అగ్ని మహా పురాణము

Table of Contents

వినాయక స్నానము

పుష్కరుడు పలికెను;

వినాయకులచే పీడితులకు సర్వ మనోరథములు ఇచ్చు స్నానమును చెప్పెదను. కర్మలకు విఘ్నము కల్గించుటకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వినాయకుని నిర్మించి ఆతనికి గణాధిపత్యమును కూడ ఇచ్చిరి. వినాయక పీడితుడు స్వప్నములో లోతైన నీటిలో మునిగిపోవును. ముండిత శిరస్కులను చూచును. మాంసమునుతిను మృగములను ఎక్కును. ఎచటకేని నడచి వెళ్లినపుడు తనవెనుక ఎవరో వచ్చుచున్నట్లు అనుకొనును. కారణము లేకుండగనే మనస్సు చెడి వ్యర్థ ప్రయత్నములు కలవాడగును. కన్యకు వరుడు లభించడు. స్త్రీకి సంతానము లభించదు. శ్రోత్రియునకు ఆచార్యత్వము శిష్యునకు అధ్యయనము, ధనికునకు లాభము, కృషీవలునకు కృషి, రాజునకు రాజ్యము లభింపవు. అట్టివారికి స్నానము చేయించవలెను. హస్త, పుష్యమి, అశ్వని, మృగశిర, శ్రవణ నక్షత్రములందు భద్ర పీఠముపై కూర్చుండబెట్టి పచ్చటి ఆవాలు నూరి నేతితో తడపి వాని శరీరము నందంతటను నలిచి, వాని శిరస్సుపై సర్వౌషధ సహితములగు, అన్ని విధముల సుగంధ ద్రవ్యము లను లేపనముచేసి సర్వౌషధులు వుంచిన నాలుగు కలశముల జలముతో ఆతనికి స్నానము చేయించవలెను. అశ్వశాల, గజశాల, పుట్ట, నదీసంగమము, జలాశయము, వీటినుండి తీసుకొని వచ్చిన ఐదు విధములగు మట్టియు, గోరోచనము, గంధము, గుగ్గులు, ఆ కలశజలము లందు ఉంచవలెను. ఆచార్యుడు తూర్పున నున్న కలశ తీసుకొని సహస్ర నేత్రములు కలదియు, మహర్షులచే పవిత్రీకృతమును అగు జలముతో నీకు స్నానము చేయించుచున్నాను, ఈ పవిత్ర జలము నిన్ను పవిత్రుని చేయుగాక అని చెప్పుచు స్నానము చేయించవలయును. రాజీవ వర్ణుడు సూర్యుడు, బృహస్పతి, ఇంద్రుడు, వాయువు, సప్తర్షులు, నీకు కల్యాణమును చేసిరి అనియు, ‘నీ కేశములందును, సీమంతము నందును, శిరస్సు యందును, లలాట, కర్ణ, నేత్రము లందున్న దౌర్భాగ్యమును ఈ జలము పూర్తిగా తొలగించు గాక’ అనియు చెప్పుచు స్నానము చేయించవలెను. గురువు తన ఎడమ చేతిలో గ్రహించిన కుశలను ఆ స్నానము చేసినవాని శిరస్సుపై ఉంచి, ఉడుంబస్రువతో ఆవ నూనెను హోమము చేయవలెను. ఆ సమయమున చివర స్వాహాయను పదము చేర్చిన చతుర్థ్యంతములగా మీత, సమ్మిత, శాలక కంటక, కూష్మాండ, రాజపుత్ర అను పదములను చెప్పవలెను. హోమము చేయగా మిగిలిన చరువుతో ‘నమః’ అను పదము చేరిన జలమంత్రములను ఉచ్చరించుచు వారికి బలి ఇవ్వవలెను. పిమ్మట చేటలో అంతట కుశములు పరచి తడి పొడిగా వున్న బియ్యము నూరిన తిలలు కలిపిన అన్నము, వివిధ పుష్పములు మాంసాన్నము, మత్స్యములు, త్రివిధసుర, మూలి, పూరి, అపూపములు ఏండవికమాలలు, దధ్యన్నము, పాయసము, పిష్టము, లడ్డులు, బెల్లము వీటిని ఒకచోట చతుష్పథమునందు చేర్చి వాటిని దేవతా, సువర్ణ, సర్ప, గృహ, అసుర, యాతుధాన, పిశాచ, నాగ, మాత్స, శాకినీ, యక్ష, వేతాళ, యోగినీ, పూతనాదులకు అర్పించవలెను. పిదప వినాయకుని తల్లియైన అంబికకు దూర్వాదళములు. తెల్ల ఆవాలు, పుష్పములు, వీటితో నిండిన అంజలిని సమర్పించి, సౌభాగ్యవతియైన ఓ దేవి! నాకు రూపమును, యశస్సును, సౌభాగ్యమును, పుత్రుని, ధనమును, సర్వకామములను ఇమ్ము అని ప్రార్థించవలెను. బ్రాహ్మణులకు భోజనము పెట్టి ఆచార్యునకు రెండు వస్త్రములు ఇవ్వవలెను. ఈ విధముగ వినాయకుని గ్రహములను పూజించుటచే ఐశ్వర్యమును, కర్మఫలమును పొందును. (266)