి సహజములు. శారీర ఆగంతుక వ్యాధులను తొలగించు కొనుటకు శనివారమున బ్రాహ్మణుని పూజించి ఆతనికి ఘృతము గుడము, లవణము, సువర్ణము దానము చేయవలెను. సోమవారమున బ్రాహ్మణునకు అభ్యంగన స్నానము చేయించినవాడు సర్వ రోగ విముక్తుడు అగును. శనివారమున తైలదానము చేయవలయును. ఆశ్వీయుజ మాసమున గోరసములను దానము చేయ వలయును. శివలింగమునకు దధిఘృతములతో స్నానము చేయించిన వాడు రోగ విముక్తుడగుచు త్రిమధురములలో ముంచి దూర్వను గాయత్రి మంత్రముతో హోమము చేసినవాడు, రోగ విముక్తుడగును. ఏ నక్షత్రమున రోగము పుట్టినదో ఆ నక్షత్రము నందే స్నానము చేసి బలి ఇవ్వవలెను. మానస రోగములను విష్ణుస్తోత్రము హరించును. ఇప్పుడు వాత పిత్త కఫములను దోషములను గూర్చియు ధాతువులను గూర్చియు వినుము.

అన్న ఆహారము పక్వాశయము నుండి రెండు మార్గములుగా పోవును. ఒక భాగము కిట్ట మగును. రెండవ భాగము రసమగును. కిట్ట భాగము మలము. అదీ మన మూత్ర స్వేద దూషికాది రూపమునను నాసామల, కర్ణమల, దేహమల రూపమునను పరిణతి చెందును. రసభాగమంతయు రక్తముగ మారును. రక్తము నుండి మాంసము, దానినుండి మేదస్సు దానినుండి అస్తి, దానినుండి మజ్జ, దానినుండి శుక్రము, దానినుండి రాగ ఓజస్సులు పుట్టును. చికిత్సకుడు దేశకాల పీడాబల శక్తి ప్రకృతి భేషజ బలములను గుర్తించి తదనుకూలముగ చికిత్స చేయవలయును. రిక్తాతిథులు (4, 9, 14) భౌమ వాసరము మందక్రూర నక్షత్రములు విడిచి చికిత్సాప్రారంభము చేయవలయును. విష్ణు గో బ్రాహ్మణ చంద్ర సూర్యాదుల పూజచేసి రోగినుద్దేశించి ‘బ్రహ్మదక్షుడు, అశ్వినీ దేవతలు, రుద్ర, ఇంద్ర, సూర్య, అనిల, అనల, ఋషులు, ఓషది సముదాయము, భూత సముదాయము నిన్ను రక్షింతురు గాక! ఋషులకు రసాయనము ఎట్లో, దేవతలకు అమృతము ఎట్లో, ఉత్తమ నాగులకు సుధ ఎట్లో అట్లే నీకు ఈ ఔషధము ఆరోగ్యకరము, ప్రాణరక్షణము అగుగాక’ అను అర్థములుగల మూలోక్త శ్లోకములను పఠించుచు, ఔషధ ప్రారంభము చేయవలయును. బహు వృక్షములు, అధిక జలముకలిగి అనూపమను పేరుగల దేశము వాతశ్లేష్మకరము. అట్లుకానిది జంగలము. అల్ప వృక్షోదకములుగల దేశము సాధారణము. జాంగలము పిత్తమును వృద్ధి పొందించును. సాధారణ దేశము, మధ్యముగ నుండును.

వాతము రూక్ష శీతల స్వభావము కలది. పిత్తము ఉష్ణము. కటుశ్రయము పిత్తమును పెంచును. కఫము స్థిర ఆమ్ల స్నిగ్ధ మధుర స్వభావము కలది. సమాన వస్తువులచే యిది వృద్ధి చెందును. అసమాన వస్తువులచే తగ్గును. మధుర, ఆమ్ల, లవణ రసములు శ్లేష్మకరములు, వాయునాశకములు. కటుతిక్త కషాయ రసములు వాయువృద్ధి కరములు కఫ నాశకములు, కటు ఆమ్ల లవణ రసములు పిత్తవర్ధకములు. తిక మధుర కషాయ రసములు పిత్తనాశకములు. ఈ గుణములు రసములవి కావు. వాటి విపాకమునకు చెందినవని గ్రహించవలెను. ఉష్ణవీర్యములు కఫనాశకములు, శీతవీర్యములు పిత్తనాశకములు. ఓ సుశ్రుతా! ఇవన్నియు తన ప్రభావముచే ఆయా కార్యములను చేయును. శిశిర వసంత గ్రీష్మములందు క్రమముగ, కఫములకు చయము, ప్రకోపము, ప్రశమనము వుండును. సుశ్రుతా! వాయువునకు గ్రీష్మ, వర్ష, రాత్రి శరదృతువులందు వరుసగ చయ, ప్రకోప, ప్రశమములు చెప్పబడినవి. ఇట్లే వర్ష, శరత్, హేమంతములందు క్రమముగ పిత్తములకు చయ, ప్రకోప, ప్రశమములు చెప్పబడినవి. వర్షఋతువు నుండి హేమంతము వరకు మూడు ఋతువులును విసర్గకాలము. శిశిరమునుండి గ్రీష్మము వరకు మూడు ఋతువులు ఆదానకాలము, విసర్గకాలము సౌమ్యము. ఆదానకాలము ఆగ్నేయము. వర్షాది ఋతుత్రయమున సంచరించుచున్న చంద్రుడు ఓషధులతో క్రమముగ ఆమ్ల లవణ మధుర రసములను పుట్టించును. శిశిరాది ఋతుత్రయమున సంచరించుచున్న సూర్యుడు క్రమముగ, తిక్తకషాయ కటురసములను వృద్ధి పొందించును. రాత్రులు పెరుగుచున్న కొలది ఓషధుల బలము పెరుగుచుండును. రాత్రులు తగ్గుచున్నకొలది మనుష్యుల బలము క్రమముగ తగ్గుచుండును. రాత్రి, దిన, భోజనాంతము నందును, వయస్సుయొక్క ఆది మధ్య అవసాన కాలములందును కఫపిత్త వాయువులు ప్రకోపించును. ప్రకోప ప్రారంభమున వీటికి జయము కలుగును. ప్రకోపానంతరము వీటికి శమనము కలుగును. అతిభోజనము వలనను అధికోపవాసమువలనను, మలమూత్ర వేగనిరోధము వలనను కూడ అన్ని రోగములు పుట్టును. ఉదరము నందలి రెండు భాగములను అన్నముతోను, ఒక భాగమును జలముతోను నింపి ఒక భాగమును వాయ్వాది సంచారమునకై విడువ వలయును. వ్యాధికి ఏది మూలకారణమో, దానికి విపరీతమైనది ఔషధము. అట్టి ఔషధమును ఇవ్వవలెను. ఇదియే అన్నింటి సారము అని నేను చెప్పుచున్నాను.

నాభి పైన పిత్త స్థానము, దాని క్రింద శ్రోణీగుదములు వాతస్థానములు. కాని ఇవన్నియు శరీరమునందు తిరుగుచునుండును, విశేషించి వాయువు తిరుగును. దేహ మధ్యమున హృదయ మున్నది, అది మనస్సునకు స్థానము. స్వభావతః దుర్బలుడును, అల్ప కేశములు కలవాడును, చంచలుడును, ఎక్కువ మాటలాడువాడును, విషమమైన జఠరాగ్ని కలవాడును, ఆకాశమునందు ఎగురుచున్నట్లు స్వప్నములు చూచువాడును, వాత ప్రకృతి కలవాడు, అకాలమున జుట్టు నెరసిన వాడును క్రోధశీలుడును ఎక్కువ చెమట పట్టువాడును, తీపి ఇష్టమైన వాడును, స్వప్నమునందు అగ్ని చూచువాడును పిత్త ప్రకృతి, దృఢమైన అవయవములు కలవాడును స్థిరచిత్తుడు, మంచికాంతి కలవాడు దట్టమైన కేశములు కలవాడు, స్వప్నమున నిర్మలోదకమును చూచువాడు, కఫ ప్రకృతి ఈ విధముగనే తామస, రాజస, సాత్త్వికులని మనుష్యులు మూడు విధములు. ఓ ముని శ్రేష్టా! మానవులందరను వాత, పిత్త కఫాత్మకులు మైథునము చేతను, బరువు పనులు చేయుటచేతను రక్త పిత్తము కలుగును. చెడ్డ ఆహారము తినుటవలనను శోకము వలనను వాయు ప్రకోపము కలుగును. ద్విజోత్తమా! దాహమును కల్పించువాటిని కటు తిక్తకషాయ పదార్థములను తినుట చేతను నడచుటచేతను భయముచేతను పిత్త ప్రకోపము కలుగును. ఎక్కువ జలము త్రాగువారికిని గురువైన భోజనము చేయువానికిని భుజించిన వెంటనే నిద్రపోవువానికిని, సోమరులకును, శ్లేష్మ ప్రకోపము కలుగును. లక్షణములను బట్టి వాతాది రోగములను గుర్తించి వాటిని శమింప చేయవలయును. ఎముకలు విరుగుట, నోటి చేదు నోరు ఎండుట, ఆవులింతలు, రోమాంచము ఇవి వాతవ్యాధి లక్షణములు; సోమరితనము నోటిలో నీళ్ళు ఊరుట శరీరము బరువుగా వుండుట నోటి తీపి వేడిని కోరుట ఇవి కఫ వ్యాధి లక్షణములు; స్నిగ్ధము, ఉష్ణమును అయిన అన్నమును, అభ్యంగ స్నానము, తైలపానాదికము, వాత రోగమును నివారించును. నెయ్యి, పాలు, పటిక బెల్లము, చంద్ర కిరణాదులు పిత్తమును తొలగించును. త్రిఫలా తైలమును తేనెలో సేవించుట వ్యాయా మాదికము కఫరోగమును తొలగించును. విష్ణు పూజాధ్యానములు సర్వరోగ నివారకములు. (280)