అగ్ని మహా పురాణము

Table of Contents

ఆచార వర్ణనము

పుష్కరుడు చెప్పెను: ప్రతిదినము ప్రాతఃకాలము నందు బ్రాహ్మ ముహూర్తమునందే విష్ణ్వాది దేవతలను స్మరించవలెను. పగలు మలమూత్ర త్యాగము ఉత్తరాభిముఖుడై చేయవలెను. రాత్రియందు దక్షిణాభిముఖుడై, సంధ్యలందు పగటియందువలె చేయవలెను. మార్గాదులందును, జలములందును, సందులు మొదలగువాటియందును ఎన్నడును మల త్యాగము చేయగూడదు, తృణముచే భూమికప్పి దానిపై మలత్యాగము చేయవలెను. మట్టితో హస్త పాదాది శుద్ధి చేయవలెను. స్నానము, నిత్యము, నైమిత్తికము, కామ్యము, క్రియాంగము, మలకర్షణము, క్రియాస్నానము అని ఆరు విధములు, స్నానము చేయనివాని కర్మలన్నియు నిష్పలములు. అందుచే ప్రతిదినము ప్రాతఃకాలమున స్నానము చేయవలెను. కూపము నుండి తోడిన జలము కంటె భూమిస్ధ జలము పవిత్రము. దాని కంటే సెలయేటిలోని నీరు, దానికంటే తటాకోదకము, దానికంటే నదీజలము, దానికంటె తీర్థోదకము పవిత్రము. గంగాజలము అన్నిటికంటెను పవిత్రము. నీటిలో మునిగి శరీరము నందలి మలమును కడిగివేసుకొని, ఆచమనముచేసి, ‘హిరణ్య వర్ణాః’ ఇత్యాది ఋక్త్రయముతోను, ‘శం నో దేవీరభిష్టయే’ అను మంత్రముతోను, ‘ఆపోహిష్ఠా, ఇత్యాది మంత్రములు మూడింటితోను, ‘ఇదమాపః’ ఇత్యాది మంత్రముతోను మార్జనము చేసికొనవలెను. పిదప జలాశయమునందు మునిగి, లోపలనే అఘ మర్షణ సూక్తముగాని ‘ద్రుపదాదివ’ అను మంత్రముగాని, ‘యఞ్జతేమనః’ ఇత్యాది సూక్తమునుగాని ‘సహస్రశీర్షా’ ఇత్యాది సూక్తమునుగాని జపించవలెను. విశేషించి గాయత్రీజపము ఉచితము. అఘమర్షణ సూక్తమునందు దేవత భావ వృత్తము, ఋషి అఘమర్షణుడు. ఛందస్సు అనుష్టుప్. తద్ద్వారా భావవృత్తుడగు హరిని స్మరించవలెను. బట్టలు పిండుచు దేవతా పితృతర్పణము చేయవలెను. పిదప పురుష సూక్తముతో జలాంజలి సమర్పించి, పిదప అగ్నిహోత్రముచేసి, యథాశక్తి దానము నిచ్చి, యోగక్షేమార్థమై పరమేశ్వరుని శరణమందవలెను. ఆసనము, శయ్య, వాహనము, స్త్రీ, సంతానము, కమండలము ఇవి తనవి అయినప్పుడే పవిత్రములు. ఇతరులవైనచో తనకు అవి అపవిత్రములు.

బరువు మోయుచున్న వానికిని, గర్భిణీస్త్రీకిని, పెద్దలకును మార్గమునీయవలెను. ఉదయంచుచున్న సూర్యుని, అస్తమించుచున్న సూర్యుని చూడరాదు. జలమునందు సూర్య ప్రతిబింబమును చూడకూడదు. నగ్నస్త్రీని, కూపములోనికిని, హత్యాస్థానమును, పాపాత్ములను చూడకూడదు. దూది, ఎముకలు, భస్మము, జుగుప్సాకరములగు వస్తువులను దాటకూడదు. ఇతరుల అంతఃపురములోనికి, కోశాగారములోనికిని ప్రవేశింపరాదు. ఇతరులకు దూతగా పనిచేయరాదు. విరిగిన నావ, చెట్టు, పర్వతము ఎక్కరాదు. ధనము, గృహము, శాస్త్రములు వీటి విషయమున కుతూహల ముతో నుండవలెను. (వేళ్లతో) మట్టి పెడ్డలు నలగకొట్టువాడు, తృణములు త్రుంచువాడు, గోళ్లు కొరుకువాడు నశింతురు. ముఖాదుల ద్వారా వాద్య శబ్దము పుట్టించరాదు. రాత్రి దీపము లేకుండ ఎచటికి పోరాదు. ద్వారము తప్ప మరొక మార్గమున ఇంట ప్రవేశింపరాదు. ముఖము రంగు మార్చుకొన గూడదు. సంభాషణమున ఎవరికిని బాధ కలిగించరాదు. తన వస్త్రమును ఇతరుల వస్త్రముతో మార్పు చేసికొనరాదు. ఎల్లపుడు ‘భద్రము, భద్రము’ అని అనుచుండవలెను. ఇతరులకు నష్టము కలిగించుమాట ఎన్నడును పలకరాదు. పలాశ (మోదుగు) ఆసనమును ఉపయోగించరాదు. దేవతాదుల నీడ నుండి దూరముగ ఉండవలెను. ఇద్దరు పూజ్యులగు వారి మధ్యనుండి వెళ్ళకూడదు. ఎంగిలివాడుగా ఉండి నక్షత్రాదులను చూడరాదు. ఒక నదిలో ఉన్నపుడు మరొకనది పేరు పలుక రాదు. రెండు చేతులతో గోకుకొనరాదు. ఏదైన నదిని సమీపించునపుడు దేవతా పితృతర్పణము చేయకుండ దానిని దాటరాదు. మలాదులను జలములో పడవేయరాదు. నగ్నుడై స్నానము చేయగూడదు. యోగ క్షేమముల కొరకై పరమాత్ముని శరణు పొందవలెను. శరీరముపైనున్న మాలను తన చేతులతో తీసివేయగూడదు. గాడిద దుమ్ము నుండి దూరముగా ఉండవలెను. తన కంటె తక్కువ స్థితిలోనున్న వారిని చూచి నవ్వకూడదు. వారితో కలసి ఒక స్థానమున నివసింపగూడదు. వైద్యుడు, రాజు, నదిలేని దేశమునందు నివసించగూడదు. మ్లేఛ్చులు, స్త్రీలు, అనేకులు అధిపతులుగా ఉన్న దేశమునందు నివసించరాదు. రజస్వలలతోను, పతితాదులతోను సంభాషణ చేయకూడదు. సదా విష్ణుస్మరణము చేయవలెను. ముఖమును అచ్ఛాదించు కొనకుండ నవ్వుట, ఆవలించుట, తుమ్ముట చేయరాదు. తెలివైనవాడు స్వామి యొక్క అవమానమును, తన అవమానమును రహస్యముగా ఉంచుకొనవలెను. ఇంద్రియములు చెప్పినట్లు చేయరాదు. మలమూత్రముల వేగము ఆపుకొనరాదు. పరశురామా! చిన్న రోగమును, చిన్న శత్రువునుగూడ ఉపేక్షించరాదు. మార్గముదాటి వచ్చిన పిమ్మట తప్పక ఆచమనము చేయవలెను. జలాగ్నులను ఒకేసారి ధరింపరాదు. కల్యాణమయుడగు పూజ్యుని విషయమున ఎన్నడును కోపముతో హుంకరింపగూడదు. పాదమును పాదముతో నొక్కకూడదు. ప్రత్యక్షముగాగాని, పరోక్షముగాగాని ఎవ్వరిని నిందింపరాదు. వేద, శాస్త్ర, రాజ, ఋషి, దేవతలను నిందింపరాదు. స్త్రీల విషయమున ఈర్ష్య యుండ కూడదు. ఎన్నడును వారిని విశ్వసింపగూడదు. ధర్మమును వినవలెను. దేవతలపై భక్తి చూపవలెను. ప్రతిదినము ధర్మాద్యనుష్ఠానము చేయవలెను. జన్మ నక్షత్ర దివసమున చంద్రుని, బ్రాహ్మణులను, దేవతాదులను పూజించవలెను. షష్ఠీ, అష్టమీ చతుర్దశీ దివసములందు తైలాభ్యంగ స్నానము చేయగూడదు. ఇంటినుంచి దూరముగపోయి మల మూత్ర విసర్జన చేయవలెను. ఉత్తమ పురుషులతో ఎన్నడును విరోధము చేయగూడదు. (155)