అగ్ని మహా పురాణము
శ్రాద్ధకల్ప వర్ణనము
పుష్కరుడు చెప్పెను:
ఇప్పుడు భుక్తిముక్తి ప్రదమగు శ్రాద్ధ కల్పమును గూర్చి చెప్పెదను. సావధానముగా వినుము. శ్రాద్ధకర్త మనస్సును, ఇంద్రియములను వశమునందుంచుకొని పవిత్రుడై ఒక రోజు ముందుగా బ్రాహ్మణులను నిమంత్రించవలెను. శ్రాద్ధదివసమున, అపరాహ్ణకాలమునందు వచ్చిన ఆ బ్రాహ్మణులను స్వాగతాదులచే పూజించవలెను. వారిని పీఠముపై కూర్చుండబెట్టవలెను. దైవస్థానమున సరిసంఖ్య కలవారిని, పితృస్థానమునందు బేసి సంఖ్య కలవారిని కూర్చుండబెట్టవలెను. దైవస్థానమున ప్రాఙ్ముఖముగ కూర్చుండబెట్టవలెను. పితృస్థానమునందు ఒకరిని లేదా ముగ్గురిని కూర్చుండబెట్టవలెను. లేదా రెండింటి యందును ఒక్కరొక్కరే ఉండవచ్చును. మాతామహశ్రాద్ధమునందు గూడ ఇట్లే; పాణి ప్రక్షాళన ఉదకమును, ఆసనముకొరకై కుశలను ఇచ్చి, అనుజ్ఞపొంది ‘విశ్వేదేవాసః’ ఇత్యాది మంత్రముచే ఆవాహనముచేసి, సపవిత్రమగు పాత్రయందు యవలు చల్లి ‘శం నోదేవీః’ అను మంత్రముచే నీళ్లు పోసి, ‘యవోసి’ అను మంత్రముచే యవలు చల్లి, ‘యా దివ్యా ఆపః’ అను మంత్రముచే హస్తమునందు అర్ఘ్యము ఇవ్వవలెను. పిదప ఉదకమును, గంధ మాల్యములను, ధూప దీపములను ఇవ్వవలెను. పిదప అపసవ్యము చేసుకొని పితృ దేవతలకు అప్రదక్షిణముగా ద్విగుణములగు కుశలను ఆసనముగా ఇచ్చి, ‘ఉశన్తస్త్వా’ అను మంత్రముచే ఆ పితృ దేవతల ఆవాహనముచేసి, అనుజ్ఞ పొందినవాడై, ‘ఆ యాన్తు నః’ అను మంత్రము జపించవలెను. ఇచట యవలకు బదులు తిలలు వాడవలెను. అర్ఘ్యాదికమును వెనుకటివలెనే ఇచ్చి, సంస్రవమును (కారిన జలమును) పితృ పాత్రమునందు గ్రహించి దానిని ‘పితృభ్యః స్థానమసి’ అని చెప్పుచు అధోముఖము చేయవలెను. ‘అగ్నౌ కరిష్యే’ అని చెప్పి కురుష్వ అని అనుజ్ఞపొంది, ఘృతమిశ్రితమగు అన్నము గ్రహించి, పితృయజ్ఞమునందువలె అగ్నిలో హోమముచేసి, హోమము చేయగా మిగిలిన అన్నమును పాత్రలలో ఉంచవలెను. లభ్యమగు పాత్రలలో-విశేషించి రజత పాత్రలలో అన్నము ఉంచి, ‘పృథివీ తే పాత్రమ్’ ఇత్యాది మంత్రముచే పాత్రాభిమంత్రణ చేయవలెను.
‘ఇదం విష్ణుః’ అను మంత్రముచేత ద్విజుని అంగుష్ఠము అన్నమునందు ఉంచవలెను. వ్యాహృతులతో గూడిన గాయత్రిని, మధువాతాః ఇత్యాది ఋక్త్రయమును జపించి ‘సుఖముగా భుజించండి’ అని చెప్పవలెను. వారు కూడ మౌనముతో భుజింపవలెను. వారికి ఇష్టము, హవిర్యోగ్యము అయిన అన్నము వడ్డించవలెను. పవిత్ర మంత్రము జపించి అన్నమును గ్రహించి, ‘తృప్తి చెందినారా?’ అని ప్రశ్నించి ‘తృప్తి చెందితిమి’ అని వారు సమాధానము చెప్పవలెను. వారు తినగా మిగిలిన అన్నమును భూమిపై చల్లి ఒక్కొక్క పర్యాయము ఉదకము ఇవ్వవలెను. ఆ అన్నమునంతను గ్రహించి, దక్షిణాభి ముఖుడై, ఉచ్ఛిష్ట సమీపమున పితృయజ్ఞమునందువలె పిండ ప్రదానము చేయవలెను. మాతామహులకు కూడ ఇట్లే చేయవలెను. పిదప ఆచమనము ఇచ్చి, స్వస్తి వాచనము చేయవలెను. అక్షయ్యోదకము ఇవ్వవలెను. యథాశక్తిగా దక్షిణ సమర్పించి ‘వాచ్యతామ్’ అని అనుజ్ఞపొంది స్వధా అని పలుకవలెను. ‘అస్తు స్వధా’ అని చెప్పగా పిదప జలమును భూమిపై విడువవలెను. ‘ప్రీయన్తాం విశ్వేదేవాః’ అని అనుచు దేవస్థానమున ఉదకము ఇవ్వవలెను. ‘మాలో దాతలు వృద్ధి పొందుదురుగాక! వేదములు, సంతానము కూడ వృద్ధి పొందుగాక! మాశ్రద్ధ కూడ తగ్గకుండుగాక! మావద్ద ఇతరులకు ఇచ్చుటకు అధిక ధనాదికము ఉండుగాక! ఈ విధముగ ప్రియవాక్కులు పలుకుచు నమస్కరించి విసర్జించవలెను. ముందుగా ‘వాజే వాజే’ ఇత్యాది మంత్రముతో పితృ దేవతా విసర్జనము చేయవలెను. పూర్వము సంస్రవములు పడిన అర్ఘ్యపాత్రలను ఉత్తానముచేసి బ్రాహ్మణులను పంపివేయవలెను.
బ్రాహ్మణులను ప్రదక్షిణ క్రమమున కొంతదూరము అనుసరించి వెళ్లి మరల వచ్చి పితృ దేవ భుక్త శేషమును భుజించి, ఆ రాత్రి తాను, బ్రాహ్మణులతో గూడ బ్రహ్మచారిగా ఉండవలెను. ఇదేవిధముగ పుత్రజన్మాది వృద్ధి సమయములందు ప్రదక్షిణావృత్తిచే నాందీముఖ పితృ దేవతలను పూజించవలెను. పెరుగు కర్కంధూఫలము కలిసిన అన్నముతో పిండదానముచేసి, తిలస్థానమున యవలను ఉపయోగించవలెను. ఏకోద్దిష్ట శ్రాద్ధమున విశ్వేదేవపూజ ఉండదు. ఒకే అర్ఘ్యపాత్ర, ఒకే పవిత్రము ఉండును. ఆవాహనము, అగ్నౌకరణము ఉండదు. యజ్ఞోపవీతమును అపసవ్యముగా చేసికొని అన్ని కార్యములు చేయబడును. ‘అక్షయ్యమస్తు’ అనుటకు బదులు ‘ఉపతిష్ఠతామ్’ అని చెప్పవలెను. ‘వాజే వాజే’ ఇత్యాది మంత్రముతో బ్రాహ్మణ విసర్జన చేయునపుడు ‘అభిరమ్యతామ్’ అని చెప్పగా, వారు ‘అభిరతాః స్మః’ అని పలుకుదురు. సపిండీకరణ శ్రాద్ధమునందు వెనుక చెప్పిన విధముగ అర్ఘ్యసిద్ధి కొరకై గంధ, జల, తిలయుక్తములు అగు నాలుగు అర్ఘ్యపాత్రలు చేసికొనవలెను. ప్రేతపాత్ర జలములు పితృపాత్రవనందు పోయవలెను. ఆ సమయమునందు ‘యే సమానాః’ ఇత్యాది మంత్రద్వయమును పఠించవలెను. మిగిలిన క్రియాకలాపము వెనుకటివలెనే. ఈ సపిండీ కరణ ఏకోద్దిష్ట, శ్రాద్ధములు తల్లికి గూడ చేయవలెను. సపిండీకరణము సంవత్సరమునకు ముందుగానే చేసివేసినవాని నిమిత్తమై సంవత్సరము పాటు, ఉదకుంభ సహిత అన్నమును ఇవ్వవలెను. ఒక సంవత్సరముపాటు ప్రతిమాసమునందును ఒక పర్యాయము క్షయాహతిథియందు ఏకోద్దిష్టము చేయుట ఉచితము. మొదటి ఏకోదిష్టము పదకొండవ దినమునందు చేయబడును. శ్రాద్ధమునందు హవిష్యాన్నమును ఇచ్చుటచే ఒకమాసము వరకును, పాయసము నిచ్చుటచే సంవత్సరము వరకును పితృదేవతలకు తృప్తి కలుగును. మత్స్య, హరిణ, ఉరభ్ర, శకుని, ఛాగ, పృషత, ఐణ, రురు, వరాహ, శశ మాంసములు ఇచ్చినచో పితామహులకు వరుసగా ఒక్కొక్క మాసము అధికముగ తృప్తి కలుగును. ఖడ్గమృగ మాంసము, మహాశల్క మాంసము, మధు యుక్తాన్నము, లోహ మాంసము, కాలశాకము, వార్ధీణస మాంసము, గయాదత్తము-ఇవి అన్నియు అనంత తృప్తిని ఇచ్చును. భాద్రపద కృష్ణ త్రయోదశి యందు విశేషించి మఘా నక్షత్ర యోగమున పితృ దేవతలకు ఇచ్చినది అక్షయమగును. శ్రాద్ధము చేసినవాడు సర్వదా రూపశీలవతియైన కన్యను, సంతానమును, స్తోత్ర పాఠకులను, మంచి పశువులను, సుతులను, నెయ్యి, కృషి, వాణిజ్యము, రెండు డెక్కల జంతువులను, ఒక శఫముగల జంతువులను, బ్రహ్మవర్చస్సుగల పుత్రులను, స్వర్గమును, వెండిని, కుప్యమును, జ్ఞాతులలో శ్రేష్ఠత్వమును, సర్వ కామములను పొందును.
చతుర్దశితప్ప, ప్రతిపత్తు మొదలు పదునైదు తిథులందు, శస్త్రహతులకు శ్రాద్ధము చేయబడును. కృత్తిక మొదలు భరణి వరకును యథాశాస్త్రముగ శ్రాద్ధమును ఇచ్చువాడు స్వర్గమును, సంతానమును, తేజస్సును, శౌర్యమును, సుతులను, పుత్రులను, వాణిజ్యమును, ప్రభుత్వము, ఆరోగ్యమును, యశస్సును, శోక వినాశనమును, పరమగతిని, ధనమును, విద్యను, వైద్యసిద్ధిని, వెండిని, గోవులను, గొఱ్ఱెలను, అశ్వములను, ఆయుస్సును పొందును. శ్రాద్ధముచేత తర్పితులై వసురుద్ర ఆదిత్య రూపులైన శ్రాద్ధ దేవతలైన పితృ దేవతలు, మనుష్యుల పితరులను సంతోషింపచేయుదురు. సంతసించిన పితామహులు మనుష్యులకు ఆయుః ప్రజా, ధన, విద్యలను, స్వర్గ, మోక్ష, సుఖములను రాజ్యమును ఇత్తురు. (163)
