అగ్ని మహా పురాణము

Table of Contents

నరక నిరూపణము

అగ్నిదేవుడు పలికెను: యమరాజ మార్గములను గూర్చి చెప్పియుంటిని, మనుష్యల మరణములను గూర్చి చెప్పెదను. శరీరమున వాయువేగము అధికమైనపుడు పిత్తము ప్రకోపించి శరీరమును అవరుద్ధముచేసి సకల దోషములను ఆవరించి ప్రాణస్థానములను, మర్మస్థానములను భేదించును. శైత్యముచే వాయువు ప్రకోపించి బయటకు పోవుటకు రంధ్రములను అన్వేషించుట ప్రారంభించును. శరీరముపై భాగమున రెండునేత్రములు, రెండు కర్ణములు, రెండు నాసాపుటములు, ముఖము అను ఎనిమిది రంధ్రములున్నవి. సాధారణముగా పుణ్యాత్ముల ప్రాణము వీటి ద్వారా బయటకుపోవును. పాపాత్ముల ప్రాణము క్రిందనున్న పాయూప స్థల ద్వారాపోవును. యోగుల ప్రాణము బ్రహ్మ రంధ్రమును భేదించి బయటకు పోవును. ఆ జీవుడు ఇచ్చానుసారముగ వెడలిపోవును. అంతకాలము వచ్చినప్పుడు ప్రాణము అపానములో కలిసిపోవును. తమస్సుచే ఆవృత్తుడై పోవును. మర్మ స్థానములు ఆచ్ఛాదితములగును. అప్పుడు జీవుడు వాయువుచే బాధితుడై నాభిస్థానమునుండి చలించును. అష్టాంగములుకల ప్రాణ వృత్తులను తీసుకొని శరీరము నుండి బయటకు వచ్చును. దేహము నుండి బయటకు వచ్చుట మరియొక జన్మ గ్రహించుట. వివిధ యోనులందు ప్రవేశించుట మొదలగు సమయములలో ఆ జీవుని సిద్ధ పురుషులును దేవతలును దివ్య దృష్టితో చూడగలుగుదురు. మరణ సమయము అనంతరమే జీవుడు అతివాహిక శరీరమును గ్రహించును. అతడు త్యజించిన శరీరమున నుండు ఆకాశ, వాయు, తేజస్సులు పైనున్న మూడు తత్త్వములలో కలసిపోవును. జలము పృథివి అంశములు క్రింది తత్త్వములలో కలసి పోవును. పురుషుడు పంచత్వమును పొందుట అనగా ఇదియే. యమదూతలు వానిని అతివాహిక శరీరములోనికి ప్రవేశపెట్టుదురు. యమలోకమార్గము చాల భయంకరము. ఎనభై ఆరువేల యోజనముల దూరము. ఆ మార్గమున ప్రయాణించు జీవుడు తన బంధువులిచ్చిన అన్నోదకములను అనుభవించును. యమునిచూచి ఆతని ఆజ్ఞ ప్రకారము చిత్ర గుప్తుడు చెప్పిన భయంకరములగు నరకములను పొందును. ధర్మాత్ముడు అయినచో స్వర్గమునకు పోవును.

పాపాత్ములు అనుభవించు నరకములను, బాధలను చెప్పెదను. భూమి క్రింద ఇరువది ఎనిమిది నరక శ్రేణులు వున్నవి. అవి సప్తమ తలము క్రింద ఘోరాంధకారమున నున్నవి. వీటికి వరుసగా ఘోరా, సుఘోరా, అతి ఘోరా, మహాఘోరా, ఘోర రూపా, తరలతారా-భయానకా-భయోత్కటా, కాలరాత్రీ, మహాచండా, చండా, కోలాహలా, ప్రచండా, పద్మా, నరక నాయికా, పద్మావతీ, భూషణా, భీమా కరాలికా, మహావజ్రా, త్రికోణా, పంచకోణికా, సుదీర్ఘా, వర్తులా, సప్త భూమా, సుభూమికా, దీప్త మాయాయని పేర్లు. ఈ ఇరువది ఎనిమిది శ్రేణులును పాపాత్ములకు దుఃఖములను ఇచ్చును. వీటిలో ఒక్కొక్క దానియందు ఐదేసి చొప్పున ప్రధాన స్థానములు ఉండును. వాటికి రౌరవాది నామములు. వీటి మొత్తము సంఖ్య నూటనలుబది ఐదు. తామిస్ర అంధతామిస్ర మహా రౌరవ రౌరవ-అసిపత్రవన, లోహభార, కాలసూత్ర మహానరక, సంజీవన, మహావీచి, తపన, సంప్రతాపన, సంఘాత, కాకోల, కుడ్మల, పూతివృత్తిక, లోహశంకు, ఋజీష, ప్రధాన శాల్మలీవృక్ష, వైతరణీనది మొదలైన వాటిని అన్ని నరకములందును కోటి నాయకులుగా తెలుసుకొనవలెను. ఇవి చాల భయంకరములు. పాపాత్ములను వీటిలో ఒక్కొక్క దాని యందు లేదా అనేకములందు పడవేయవచ్చును. యమదూతల ముఖములు మార్జార, ఉలూక, గోమాయు, గృధ్రాదుల ముఖములవలె ఉండును. నూనె తొట్టిలో మనుష్యుని పడవేసి అగ్నిని రగిల్చెదరు. కొంత మందిని బొగ్గులమీదను, కొంతమందిని తామ్ర పాత్రమునందును, మంగలములందును, లోహపాత్ర లందును పడవేయుదురు. కొందరిని శూలముపై గుచ్చుదురు. కొందరిని నరకములో పడవేసి ఛేదించుదురు. కొందరిని కొరడాలతో కొట్టుదురు. కొందరిచే కాలిన అయో గోళములను మ్రింగింప చేయుదురు. చాలమంది యమదూతలు కలసి వారిచే ధూళి, మలము, రక్తము, కఫము మొదలైన వాటిని తినిపించుచు, కాచిన మద్యమును త్రాగింతురు. కొందరిని రంపముతో కోయు దురు. కొందరిని గానుగలో వేసి త్రిప్పుదురు. కొందరిని కాకులు మొదలగునవి పొడిచి పొడిచి కొందరిపై ఉష్ణతైలము చల్లబడును. కొందరి శిరస్సులు ఛేదింపబడును. ఆ సమయమున జీవులు ఏడ్చుచు తమపాపకర్మను నిందింతురు. ఈ విధముగా పాపాత్ములు తమ పాపములకు ఫలముగ నరకబాధలను అనుభవించి మరల మర్త్యలోకమున జన్మింతురు.

బ్రహ్మహత్య చేసినవాడు లేడి, కుక్క, పంది, ఒంటెయై పుట్టును. మద్యము త్రాగినవాడు చండాల, మ్లేచ్ఛ జన్మ పొందును. సువర్ణము అపహరించినవాడు పురుగుగాను, మిడతగాను పుట్టును. గురు తల్పగుడు తృణముగాను, గుల్మముగాను పుట్టును. బ్రహ్మహత్య చేసినవాడు క్షయ రోగియగును. సురాపానము చేసిన వాని దంతములు నల్లగా ఉండును. సువర్ణస్తేయము చేసినవాని నఖములు చెడిపోవును. గురుపత్నీ గమనము చేసిన వాని చర్మము దూషితమగును. ఏ పాపము చేసెనో ఆ పాపము యొక్క చిహ్నములతో పుట్టును. అన్నము అపహరించినవాడు మాయావి అగును. వాణిని అపహరించినవాడు మూగవాడు అగును. ధాన్యము అపహరించినవానికి ఏదో ఒక అంగము అధికముగ ఉండును. చాడీలు చెప్పిన వాని ముక్కు నుండి దుర్గంధము వచ్చును. తైలము అపహరించినవాడు గబ్బిలము అగును. ఒకరిపై ఒకరికి చెప్పువాడు దుర్గంధ ముఖము కలవాడగును. పరస్త్రీలను, బ్రాహ్మణ ధనమును అపహరించినవాడు నిర్జన వనమున బ్రహ్మరాక్షసుడై పుట్టును. రత్నములు హరించినవాడు నీచ జాతిలో పుట్టును. గంధ ద్రవ్యములు హరించినవాడు చుంచువై పుట్టును. పత్రశాకములను అపహరించిన వాడు కోడిగాను, ధాన్యమును అపహరించినవాడు ఎలుక గాను, పశువులను హరించినవాడు మేకగాను, పాలు హరించినవాడు కాకిగాను, వాహనము హరించినవాడు ఒంటెగాను, ఫలములు హరించిన వాడు కోతిగాను, తేనె హరించినవాడు ఈగగాను, ఫలములు హరించినవాడు గృధ్రముగాను, ఇంటిలోని సామాను అపహరించిన వాడు గృహకాకము గాను పుట్టును, వస్త్రములు హరించినవాడు బొల్లి కలవాడు గాను, రసమును అపహరించినవాడును, ఉప్పును అపహరించినవాడును ఈగగా జన్మించును. ఇది ఆధ్యాత్మిక తాప వర్ణనము. శస్త్రాదులచే కలిగిన తాపము ఆధీ భౌతికము. గృహ అగ్ని దేవతాదుల వలన కలిగినది ఆధి భౌతికము. గృహ అగ్ని దేవతాదుల వలన కలిగినది. ఆది దైవికము. ఈ త్రివిధ తాపములతో కూడిన సంసారమును మానవుడు జ్ఞానయోగమును కఠిన వ్రతములను, దానాదులను, విష్ణు పూజాదులనుచేసి దాటవలెను. (371)