అగ్ని మహా పురాణము

Table of Contents

వివిధ వ్రతములు

అగ్ని దేవుడు పలికెను:

ఇపుడు భుక్తి ముక్తి ప్రదములగు ఋతు వ్రతములను గూర్చి చెప్పెదను: వర్షా, శరత్, హేమంత, శిశిరర్తువులందు కట్టెలు దానముచేసి, ప్రతాంతమున ఘృతధేను దానముచేసి ఈ విధముగ అగ్ని వ్రతమును పాలించినవాడు మరుజన్మలో బ్రాహ్మణుడై పుట్టును. ఒకమాసము సంధ్యా సమయమున మౌన వ్రతము అవలంబించి మాసాంతమున బ్రాహ్మణునకు ఘృత కుంభము, తిలలు, ఘంట, వస్త్రములు దానము చేయువాడు ఈ సారస్వత వ్రత మాచరించి సుఖవంతుడగును. ఒక సంవత్సరము పంచామృత స్నానము చేసి గోదానము చేయువాడు రాజగును. చైత్ర ఏకాదశినాడు నక్త భుక్త వ్రతము చేసి చైత్ర మాసాంతమున విష్ణు భక్తుడగు బ్రాహ్మణునకు సువర్ణమయ విష్ణు ప్రతిమను దానము చేయవలెను. ఇట్లే ఉత్తమమగు విష్ణువ్రతము నాచరించినవాడు విష్ణుపదమును పొందును. ఒక సంవత్సరము పాయస భోజనముచేసి రెండు గోవులను దానము చేసినవాడు ఈ దేవీవ్రతముచే శ్రీసంపన్నుడగును. ఒక సంవత్సరము పితృ దేవతలకు సమర్పించిన అన్నము భుజించువాడు రాజ్యమును పొందును. ఇవి వర్ష వ్రతములు. ఇపుడు సంక్రాంతి వ్రతములను చెప్పెదను. సంక్రాంతినాడు జాగరణ చేసినవాడు స్వర్గమును పొందును. అమావాస్యనాడు సంక్రాంతి వచ్చినపుడు శివసూర్యులను పూజించినవాడు స్వర్గమును పొందును. మకర సంక్రాంతినాడు ప్రాతః స్నానముచేసి కేశవుని అర్చించవలెను. ఉద్యాపనమున ముప్పది రెండు పలముల స్వర్ణము దానము చేసినవాడు సకల పాప విముక్తుడగును. విషువాది యోగములందు శ్రీమహావిష్ణువునకు ఘృతమిశ్ర దుగ్ధాదులతో స్నానము చేయించినవాడు సర్వమును పొందును. స్త్రీలకు ఉమావ్రతము లక్ష్మీప్రదము. వారు తృతీయా-అష్టమీ తిథులందు గౌరీశంకరుని పూజించవలెను. ఈ విధముగ శివపార్వతీ పూజచేసిన స్త్రీ అఖండ సౌభాగ్యముకలది అగును. ఆమెకు ఎన్నడును పతివియోగము కలుగదు. ‘మూలవ్రత’ ‘ఉమేశ వ్రతములు’ ఆచరించు స్త్రీ, సూర్య భక్తురాలగు స్త్రీ కూడ, తరువాతి జన్మలో తప్పక పురుషత్వమును పొందును. (199)