అగ్ని మహా పురాణము
నగరాది వాస్తు నిరూపణము
పరమేశ్వరుడు పలికెను-
నగర గ్రామ దుర్గాదులలో గృహ ప్రాసాదవృద్ధికై ఎనుబదియొక్క పదముల వాస్తు మండలము నిర్మించి, దానిపై తప్పక వాస్తు దేవతా పూజ చేయవలెను. పూర్వాభిముఖములగు పది రేఖలు పది నాడులకు ప్రతీకములు. శాంత, యశోవతీ, కాంతా, విశాలా, ప్రాణవాహినీ, సతీ, వసుమతీ, నందా, సుభద్రా, మనోరమా అనునవి ఆ నాడుల పేర్లు, ఉత్తరాభిముఖముగ ప్రవహించు ఇంకను పది నాడులు కూడ ఉన్నవి. వాటిచే తొమ్మిది పదములు ఎనుబది యొక్క పదములుగ విభజింపబడును. హరిణీ, సుప్రభా, లక్ష్మీ, విభూతి, విమలా, ప్రియా, జయా, జ్వాలా, విశోకా అని వాటి పేర్లు. సూత్ర పాతము చేయగా రేఖామయములగు నాడులు అభివ్యక్తములై చింతన విషయములగును. ఈశాది దేవతలు ఎనమండుగురు చొప్పున అష్టకములగును. ఆ అష్టకములను నాలుగు దిక్కులందును పూజించవలెను. ఈశ, ఘన, జయ, శక్ర, అర్క, సత్య, భృశ, వ్యోమ దేవతలను (అష్టకమును) వాస్తు మండలము మీద పూర్వదిక్కున పూజించవలెను. అగ్ని, పూషస్, వితథ, సోమ, కృతాంత, గంధర్వ, భృంగ, మృగులను దేవతాష్టకమును దక్షిణమున నున్న పదములందు పూజించవలెను. పితృ, ద్వారపాల, సుగ్రీవ, పుష్పదంత, వరుణ, దైత్య, శోష, యక్ష్మలను అష్టకమును పశ్చిమ పదములందు పూజించవలెను. రోగ, అహి, ముఖ్య, భల్లాట, సోమ, శైల, అదితి, దితులను దేవతాష్టకమును ఉత్తరమున ఉన్న పదములపై పూజించవలెను. వాస్తు మండలము మధ్యనున్న తొమ్మిది పదములపై బ్రహ్మయు, ఇరువదినాలుగు పదములపై, ఆరేసి పదములపై అధికారముగల దేవతలను పూజించవలెను. బ్రహ్మకును, ఈశునకును మధ్యనున్న కోష్టకములందున్న పదములపై ఆ దేవతను క్రింది రెండు పదములపై ఆపవత్సుని పూజించవలెను. దానితరువాతనున్న ఆరు పదములపై మరీచిని పూజించవలెను. మరీచికిని, అగ్నికిని మధ్యనున్న రెండు పదములపై సవిత ఉండును. వాటి క్రింద నున్న రెండు పదములపై సావిత్రుడు ఉండును. దాని క్రింద ఆరు పదములపై వివస్వంతుడు ఉండును. పితృ దేవతలకును బ్రహ్మకును మధ్యనున్న రెండు పదములపై విష్ణువు, ఇంద్రుడును ఉందురు. క్రింది రెండు పదములందు ఇంద్రుడును, జయుడును ఉందురు. వారిని పూజించవలెను. వరుణునకును, బ్రహ్మకును మధ్య నున్న ఆరు పదములపై మిత్ర దేవతను పూజించవలెను. రోగమునకును, బ్రహ్మకును మధ్యనున్న రెండుపదములపై రుద్ర-రుద్రదాసులను, క్రింది రెండు పదములందు యక్ష్మను పూజించవలెను. మండలము బైటి ఈశానాది కోణములందు క్రమముగా చరకీ, స్కంద, విదారీ, వికట, పూతనా, జంభ, పాపా, పిలిపిచ్ఛలను బాల గ్రహములను పూజించవలెను.
ఎనుబది ఒక్క పదములు గల వాస్తు చక్రము చెప్పబడినది. శతపదమండలము కూడ ఉండును. దానిమీదకూడ వెనుకటివలెనే దేవతాపూజ చెప్పబడినది. శతపద చక్రము నందు మధ్యనున్న పదునారు పదములపై బ్రహ్మను పూజించవలెను. బ్రహ్మకు పూర్వాది దిశలందున్న మరీచి, విస్వత్, మిత్ర పృథ్వీధరులును పదేసి పదములపై పూజించవలెను. ఈశాన్యాది దిక్కులందున్న దితి, ఈశ, అగ్ని, పూషన్, పితృ, పాపయక్ష్మ, రోగ దేవతలు ఒకటిన్నర పదములపై నుందురు. స్కందా! ఇపుడు యజ్ఞాదులకై కావలసిన మండపములను, క్రమముగా, సంక్షేపముగా వర్ణించెదను. ముప్పది హస్తముల పొడవు, ఇరువది ఎనిమిది హస్తముల వెడల్పు ఉన్న మండపము శివునకు ఆశ్రయము. పొడవు వెడల్పులలో పదకొండు చొప్పున తగ్గించగా, పందొమ్మిది హస్తముల పొడవు, పదునేడు హస్తముల వెడల్పు ఉన్న మండపము శివసంజ్ఞకము. ఇరువది రెండు హస్తముల పొడవు, పదునైదు హస్తముల వెడల్పు ఉన్న మండపమునకు సావిత్రమని పేరు. ఇతర గృహముల విస్తారము ఆంశికముగ నుండును. గోడ ఎత్తు దాని లావైన ఉపజంఘ ఎత్తునకు మూడు రెట్లు ఉండవలెను. గోడకొరకై ఎంత సూత్రమానము నిశ్చితమైనదో అంతయే దాని ఎదుట ఉండు భూమి ఉండవలెను. అది వీథీ భేదముచే అనేక విధముల నుండును. భద్రనామక ప్రాసాదమునందు ద్వారవీథి వీధులతో సమానముగనే ఉండవలెను. శ్రీజయమను ప్రాసాదమునందు ఉండు ద్వారవీథిలో దానియందు వీథి పృష్ఠభాగ ముండదు. ద్వారవీథిలో వీధిపార్శ్వ భాగమును తగ్గించినచో అట్టి ద్వారవీథికల ప్రాసాదమునకు ‘భద్ర’మని పేరు. వీధివిస్తారము గూడ గర్భవిస్తారమువలె నుండవలెను. కొన్నిచోట్ల దాని సగముతోను, లేదా నాల్గవవంతుతో సమానముగా ఉండును. ఉపవీథులను వీథిలో సగము ప్రమాణ ముండునట్లు నిర్మించవలెను. దానికి ఒకటి లేదా రెండు, లేదా మూడు పురములు ఉండవలెను. ఇపుడు ఇతరమైన సాధారణ గృహములను గూర్చి చెప్పుచున్నాను. ఆ గృహమును ఆ ఆకారముతో నిర్మించినచో అది సమస్తమైన కోరికలను సఫలము చేయును. దానిలో వరుసగా ఒకటి, రెండు, మూడు, నాలుగు లేదా ఎనిమిది శాలలు ఉండవలెను. ఏకశాల గృహముయొక్క శాల దక్షిణ భాగమున నిర్మింపబడును. దాని ద్వారము ఉత్తరము వైపున ఉండును. రెండు శాలలను నిర్మించు పక్షమున వాటిని పశ్చిమమునందును, తూర్పునందును నిర్మింపవలెను. వాటి ద్వారములు ఎదురెదురుగా ఉండవలెను. నాలుగు శాలల గృహమునకు నాలుగు ద్వారములు, నాలుగు అరుగులు ఉండునుగాన అవి సర్వతోముఖముగ నుండును. అది గృహస్వామికి కల్యాణకరము. పశ్చిమము వైపు రెండుశాలలుండు ద్విశాలా గృహమునకు ‘యమసూర్యకము’ అని పేరు. తూర్పు, ఉత్తరముల వైపు శాలలున్నచో ఆ గృహమునకు ‘దండ’మని పేరు. పూర్వ దక్షిణముల వైపు రెండు శాలలున్నచో దానికి ‘వాతము’ అని పేరు. త్రిశాలా గృహమునందు తూర్పువైపు శాల లేనిచో దానికి సుక్షేత్రము అని పేరు. అది బుద్ధిదాయకము. దక్షిణమున తప్ప ఇతర దిశలందు శాలలున్నచో దానికి ‘విశాలము’ అని పేరు. అది కులక్షయకరము. చాల భయదాయకము. పశ్చిమమున శాలలేని విశాల గృహమునకు ‘పక్షఘ్నము’ అని పేరు. అది పుత్ర హానికరము. అనేక శత్రు కారకము.
ఇపుడు పూర్వాది దిక్క్రమమున ధ్వజాది గృహముల ఎనిమిదింటిని గూర్చి చెప్పెదను. స్నాన గృహ-అనుగ్రహ గృహములను తూర్పునను, వంట ఇల్లును ఆగ్నేయమునను, శయ్యా-రసక్రియల గృహమును దక్షిణమునందును, శస్త్ర గృహమును నైరృతి యందును, ధన రత్నాదుల కోశాగారమును పశ్చిమమునందును, అన్న గృహము వాయవ్యము నందును, ధనపశ్వాదులను ఉత్తమునందును, దీక్షా గృహమును ఈశాన్యము నందును నిర్మింపవలెను. గృహస్వామి హస్తముచే కొలవబడిన గృహపిండము పొడవు వెడల్పుల హస్తమానమును మూడుచే గుణించి ఎనిమిదిచే భాగించవలెను. అట్లు భాగించగా వచ్చిన శేషమును బట్టి ఈ ధ్వజాధ్యాయములు ఏర్పడును. దానిని బట్టియే ధ్వజము మొదలు కాకము వరకును ఉన్న ఆయములు తెలియును. రెండు, మూడు, నాలుగు, ఆరు, ఏడు, ఎనిమిది శేషించినచో దానిని బట్టి శుభాశుభ ఫలములు ఏర్పడును. గృహాయము మధ్యమము (ఐదవది)కాని, (చివరిది) కాకముగాని అయినచో అట్టి గృహము సర్వనాశకరమగును. అందుచే ఎనిమిది భాగములను విడచి, తొమ్మిదవ భాగమునందు నిర్మించిన గృహము శుభకరము. ఆ నవమ భాగమునందే మండపము ఉత్తమముగా భావింపబడుచున్నది. దాని పొడవు వెడల్పులు సమముగా ఉండవలెను. లేదా వెడల్పుకంటె పొడవు రెట్టింపు ఉండవలెను. తూర్పునుండి పశ్చిమము వైపునకును, ఉత్తరము నుండి దక్షిణమునకును, బజారునందే గృహపంక్తి కానవచ్చును. ఒక్కొక్క ఇంటికి, ప్రతిదిక్కునకును ఎనిమిదేసి ద్వారములు ఉండవచ్చును. ఈ ఎనిమిది ద్వారములకును వేరు వేరు ఫలములు ఉన్నవి. పూర్వదిక్కునందున్న ఎనిమిది ద్వారములకును భయము, స్త్రీ, చాపల్యము, జయము, వృద్ధి, ప్రతాపము, ధర్మము, కలహము, నిర్ధనత అనునవి తప్పక జరుగు ఫలములు. దక్షిణ దిక్కునందున్న ఎనిమిది ద్వారములకు దాహ, దుఃఖ, సుహృన్నాశ, ధననాశ, మృత్యు, ధన, శిల్పజ్ఞాన, పుత్రప్రాప్తులు ఫలము. ఆయుష్, సన్యాస, సస్య, ధన, శాంతి, అర్థనాశ, శోషణ, భోగ, సంతానప్రాప్తులు పశ్చిమద్వార ఫలములు. రోగ, మద, ఆర్తి, ముఖ్యతా, అర్థ, ఆయుః, కృశతా, మానములు ఉత్తర ద్వార ఫలములు. (105)
