అగ్ని మహా పురాణము

Table of Contents

అశ్వ శాంతి కథనము

శాలిహోత్రుడు చెప్పెను:

ఓ సుశ్రుతా! ఇపుడు అశ్వరోగములను తొలగించునదియు నిత్యనైమిత్తిక కామ్య రూపమున మూడు విధములైనదియగు అశ్వశాంతిని చెప్పెదను వినుము. శుభ దివసమున విష్ణువునకును లక్ష్మికిని ఉచ్చైశ్రవ పుత్రుడగు హయరాజునకును పూజచేసి సావిత్రి మంత్రములతో ఘృత హోమముచేసి బ్రాహ్మణులకు దక్షిణ ఇచ్చినచో అశ్వ వృద్ధి కలుగును. ఆశ్వీయుజ శుక్ల పౌర్ణమి దివసమున నగరబహిః ప్రదేశమున శాంతికర్మ చేయవలయును. విశేషించి అశ్వినీ వరుణ పూజ చేయవలయును. పిదప దేవీచిత్రము గీసి నాల్గు వైపుల నుండియు వృక్ష శాఖలతో కప్పి సమస్త రసపూరితములగు వస్త్ర సహితములయిన కలశలను స్థాపించవలెను. పిదప శ్రీదేవిని పూజించి యవాజ్య హోమము చేయవలెను. ఇపుడు నైమిత్తిక శాంతిని వినుము. మకర సంక్రాంత్యాదుల యందు అశ్వములను పూజించవలయును. విష్ణులక్ష్మి బ్రహ్మ శివ చంద్రసూర్య రేవంత ఉచ్చైశ్రవస్సులను పద్మములతో పూజించవలెను. కమల దళములపై దిక్పాలులను పూజించవలెను. పూజింపదగిన ఒక్కొక్క దేవత కొరకు వేదికపై జలపూర్ణ కలశలు స్థాపించవలెను. ఈ దేవతల ఉత్తరమున తిల, అక్షత, ఆజ్య, సిద్ధార్థములను హోమము చేయవలయును. ఒక్కొక్క దేవతకు నూరు హోమములు చొప్పున చేయవలయును. అశ్వశాంతి నివారణమునకు ఉపవాస పూర్వకముగ శాంతి కర్మ చేయవలయును. (290)