అగ్ని మహా పురాణము

Table of Contents

సర్పదష్ట చికిత్స

అగ్నిదేవుడు చెప్పెను:

మంత్ర, ధ్యాన, ఔషధములతో పాముకరచిన వానికి చికిత్సను నీకు చెప్పెదను. ‘ఓం నమోభగవతే నీలకంఠాయ’ అను మంత్రమును జపించుటచే విషము నశించును. గోమయ రసమును ఘృతముతో త్రాగించినచో ఇది ప్రాణమును రక్షించును. విషము రెండు విధములు. సర్ప మూషకాది విషము, జంగమ విషము. శృంగాది విషము స్థావర విషము. శాంత స్వరముతో బ్రహ్మ (క్లైం) లోహితము (హ్రీం) తారకము (ఓం) శివము (హౌం) ఈ అక్షరములతో వియతి నామమంత్రమున్నది. దీనికి శబ్దమయతార్క్ష్యుడు అని పేరు. ‘ఓంజ్వల’ మొదలు ‘అప్రతిహతశాసనం’ ‘వం హూంఫట్ హస్త్రాయఫట్’ అనునది మంత్రము. ‘ఉగ్రరూప ధారక’ మొదలు ‘స్వాహా నేత్రాయ’ వరకు కూడ మంత్రము. మాతృకాన్వయ కమలము వ్రాసి దానికి ఎనిమిది దిక్కులందును ఎనిమిది దళములుండునట్లు చూడవలెను. పూర్వాది దిక్కులందు రెండేసి స్వరములు వ్రాయ వలయును. ‘క’ వర్గము మొదలు ఏడు వర్గముల చివరి రెండేసి అక్షరములు కూడ ఒక్కొక్క దళముపై వ్రాయవలయును. ఈ కమలము యొక్క కేసర భాగమును వర్గముల ఆద్యక్షరములచే కప్పి కర్ణికయందు అగ్ని బీజమును (రం) వ్రాయవలయును. సాధకుడు ఆ కమలమును హృదయము నందుంచుకొని ఎడమ చేతిలో దానిని భావన చేయవలయును. అంగుష్టాదులందు వియతి మంత్రవర్ణముల న్యాసముచేసి వాటిచే భిన్నములగు కళలను భావన చేయవలయును. పిమ్మట పసుపుపచ్చని రంగుతో భూపురము అను చతుష్కోణ మండపము చేసి దానికి నాల్గు వైపులను వజ్ర చిహ్నము వుంచవలెను. ఈ మండలమునకు ఇంద్రుడు దేవత అర్ధచంద్రాకార వృత్తము జలదేవతా సంబంధమైనది. కమలములోని సగము భాగము శుక్ల వర్ణము. దాని దేవత వరుణుడు. పిదప స్వస్తిక చిహ్నముతో గూడిన త్రికోణాకారము తేజోమయమగు వహ్నిదేవతా మండల చింతన చేయవలయును. వాయు దేవతామండలము బిందుయుక్తమై వృత్తాకారమై నల్లని మాలలతో ప్రకాశించుచుండును.

ఈ నాలుగు వియతి వర్ణములను అంగుష్టాది అంగుళీ మధ్య పర్వములందు సువర్ణమయ నాగవాహనముచే చుట్టబడిన స్థానమునందు ఉన్నట్లు భావనచేసి ఆ నాలుగు పర్వములందు పృథివ్యాది భూతములను నాల్గింటి న్యాసము చేయవలయును. పిదప రూప రహిత శబ్ద తన్మాత్రమగు శివ దేవుని యొక్క ఆకాశతత్వమును కనిష్ఠికా మధ్య పర్వమున వున్నట్లు భావనచేసి దాని లోపల వేదమంత్ర ప్రథమాక్షరమును న్యాసము చేయవలయును. నామముల ఆద్యక్షరములను వాటి మండలములపై న్యాసము చేయవలయును. పృథివ్యాది భూతముల మొదటి అక్షరములను అంగు షాదుల చివరి పర్వములపై న్యాసము చేసి విద్వాంసుడు గంగాది తన్మాత్రల అక్షరములను ఐదు అంగుళులపై న్యాసము చేయవలయును. ఇట్లు చేసినవాడు తార్థ్యమంత్రము ఉచ్చరించుచు పాము కరచిన వానిని స్పృశించగానే రెండు విధముల విషము నశించును. వియతి మంత్రము యొక్క నాలుగు అక్షరములను తన శ్రేష్ఠమైన రెండు అంగుళులతో నాభి స్థానమందును పర్వమునందును న్యాసము చేయవలయును. గరుత్మంతుడు మోకాళ్ళ వరకు బంగారు ఛాయ కల్గి యుండును. మోకాళ్ళ నుండి నాభివరకు మంచువంటి తెల్లటి కాంతి కలిగి ఉండును. నాభి నుండి కంఠము వరకు ఎర్రగాను, కంఠము నుండి కేశముల వరకు నల్లగాను ఉండును. ఇతడు బ్రహ్మాండమునంతను వ్యాపించి ఉండును. చంద్రుడను పేరుగల ఇతడు సర్పాలంకారములను ధరించి ఉండును. మంత్రవేత్త తనను గరుడ స్వరూపునిగా భావించ వలయును. అట్టి వాని వాక్యము చేతనే విషము తొలగిపోవును. గరుడుని చేతి పిడికిలి రోగి యొక్క చేతిలో వున్నచో అది ఆతని అంగుష్ఠము నందలి విషమును తొలగించును. ఆ మంత్ర వేత్త గరుడ స్వరూపమగు తన హస్తమును పైకి ఎత్తి ఐదు వేళ్ళను కదల్చినంత మాత్రముననే విషమువల్ల కలిగిన మదాదులను చూచుచు విష స్థంభనాదికము చేయకలుగును.

ఆకాశము మొదలు భూ బీజమువరకు వున్న ఐదు బీజములకు పంచాక్షర మంత్ర రాజము అని పేరు. (హం, యం, రం, వం, లం) అధికమైన విషమును స్తంభింప చేయవలసి వచ్చినపుడు ఈ మంత్రమును ఉచ్చరించినంత మాత్రముననే విషము శమించును. దీనికి వ్యత్యస్థ భూషణ బీజ మంత్రమని పేరు. దీనిని బాగుగ సాధనచేసి ప్రారంభమున సంప్లవము, ప్లావయ ప్లావయ అనువాక్యము చేర్చినచో విషసంహారమగును. ఈ మంత్రమును బాగుగ జపించి అభిమంత్రించిన జలముతో స్నానము చేయించినంత మాత్రముననే రోగిని లేచునట్లు చేయును. లేదా మంత్రము జపించుచు చేసిన శంఖ భేర్యాది ధ్వనిని విన్నంత మాత్రముననే నిస్సందేహముగ విషము నశించును. భూ బీజ తేజో బీజములను తారుమారుచేసి ఆ మంత్రమును ఏర్పరచినచో దాని ప్రయోగము వలన కూడ విషము నశించును. భూ బీజ వాయు బీజములను తారుమారు చేసి మంత్రము ఏర్పరచి ప్రయోగించినచో ఆ విషము మరియొకని చేరును. మాంత్రికుడు రోగి దగ్గరగా ఉండి కాని, తనయింటిలో ఉండికాని, గరుడస్వరూపమును చింతించుచు తానే గరుత్మంతుడని భావన చేయుచు రం, వం అను రెండు బీజములనే ఉచ్చరించినచో సాఫల్యమును పొందును. గరుత్మంతుని ఆలయమునందు కాని వరుణుని ఆలయమందు కాని కూర్చుండి ఈ మంత్రమును జపించినచో విషమును నశింపచేయగలుగును. ఈ మంత్రమునకు ‘స్వధా’ శ్రీ బీజములను చేర్చినచో దీనికి ‘బౌము దండి’ మంత్రముయని పేరు. దీనిని జపించుచు స్నానముచేసి జలము త్రాగినచో సాధకుడు అన్ని విధములగు విషముల పైనను జ్వరముల పైనను, రోగములపైనను అపమృత్యువుపైనను విజయము సాధించును. ‘పక్షి పక్షి మొదలు క్షి క్షి స్వాహా’ వరకు ఉన్న మూలోక్త మంత్రములు గరుడ మంత్రములు. ఈ మంత్రమును ఉచ్చరించుచు అభిమంత్రించినచో విషము నశించును. ‘పక్షిరాజాయ’ మొదలు ‘ప్రచోదయాత్’ వరకు గరుడ గాయత్రి మంత్రము పైన చెప్పిన రెండు పక్షిరాజ మంత్రములకును రంబీజము చేర్చి వాటి పార్శ్వము నందుకూడ ‘రం’చేర్చి పిమ్మట దంత శ్రీ, దండి, కాల, లాంగలీ లను చేర్చి దాని మొదట నీలకంఠ మంత్రము చేర్చవలయును. ఈ మంత్రమును వక్షస్థలము నందును, కంఠమునందును శిఖయందును న్యాసము చేయవలయును. పై రెండు మంత్రములను సంస్కరించి స్తంభముపై వ్రాయవలయును.

పిదప ‘హర హర హృదయాయ నమః’ యని హృదయ న్యాసము ‘కపర్ది స్వాహా, శిరసే స్వాహా, నీలకంఠాయ స్వాహా, శిఖాయై వషట్ అను న్యాసములను చేసి కాలకూట విష భక్షణాయ’ హుంఫట్, కవచాయ హుం అని చెప్పుచు భుజములను కంఠములను స్పృశించవలయును. ‘కృత్తి వాససే వౌషట్’ అని నేత్రత్రయమునందు న్యాసము చేయవలయును. పూర్వాది దిక్కులందు క్రమముగ శ్వేత, పీత, అరుణ, శ్యామ ముఖములు కలవాడును నాలుగు హస్తములందును క్రమముగ అభయ వరద, ముద్రలు, ధనుస్సు, వాసుకి ధరించినవాడును, కంఠమునందు యజ్ఞోపవీతముతో ప్రకాశించుచుండువాడును పార్శ్వమున పార్వతితో కూడిన రుద్రుడు దాని దేవత మంత్రాక్షరములను పాదములు మోకాళ్లు గుహ్యభాగము నాభి హృదయము, కంఠము, శిరస్సు వీటిపై న్యాసముచేసి రెండు హస్తముల అంగుష్ఠాద్యంగుళులపై కూడ న్యాసము చేయవలయును. అనగా తర్జని మొదలు తర్జనివరకు న్యాసముచేసి సంపూర్ణ మంత్రమును అంగుష్ఠములపై న్యాసము చేయవలయును. ఈ విధముగ ధ్యానన్యాసములు చేసి శీఘ్రముగ శూలముద్రను బంధించి విషసంహారము చేయవలయును. కనిష్ఠ అంగుళిని జేష్టాంగుళితో బంధించి మిగిలిన మూడు వ్రేళ్ళను చాపినచో అది శూల ముద్ర. విషమును నశింపచేయుటకు ఎడమ చేతిని, ఇతర కార్యములందు కుడిచేతిని ప్రయోగించవలయును. ‘ఓం నమో భగవతే’ మొదలు ‘రుద్ర మన్యవే’ వరకు వున్న మూలోక్త మంత్రమును జపించుచు తుడిచినచో విషము నశించును. సందేహము లేదు. ఈ మంత్రమును రోగి చెవిలో జపించుటచేగాని, మంత్రము జపించుచు రోగి ప్రక్క నేలపై చెప్పుతో కొట్టుటచేతగాని విషము దిగిపోవును. రుద్ర విధానము ననుసరించి నీలగ్రీవుడైన మహేశ్వరుని ఆరాధించినచో విష వ్యాధి తొలగిపోవును. (295)