అగ్ని మహా పురాణము

Table of Contents

విష్ణు పంజర స్తోత్రము

పుష్కరుడు పలికెను:

పూర్వము త్రిపుర సంహారోద్యుక్తుడగు శివుని రక్షకై బ్రహ్మ విష్ణు పంజర స్తోత్రమును ఉపదేశించెను. బలాసురుని చంపుటకై వెళ్లుచున్న ఇంద్రునకు దానిని బృహస్పతి ఉపదేశించెను. విజయ ప్రదమగు దాని స్వరూపము చెప్పెదను వినుము. ‘నాకు తూర్పున చక్రధారియగు విష్ణువు, దక్షిణమున గదాధారియగు విష్ణువు, ఉత్తరమున ఖడ్గ ధారియగు విష్ణువు ప్రకాశించుచున్నాడు. విదిశలందు హృషీకేశుడు, వాటి మధ్యలందు జనార్దనుడు, భూమియందు, వరాహరూపధారియగు హరి, ఆకాశమున నరసింహుడు ఉండి నన్ను రక్షించుచున్నారు. చివర క్షురములు ఉన్న నిర్మలమగు ఈ సుదర్శన చక్రము తిరుగుచున్నది. ఇది ప్రేతను రాక్షసులను చంపుచు వెళ్లునపుడు దీని కిరణములవైపు ఎవ్వరును చూడజాలరు. సహస్రార్చులుగల ప్రజ్వలించుచున్న అగ్నితో సమానమైన ఈ గదరక్షో, భూత, పిశాచములను నశింప చేయును. వాసుదేవుని, శార్ఙ్గటంకారధ్వని నా శత్రువులను తిర్యక్, మనుష్య, కూష్మాండ, ప్రేతాదులను పూర్తిగా నశింపచేయుగాక! శ్రీ మహావిష్ణువు యొక్క ఖడ్గధార యొక్క, ఉజ్జ్వలమగు వెన్నెలలో స్నానము చేసిన నా శత్రువులు, గరుత్మంతునిచే సర్పముల వలె వెంటనే శమింతురుగాక!

‘కూష్మాండ, యక్ష, రాక్షస, ప్రేత, వినాయక, క్రూర మనుష్య, క్రూర పక్షి, సింహాదులును, సర్పాదులును, విష్ణువు యొక్క శంఖరవముచే కొట్టబడినవై సౌమ్యత్వమును పొందుగాక! నా చిత్త వృత్తిని స్మరణ శక్తిని అపహరించువారును, నా బలతేజస్సులు నశింపచేయువారును నా కాంతిని తగ్గించువారు, భోగములను హరించువారును, శుభ లక్షణములను నశింపచేయువారును అగు కూష్మాండులు విష్ణు చక్రహతులై నశింతురు గాక! దేవదేవుడైన వాసుదేవుని సంకీర్తనముచే నా మనోబుద్ధి, ఇంద్రియములకు స్వాస్థ్యము లభించుగాక! నా వెనుకను, ఎదుటను, ఎడమ ప్రక్కను కోణ దిశలందును అంతటను జనార్దనుడగు హరి ఉండుగాక! సర్వ పూజనీయుడును, ఎన్నటికిని చ్యుతుడు కానివాడును, అనంతరూపుడును, పరమేశ్వరుడును అగు జనార్ధనుని పాదములకు నమస్కరించువాడు ఎన్నడును దుఃఖితుడుకాడు. శ్రీహరి పరమాత్మయైనట్లే కేశవుడు జగత్స్వరూపుడుకూడ. ఈ సత్యము యొక్క ప్రభావముచేతను, అచ్యుతుని నామ సంకీర్తనము చేత, నా త్రివిధ పాపములు నశించుగాక!’ (270)