అగ్ని మహా పురాణము

Table of Contents

మండల వర్ణనము

పరమేశ్వరుడు చెప్పెను:

ఇప్పుడు నేను విజయమునకై నాలుగు విధములగు మండలములను గూర్చి చెప్పెదను. కృత్తికా, మఘా, పుష్య, పూర్వఫల్గునీ, విశాఖా, భరణీ, పూర్వాభాద్రల మండలము ఆగ్నేయ మండలము. దాని లక్షణము చెప్పెదను. ఈ మండలము నందు వాయు ప్రకోపము వచ్చినను, సూర్య చంద్ర పరివేషము కలిగినను, భూమి కంపించినను, దేశమునకు వినాశము కలుగును. సూర్య-చంద్ర గ్రహణములు వచ్చినను, ధూమజ్వాల కనబడినను, దిక్కులు దహించుకొని పోవుచున్నట్లు కన బడినను, ధూమకేతువు కనబడినను, రక్తవృష్టి వచ్చినను, ఎక్కువ వేడిగా ఉన్నను, రాళ్ళు కురిసినను జనులకు నేత్ర రోగము, అతిసారము, అగ్ని భయము కలుగును. ఆవు పాలు తక్కువ ఇచ్చును. వృక్షములందు ఫల పుష్పములు తక్కువగా ఉండును. పంట తక్కువగును. వృక్షములు కూడ తక్కువగా ఉండును. నాల్గు వర్ణముల వారును దుఃఖితులగుదురు. మనుష్యులందరును ఆకలితో బాధపడుదురు.

ఇట్టి ఉత్పాతములు కలిగినపుడు సింధు-యమునా ప్రాంతములు, గుజరాతు, భోజ, బాహ్లీక, జాలంధర, కాశ్మీర, ఉత్తరా పథములు నశించిపోవును. హస్త, చిత్రా, మఘా, స్వాతీ, మృగశీర్ష, పునర్వసు, ఉత్తర ఫల్గునీ, అశ్వినీ నక్షత్రముల మండలము వాయవ్య మండలము. ఈ మండలమునందు వెనుక చెప్పిన ఉత్పాతములు కలిగినచో ప్రజలందరును, హాహాకారము చేయుచు, నష్టప్రాయులు అగుదురు. డ్రాహల (త్రిపుర, కామరూప, కళింగ, కోసల, అయోధ్యా, ఉజ్జయినీ, కొంకణ, ఆంధ్రదేశములు నష్టమగును. ఆశ్లేషా, మూల, పూర్వాషాఢ, రేవతి, శతభిషా, ఉత్తరాభాద్రపదా నక్షత్రముల మండలము వారుణ మండలము. పైన చెప్పిన ఉత్పాతములు ఈ మండలమునందు ఉత్పన్నమైనచో ఆవుల పాలు, నెయ్యి వృద్ధిపొందును. వృక్షములందు ఫల పుష్పములు అధికముగా నుండును. ప్రజలు ఆరోగ్యవంతులు అగుదురు. భూమి సస్య సమృద్ధముగా నుండును.

ధాన్యములు చౌకగా నుండును. దేశము సుభిక్షముగా నుండును. కాని రాజుల మధ్య ఘోర సంగ్రామములు చెలరేగును. జ్యేష్ఠా, రోహిణీ, అనూరాధా, శ్రవణ, ధనిష్ఠా, ఉత్తరాభాద్రపదా, అభిజిత్తుల మండలము మహేంద్ర మండలము. ఈ మండలమునందు పై ఉత్పాతములు సంభవించినచో ప్రజలు సౌఖ్యముతో ఉందురు. రోగభయ మేమియు ఉండదు. రాజులు తమలో సంధి చేసికొందురు. రాజులకు హితకరమగునటుల సుభిక్ష మేర్పడును.

ముఖగ్రామ, పుచ్ఛగ్రామము అని గ్రామము రెండు విధములు. చంద్ర, రాహు, సూర్యులు ఒకే రాశిలో ఉన్నపుడు ముఖగ్రామము, రాహువునుండి ఏడవ స్థానమునకు పుచ్ఛగ్రామమని పేరు. చంద్రుడు సూర్యుడున్న నక్షత్రమునుండి పదునైదవ నక్షత్రమునకు వచ్చినపుడు, తిథిసాధనము ననుసరించి సోమగ్రామము, అనగా పూర్ణిమాతిథి అగును. (130)