అగ్ని మహా పురాణము

Table of Contents

ప్రయాగ మాహాత్మ్యము

వసిష్ఠా ఇపుడు ప్రయాగ మాహాత్మ్యమును గూర్చి చెప్పెదను. ఇది భుక్తి ముక్తి ప్రదమైనది. అత్యుత్తమము. బ్రహ్మ విష్ణ్వాది దేవతలును, గొప్ప మునీశ్వరులును ప్రయాగలో నివసింతురు. నదులు, సముద్రము, సిద్ధులు, గంధర్వులు, అప్సరసలు కూడ ఈ తీర్థము నందు నివసింతురు. ప్రయాగలో మూడు అగ్ని కుండములున్నవి. గంగ సకల తీర్థములను వెంటగైకొని ఈ కుండముల మధ్యనుండి మహావేగముతో ప్రవహించుచున్నది.

త్రిభువన విఖ్యాతము, సూర్యపుత్రియగు యమునకూడ అచట నున్నది. గంగాయమునల మధ్య భాగము పృథివీజఘన మనియు, ప్రయాగ జఘన మధ్యభాగము నందలి ఉపస్థ అనియు ఋషులు చెప్పుదురు. ప్రతిష్ఠాన సహితమగు ప్రయాగ, కంబలము, అశ్వతరము, నాగము, భోగవతీతీర్థము ఇది బ్రహ్మ యజ్ఞవేది అని చెప్పబడుచున్నది. వేదములును, యజ్ఞములును ప్రయాగలో మూర్తిధరించి (ఆకారము వహించి) నివసించును. ఆ తీర్థమును స్తుతించుటచేతను, నామ సంకీర్తనము చేయుటచేతను, అచటి మట్టిని స్పృశించినంత మాత్రముచేతను మనుష్యుడు సకల పాప విముక్తుడగును. ప్రయాగలో గంగా యమునా సంగమమునందు చేసిన దాన, శ్రాద్ధ, జపాదులు అక్షయములగును. వసిష్ఠా! వేదము చెప్పినను, లోకము చెప్పినను గూడ అంతమునందు ప్రయాగములో ప్రాణములు విడువ వలెననెడు ఆలోచనను విడువరాదు. అరువది కోట్ల పదివేల తీర్థములు ప్రయాగలో ఉండును.

అందుచే అది అన్నింటికంటెను శ్రేష్ఠమైనది. వాసుకి స్థానమైన భోగవతీ తీర్థము, హంస ప్రపతనము ఉత్తమ తీర్థములు. వీటియందు మూడు దినములు స్నానము చేయుటచే కోటి గోదానములు చేసిన ఫలము లభించును. ‘గంగ అనేక స్థానములందు లభించవచ్చును. కాని మాఘ మాసమునందు, గంగా ద్వారమునందును, ప్రయాగ యందును, గంగా సాగర సంగమమునందును గంగ లభించుట చాలకష్టము’ అని పండితు లందురు. ప్రయాగలో దానము చేసినవాడు స్వర్గమునకు వెళ్ళి తిరిగి భూలోకమునకు వచ్చిన పిదప రాజాధి రాజగును. అక్షయవటమూల సమీపమునను, సంగమాదులందును మరణించిన వాడు విష్ణు లోకమును పొందును. ప్రయాగలో అతిసుందరమగు ఊర్వశీ పులినము, సంధ్యావటము, కోటి తీర్థము, దశాశ్వమేధ ఘట్టము, గంగాయమునా సంగమము, రజోహీనమగు మానస తీర్థము, వాసరక తీర్థము-ఇవి చాల ఉత్తమమైనవి. (111)