అగ్ని మహా పురాణము
వ్యవహార కథనము-1
అగ్నిదేవుడు చెప్పెను:
వశిష్ఠా! ఇపుడు నయ, అనయముల వివేకమును తెలుపు వ్యవహారమును వర్ణించెదను. దీనికి నాలుగు చరణములు, నాలుగు స్థానములు, నాలుగు సాధనములు చెప్పబడినవి. ఇది నలుగురికి హితము చేకూర్చును. నలుగురికి సంబంధించి యుండును. నాలుగు చేయును. దీనికి ఎనిమిది అంగములు. పదునెనిమిది పదములు, నూరు శాఖలు, మూడు యోనులు, రెండు అభియోగములు, రెండు ద్వారములు, రెండు గతులు ఉండును. ధర్మము, వ్యవహారము, చరిత్రము, రాజశాసనము అనునవి వ్యవహార దర్శనము యొక్క నాలుగు చరణములు. వీటిలో ఉత్తరోత్తర చరణములు పూర్వపూర్వ సాధకములు. వీటిలో ధర్మమునకు ఆధారము సత్యము. వ్యవహారమునకు ఆధారము సాక్ష్యము. చరిత్ర పురుష సంగ్రహాధీనము. శాసనము రాజాజ్ఞాధీనము. ఇది సామ, దాన, భేద, దండములచే సాధ్యముగాన చతుః సాధనము, ఇది అభియోక్త, సాక్షి, సభాసదులు, రాజు అనువారిపై ఒక్కొక్క పాదమున నిలచియుండును. అందుచే ఇది చతుర్య్వాపి. ఇది ధర్మ, అర్థ, యశో, లోకప్రియతలను నాల్గింటిని పెంచును గానచతుష్కారి. రాజపురుష, సభాసద, శాస్త్ర, గణక, లేఖక, సువర్ణ, అగ్ని, జలములను ఎనిమిది అంగములు కలదగుటచే అష్టాంగము. మానవుడు కామ, క్రోధ, లోభములచే దీనియందు ప్రవృత్తుడగును. అందుచే ఇది త్రియోని, శంకాభియోగము, తత్త్వాభియోగము అని అభియోగములు రెండు విధములు. అందుచే ఇది ద్వ్యభియోగము. అసత్పురుష సంబంధముచే శంకాభియోగము, తగిన ప్రమాణములను చూచుటచే తత్త్వాభియోగము ఏర్పడును. దీనికి పూర్వవాద పక్షము (అభియోగము చేసినవాడు) ఉత్తరవాద ప్రతిపక్షము, (ఎవనిపై అభియోగము చేయబడినదో వాడు) అను రెండు పక్షములు ఉండును గాన ఇది ‘ద్విద్వారము’. నిజముగా జరిగినది, కపటము అను రెండు పద్ధతులుండుగాన ద్విగతి.
ఎట్టి ఋణమీయ వచ్చును. ఎట్టిది ఈయరాదు. ఎప్పుడు ఇవ్వవచ్చును. ఎప్పుడు ఇవ్వరాదు. ఎట్లు ఇవ్వవలెను. ఋణమునిచ్చు విధానమేది. దానిని మరల రాబట్టుకొనుట ఎట్లు-ఈ విషయములనన్నింటిని విచారించుట ఋణదానము’. ఒక వ్యక్తి విశ్వాసముతో మరొక వ్యక్తి వద్ద ధనమును దాచి ఉంచినచో అది ‘నిక్షేపము’. వర్తకులు మొదలగు వారు చాలమంది కలిసి పరస్పర సహకారముతో ఏదైన ఒక కార్యము చేసినచో అది సంభూయ సముత్థానము’ అను వివాదపదము. ఒక వ్యక్తి ఏదైన ఒక వస్తువును యథా విధిగ ఇతరునికి దానము చేసికూడ దీనిని తనకే ఉంచు కొనవలెనని కోరినచో అది “దత్తాప్రదానిక” వివాదపదము. సేవ చేసెదనని చెప్పి సేవచేయకున్నచో అది “అభ్యు పేత్య-అశుశ్రూష” అను వివాదపదము. భృత్యులకు వేతనము సరిగి చెల్లించక పోవుటచే ఏర్పడినది ‘వేతనా నపాకర్మ వివాద పదము’. తాకట్టు పెట్టిన లేదా నష్టమైన పరద్రవ్యమును, అపహరించినదానిని, దాని స్వామికి తెలియకుండ అమ్మివేసినచో అది ‘ఆ స్వామి విక్రయము’ అను వివాదపదము. వర్తకుడు ఒక వస్తువును అమ్మిన తరువాత కూడ దానిని కొన్నవానికి ఇవ్వకున్నచో అది ‘విక్రీయా సంప్రదానము’ అను వివాదపదము. ఒక వస్తువును కొన్నవాడు అది బాగులేదని అన్నచో అది ‘క్రీతానుశయము’ అను వివాదపదము. గ్రాహకుడు ఒక వస్తువును మూల్యము చెల్లించికొన్న పిమ్మట ఆ కొనుగోలు సరిగాలేదని తలచి, దానిని ఆ దినమునందే వర్తకునకు తిరిగి ఇచ్చివేసినచో, విక్రేత దాని మూల్యమునంతను ఏ మాత్రము తగ్గించకుండ క్రేతకు తిరిగి ఇచ్చి వేయవలెను.
పాషండులు, నైగములు మొదలగు వారి స్థితికి సమయమని పేరు. దీనికి సంబంధించినది ‘సమయానపాక కర్మ వివాదపదము’. పొలములపై అధికారమును పురస్కరిం చుకొని వంతెనలు, మళ్ళు, సరిహద్దులు-వీటిని గూర్చిన వివాదము ‘క్షేత్రజము’. స్త్రీ-పురుషుల వివాహాదులకు సంబంధించినది ‘స్త్రీ పుంసయోగ వివాదపదము’. తండ్రి ఆస్తిని పంచుకొను పుత్రులలో ఏర్పడినది ‘దాయభాగ వివాదపదము’. బలగర్వముచే అనాలోచితముగ చేసిన అది ‘సాహస వివాదపదము’. ఒక వ్యక్తిని ఆతని దేశము, జాతి, కులము మొదలగు వాటిని పురస్కరించుకొని దోషారోపణము చేయుచు విపరీ తార్థములుగల వ్యంగ్యోక్తులు పలుకుట ‘వాక్పారుష్య వివాదపదము’. హస్త పాదములచేగాని, ఆయుధముచేగాని, అగ్నిచేత గాని ఎవరికైన శరీరముపై అఘాతము కలిగించుట ‘దండ పారుష్యము’. పాచికలు, తోలు ముక్కలు, ఏనుగు దంతములతో చేసిన శలాకలు. వీటిని ఉపయోగించి చేయు క్రీడకు ద్యూతమని పేరు. పశు పక్ష్యాదులను ఉపయోగించిచేయు క్రీడ ‘ప్రాణి ద్యూతము’. రాజు ఆజ్ఞను ఉల్లంఘించి ఆతడు చెప్పిన పని చేయకుండుట ‘ప్రకీర్ణక’ మను వ్యవహారపదము. ఈ వివాద పదము రాజుకు సంబంధించినది. ఈ విధముగ వ్యవహారమునందు పదునెనిమిది పదములున్నవి. వీటికి మరల నూరు భేదములున్నవి. మనుష్యుల పనులను బట్టి ఈ నూరు భేదములు ఏర్పడును.
రాజు క్రోధ రహితుడై జ్ఞానసంపన్నులగు బ్రాహ్మణులతో కలిసి వ్యవహార విచారము చేయవలెను. వేదవేత్తలు, శత్రుమిత్రులను సమాన దృష్టితో చూడగలిగిన వారును, లోభ రహితులును అగువారిని సభాసదులనుగ నియమించవలెను. తాను స్వయముగ వ్యవహారము చూడ వీలులేనప్పుడు రాజు సభాసదులతో పాటు విద్వాంసుడగు ఒక బ్రాహ్మణుని ఆ కార్యమున నియమించవలెను. సభాసదులు రాగ, లోభ, భయాదులచే ధర్మశాస్త్ర, ఆచారాది విరుద్ధములగు నిర్ణయములు చేసినచో రాజు వారిపై వేరు వేరు వివాదముకంటె రెట్టింపు అర్థదండముచే వారిని శిక్షించవలెను. ఎవ్వడైన ఒక వ్యక్తి మరొక వ్యక్తిచే ధర్మశాస్త్ర, సమాచారములకు విరుద్ధముగ బాధింపబడినచో, ఆతడు రాజు వద్దకు వెళ్ళి ఆ విషయమును తెలిపిన అది ‘వ్యవహారపద’ మని చెప్పబడును. వాది చెప్పినదానినంతను రాజు సంవత్సరము, మాసము, పక్షము, దినము, పేరు, జాతి మొదలగు వాటితోసహ ప్రతివాది ఎదుట వ్రాయించవలెను. (వాది చేసిన నివేదనము నకు ‘భాష’, ‘ప్రతిజ్ఞ లేదా ‘పక్షము’ అని పేరు). ప్రతివాది వాది చెప్పినదంతయు విని దానికి ప్రత్యుత్తరము వాని ఎదుట వ్రాయించవలెను. వాది ఆ సమయమునందే తాను చేసిన నివేదనమునకు ప్రమాణము వ్రాయించవలెను. నివేదనము ప్రమాణితమైనచో వాది జయించును, కానిచో పరాజితుడగును. ఈ విధముగ వివాదమునందు నాలుగు పాదములు (అంశములు గల) వ్యవహారము చూపబడినది. అభియుక్తునిపై వచ్చి జరుగుచున్న అభియోగమునకు నిర్ణయము కానంతవరకును అతనిపై వచ్చిన మరియొక అపరాధమును గూర్చి విచారణ చేయగూడదు. ఇతరునిచే అభియుక్తుడగు వానిపై విరుద్ధముగ ఏమియు చెప్పరాదు. కాని హంసాధ్యపరాధ అభియోగమైనచో దానిని, ముందు నడచుచున్న అభియోగమునకు నిర్ణయము కాకపూర్వమే నడిపించవచ్చును.
సభాసద సమేతుడైన సభాపతి (ప్రాడ్వివాకుడు) వాది ప్రతివాదుల వివాదమును నిర్ణయించుటకు సమర్థులగు వారిని ప్రతిభూ’ (జామీను)గా ఏర్పరుపవలెను. అర్థి (వాది) చేసిన అభియోగమును ప్రతివాది తిరస్కరించగా, అర్థి సాక్ష్యాదులు చూపి తన అభియోగమును ప్రతివాదిచే అంగీకరింపచేయ గలిగినచో, ప్రతివాది అర్థికి ఇవ్వవలసిన ధనము అంతయు చెల్లించి, అంతే ధనమును, దండముగా రాజుకు చెల్లించవలెను. అర్థి తన అభియోగమును నిరూపించుకొనజాలక మిథ్యాభియోగియైనచో అతడు అభియుక్త ధనమునకు రెట్టింపు ధనము రాజుకు అర్పించవలెను. హత్య దోపిడి, వాక్పారుష్యము, దండపారుష్యము, పాలు ఇచ్చు ఆవులను అపహరించుట, అభిశాపము (మహాపాతకము చేసినట్లు అభియోగము), అత్యయము (ప్రాణఘాతము), ధనాతిపాతము, స్త్రీ చరిత్ర మొదలగు వాటికి సంబంధించిన అభియోగము వచ్చినప్పుడు అపరాధి నుండి వెంటనే ఉత్తరము (సముజాయిషీ) తీసుకొనవలెను. ఆలస్యము చేయరాదు. ఇతర వివాదములలో వాది ప్రతివాదులు, సభాసదులు, ప్రాడ్వివాకుడు మొదలగువారి ఇచ్ఛ ననుసరించి సమయము తీసికొనవచ్చును. అభియోగ సమయమున అభియోగము చేయువాడుగాని, సాక్ష్యమిచ్చువాడు గాని ఒకచోటునుండి మరియొకచోటునకు తిరుగుచుండినను, స్థిరముగా ఉండజాలకున్నను, రెండెచెలివెలు నాకుచున్నను, ఆతని నుదుటచెమట పట్టినను, ముఖము వెలవెలబోయినను, కంఠము ఎండిపోయి మాట తడబడినను, పూర్వాపర విరుద్ధముగ మాటలాడినను, ఇతరులకు సరిగా ప్రత్యుత్తర మీయజాలకున్నను, ఇతరుల చూపులో చూపు కలుపజాలకపోయినను, పెదవులు వంకరటింకర చేయుచున్నను. ఈవిధముగ సహజముగనే మనో, వాక్, శరీర క్రియలందు వికారము పొందినచో ఆతడు దుష్టుడని చెప్పబడినది. అప్పుతీసికొన్నవాడు నిరాకరించిన సందేహాస్పదమైన ఋణమునుగూర్చి ఏదోవిధముగ నిజమని నిరూపించుటకు ప్రయత్నించువాడును, రాజు పిలిపించినపుడు అతని యెదుట ఏమియు చెప్పజాలనివాడును దుష్టుడే. ఆతడుకూడ దండనీయుడు. ఇద్దరు వాదుల పక్షములందు సాక్ష్యము చెప్పువారు లభ్యులైనప్పుడు పూర్వవాది సాక్షులనే ప్రశ్నింపవలెను. వాదికి జవాబుగ ‘నేనీ క్షేత్రమును చాలకాలము క్రితమే దాన రూపమున పొందితిని. అప్పటినుండియు నేను దీనిని అనుభవించుచున్నాను’ అని చెప్పువాడు ఇచట పూర్వవాది; ముందుగా అభియోగము చేసినవాడు కాదు. అప్పుడు రెండవ వాడు ‘నిజమే, ఇది ఈతనికి దానము వలన లభించినది, కాని ఇతని నుండి అముక వ్యక్తి (ఫలానా వ్యక్తి) దీనిని కొని నాకిచ్చినాడు’ అని చెప్పినచో అపుడు పూర్వపక్షము అసాధ్యము గాన దుర్బలమై పోవును. అపుడు ఉత్తరవాది సాక్షులను మాత్రమే ప్రశ్నించ వలెను. వివాదము ఏదైన ఒక పందెముపై (షరతు) చేయబడినపుడు అట్లు పందెము వేసినవాడు ఓడిపోయినచో ఆతడు వేసిన పందెము సొమ్ము రాజుకు ఇచ్చివేయవలెను. అర్థి ధనవంతుడైనపుడు వివాదాస్పదమగు ధనము మాత్రమే అతనికి ఇప్పించవలెను. రాజు కపటము విడనాడి, సత్యము నాశ్రయించి వ్యవహార నిర్ణయము చేయవలెను. యథార్ధ వస్తువైనను లిఖిత పూర్వకముగ లేనిచో వ్యవహారమున పరాజయమే కలుగును. అర్థి, సువర్ణ, రజత, వస్త్రాది వస్తువులను అభియోగ పత్రమున వ్రాయగా ప్రత్యర్థి వాటినన్నింటిని అంగీకరించినచో, అట్టి పరిస్థితులలో సాక్ష్యాధారముపై ప్రత్యర్థి ఆ వస్తువులలో ఏ ఒక్క వస్తువును ఒప్పుకొన్నను, రాజు అభియోగపత్రమునందు వ్రాసిన వాటిని అన్నింటిని అర్థికి ప్రత్యర్థిచే ఇప్పించవలెను. మొదట అభియోగ పత్రమునందు వ్రాయబడని దానిని ఆ వస్తు సూచియందు చేర్చుట జరిగినచో ఆ వస్తువును ఇప్పించవలసిన పనిలేదు. రెండు స్మృతి వాక్యములలో గాని, ధర్మశాస్త్ర రచనములలో గాని, పరస్పర విరోధము కనబడినచో సామాన్యాపవాద న్యాయము ననుసరించి సామాన్య శాస్త్రము కంటె విశేషశాస్త్రము బలీయ మని నిర్ణయించవలెను. అర్థశాస్త్ర ధర్మములందు పరస్పర విరోధమేర్పడినపుడు అర్థ శాస్త్రము కంటె ధర్మశాస్త్రము బలీయమని మునులు చెప్పిన మర్యాద (కట్టుబాటు).
లిఖితము, భుక్తి, సాక్షి అనునవి మూడు మానుష ప్రమాణములు. ‘భుక్తి’ అనగా అనుభవించుట. ఈ మూడింటిలో ఏ ఒక్కటియు లభించనపుడు చెప్పబోవు దివ్య ప్రమాణములలో ఏదైన ఒకదానిని గ్రహించవలెను. ఋణము మొదలయిన సమస్త వివాదములందును ఉత్తరక్రియ బలవత్తరము. ఉత్తరక్రియ సిద్ధీకృతమైనపుడు విజయము ఉత్తరవాదికే. పూర్వవాది తన పక్షమును సిద్ధము చేసినను ఆతడు ఓడిపోవును కాని ఆధి (తాకట్టు) ప్రతిగ్రహ-క్రీతములందు పూర్వ క్రియబలీయము. భూస్వామి చూచుచుండ గనే ఒక వ్యక్తి ఆ భూమిని అనుభవించుచుండగా ఆతడేమియు అనకున్నచో ఇరువది సంవత్సరముల తరువాత ఆ భూమి అనుభవించువానికి చెందును. అది ధనమైనచో పది సంవత్సరములయిన తరువాత అనుభవించువానికి చెందును. కాని తాకట్టు, సరిహద్దు, నిక్షేపము, జడుల ధనము, బాలకుల ధనము, ఉపనిధి, రాజు, స్త్రీ, శ్రోత్రియుల ధనము, వీటి విషయమున పై నియమము వర్తించదు. పైన చెప్పినవారి సొత్తును చాలకాలము అనుభవించినంత మాత్రమున అపహరింప జూచువానిచే ఆ ధనమును స్వామికి ఇప్పించి, అంత ధనమును దండించి రాజు తీసికొనవలెను. లేదా ఆ విధముగ అపహరించినవాని శక్తినిబట్టి, అధికము గాని, అల్పముగాని ధనమును దండరూపమున తీసికొనవలెను. సత్వమునకు హేతువగు ప్రతిగ్రహ, క్రయాదులకు ఆగమమని పేరు. ఆగమము భోగము కంటె ప్రబలము. సత్వమును స్థాపించుటకు ఆగమ సాపేక్షమైన భోగమే ప్రమాణము. కాని పితృపితామహాది క్రమమున అనుభవింపబడుచున్నది తప్ప ఇతర భోగమునందే ఆగమనమునకు ప్రాబల్యము. పూర్వపరంపరా ప్రాప్తమగు భోగము ఆగమము కంటెను ప్రబలమైనది. ఏ మాత్రము ఉపభోగము లేని ఆగమమునకు బలములేదు.
విశుద్ధమైన ఆగమమును బట్టి భోగమునకు ప్రామాణ్యము వచ్చును. ఆగమము సరియైనది కానపుడు భోగము ప్రమాణము కాదు. భూమ్యాద్యాగమము కలవాడు, ‘నీకిది ఎట్లు వచ్చినది?’ అని ఎవరైన అడిగినపుడు లిఖితాది ప్రమాణములచే ఆగమమును నిరూపించుకొనవలెను. వాని పుత్ర పౌత్రాదులు ఆగమమును నిరూపించుకొనవలసిన పనిలేదు. పరంపరాగత భోగమే అచట ప్రమాణముగ గ్రహింపబడును. వ్యవహార నిర్ణయమునకు పూర్వమే ఒకడు మరణించినచో ఆతని ధనమునకు ఉత్తరాధికారులైన పుత్రాదులు లిఖితాది ప్రమాణముల ద్వారా ఆగమనమును నిరూపించు కొనవలెను. ఎందుచేతననగా ఆ వ్యవహారమునందు ఆగమము లేకుండ కేవలము భోగము ప్రమాణము కాజాలదు. బలాత్కార, భయాదులచే జరిపిన వ్యవహారమును త్రిప్పివేయవలెను. కేవలము స్త్రీయే చేసిన అభియోగమును, రాత్రియందు చేసిన దానిని, ఇంటి లోపల జరిగిన సంఘటనకు సంబంధించినదానిని, గ్రామాదుల వెలుపల నిర్జన ప్రదేశమునకు సంబంధించిన దానిని, శత్రువుచేసిన దాడిని న్యాయాలయము నందు విచారణార్థము గ్రహింపరాదు, త్రిప్పి వేయవలెను. మాదకద్రవ్య సేవనముచే మత్తులో నున్నవాడును, వాత, పిత్త, కఫ, సన్నిపాత గ్రహావేశాదులచే ఉన్మత్తుడును, రోగపీడితుడును, ఇష్టవియోగ, అనిష్ట ప్రాప్తులచే దుఃఖితుడును, అప్రాప్త వయస్కుడును, శత్రువులు మొదలగు వారి నుండి భయపడిన వాడును నడిపిన వ్యవహారము ‘అసిద్ధము’ అని చెప్పబడినది. అభియుక్త వస్తువుతో సంబంధము లేనివారు నడిపినది కూడ అసిద్ధము.
ధనవంతుని ధనము ఎంత పోయినచో అంత రాజు ఆతనికి ఈయవలెను. పోయిన ధనమును దాని స్వామి గుర్తింపజాలకపోయినచో, ఎంతధనము పోయినదని రాజుకు జెప్పెనో అంత ధనమును రాజునకు దండముగా ఇవ్వవలెను. చోరులు అపహరించిన ధనమును రాజు ఏ జనపదము నుండి అపహరించబడినదో ఆ జనపదమునకే ఇచ్చివేయవలెను. ఏదైన ఒక వస్తువును తాకట్టుపెట్టి తీసికొనిన ఋణముపై ఎనుబదవ భాగము (1/80) ప్రతి మాసము ఇవ్వవలెను. బంధకము (తాకట్టు) లేనిచో బ్రాహ్మణాది వర్ణ క్రమమున ప్రతిశతము కొంచెము కొంచెము అధికమగు వడ్డీ తీసికొనవచ్చును. ఆడపశువు లను ఋణముగా తీసికొనినపుడు వాటి పిల్లలు వడ్డీగా గ్రహించవలెను. నూనె, నెయ్యి మొదలగు రసద్రవ్యములు ఋణముగా తీసికొన్నప్పుడు, అది పెరిగి పెరిగి ఎనిమిది రెట్లు కావచ్చును. అంతకుమించి వృద్ధి ఉండకూడదు. వస్త్ర, ధాన్య, సువర్ణముల విషయమున వృద్ధి క్రమముగా నాలుగు, మూడు, రెండు రెట్లవరకు ఉండవచ్చును; అంతకంటె అధికము కాదు.
వ్యాపారముకొరకై దుర్గమవన ప్రదేశములు దాటి ప్రయాణము చేయువారు ఋణదాతకు నూటికి పది చొప్పునను, సముద్రయానము చేయువారు నూటికి ఇరువది చొప్పునను వృద్ధి ఇవ్వవలెను. లేదా అన్ని జాతులవారును, ఏ జాతివారి నుండి తీసుకున్న ఋణమైనను, అది సబంధకమైనను (తాకట్టు ఉన్నది) అబంధక మైనను, ఋణదాతకును తమకును మధ్య జరిగిన ఒప్పందమును బట్టి వడ్డీ ఇవ్వవలెను. ఋణము తీసికొన్నవాడు ఏ ధనమును తీసికొనెనో, అది సాక్షి ప్రమాణితమైనపుడు, దానిని ఋణదాత వసూలు చేసుకొనుచున్నప్పుడు రాజు అడ్డు పెట్టగూడదు. ఋణదాత న్యాయ సంగతముగ ఋణము వసూలు చేసికొనుచున్నను వానిపై అభియోగము చేయువానిని రాజు దండించవలెను. వానిచే ఆ ధనము ఇప్పించవలెను. (253)
