అగ్ని మహా పురాణము

Table of Contents

కావ్యగుణ వివేక వర్ణనము

అగ్నిదేవుడు పలికెను:

గుణరహితమగు కావ్యము అలంకార సహితమైనను, ప్రీతి జనకము కాదు. లలితము కాని స్త్రీ శరీరముపై హారము బరువు చేటు. దోషాభావమే గుణము కదా! గుణములను ఇక చెప్పుట ఎందుకు అని అనకూడదు. ఏలనస! శ్లేషాది గుణములు, గూఢార్థత్వాది దోషములు వేర్వేరుగా చెప్పబడినవి. కావ్యమునందు శోభతిశయమును కల్గించునవి గుణములు. సామాన్యములు వైశేషికములు అని ఇవి రెండు విధములు. సర్వ సాధారణములు, సామాన్యములు. ఇవి శబ్ద అర్ధ-శబ్దార్ధములతో సంబంధించి మూడు విధములగును. కావ్య శరీరమగు శబ్దమును ఆశ్రయించినది శబ్దగుణము. శ్లేష లాలిత్యము. గాంభీర్యము, సౌకుమార్యము. ఉదారతా ఓజస్సు, యౌగికీ అని శబ్ద గుణములు ఏడు విధములు, శబ్దముల చిక్కదనము శ్లేష. గుణ వృద్ధ్యాదులద్వార అక్షరము లకు సంధిలేనిచో అది లాలిత్య గుణము. ఉత్తమ భావవ్యంజకములగు శబ్ద సమూహము. విశిష్ట లక్షణ యుక్తమైనచో అది గాంభీర్యము. దానికే శబ్దత అని పేరు. నిష్ఠురాక్షరములులేని శబ్దములు అధికముగ ఉన్నచో అది సౌకుమార్యము. శ్లాఘ్య విశేషణములతో కూడిన ఉత్కృష్టపదముల ప్రయోగము ఔదార్యము. దీనికే ఉత్తానపదత అని పేరు. సమాస బాహుళ్యము ఓజస్సు; ఇది పద్యాదులకు జీవితము. బ్రహ్మ మొదలు స్తంభము వరకు ఉన్న జీవుల పౌరుషమును ఓజోగుణ విశిష్ట శబ్దములతోడనే వర్ణింపవీలగును. ఏ శబ్దములైనను ప్రయోగించి వర్ణింపబడు వస్తువుల ఉత్కర్షను సూచించునది అర్ధగుణము. మాధుర్యము సంవిధానము, కోమలత్వము, ఉదారత, ప్రౌఢి, సామైకతా, అని అర్థ గుణములు ఆరు. క్రోధ ఈర్షాదులందు కూడ ఆకార గాంభీర్యము ధైర్యము ఉండుట మాధుర్యము. కార్యసిద్ధికై ప్రయత్నము సంవిధానము. కాఠిన్యాది దోషవర్జితమగు మృదు సన్నివేశము కోమలత, ఔదార్యమును సూచించుచు ఆశయమును అతి సుందరముగ ప్రకటించినచో అది ఉదారత. అభీష్టమగు విషయమును గూర్చి తన్నిర్వాహమును సమర్థించు హేతుగర్భ యుక్తులకు ప్రౌఢి అని పేరు. స్వతంత్రము గాని పరతంత్రము గాని అగు కార్యము యొక్క బాహ్యాంతర సంయోగముచే కలుగు అర్థ వ్యుత్పత్తికి సామ్యైకత అని పేరు.

శబ్దార్థములు రెండింటికిని ఉపకారకముగా ఉండునది ఉభయ గుణము. ప్రసాదము, సౌభాగ్యము, యథాసంఖ్యము, ప్రశస్తత, పాకము, రాగము అని ఆరు విధములు. ప్రసిద్ధార్థములగు పదముల ప్రయోగము ప్రసాదము; దేనిని వర్ణించగ ఉత్కర్ష సూచితమగునో అట్టి వర్ణనము సౌభాగ్యము; దీనికే ఉదారత్వమని పేరు. తుల్యవస్తువులను క్రమముగ చెప్పుట యథా సంఖ్యము; వర్ణనీయమగు దారుణవస్తువును సమయాను సారముగ అదారుణ శబ్దములచే వర్ణించుట ప్రాశస్త్యము. పదార్థముయొక్క ఉన్నత పరిణితి పాకము, మృద్వికాపాకము నారికేలాంబుపాకము అని అవి రెండు విధములు. ఆది నుండి అంతమువరకు రసభరితమైనది మృద్వికాపాకము; కావ్యము నందలి ఛాయ విశేషమునకు రాగమని పేరు. అభ్యాస వశముచే ఇవి సహజ కాంతిని కూడ అతిశయించి ఉండును. ఒకానొక విశేష లక్షణముచే అనుభవమునకు వచ్చు దానిని వైశేషిక గుణమందురు. హరిద్రారాగము కౌసుంబరాగము నీలిరాగము అని రాగము మూడు విధములు. స్వలక్షణ గోచరమైనది. అనగా అనన్య సాధారణమైన ధర్మము వైశేషికము. (346)