అగ్ని మహా పురాణము

Table of Contents

అగ్ని పురాణము-మహాత్మ్యము

ఇది సమస్త భారతీయ విజ్ఞాన సర్వస్వం అని చెప్పవచ్చు. జన సామాన్యానికి ఆయా కావ్య, శాస్త్ర విషయాలలోని సారాన్ని సుగమం చేసి వారిని పురాణ ధర్మ బద్దులుగా చేయటమే ఈ పురాణపు ముఖ్యోద్దేశ్యమనిపిస్తుంది. ఈ పురాణంలో పురాణ లక్షణాలకు సంబంధంలేని శిక్ష, నిరుక్తం, ఛందస్సు, వ్యాకరణం, జ్యోతిషం, గాంధర్వము, శిల్పము, వాస్తువు భారత, రామాయణ కథా సంగ్రహం మొదలైన అనేక విషయాలు వివరింపబడ్డాయి. పురాణంలో మూడు వంతులకు పైగా ఇలాంటి విషయ వివరణతోనే సరిపోయింది. శ్రీమహావిష్ణువు దశ అవతారాలను గుఱించి చెప్పేటప్పుడు రామాయణ, భారత గాథలు సంపూర్ణంగా విస్తృతంగా వివరించబడ్డాయి. దేవాలయ నిర్మాణానికి సంబంధించిన వాస్తువును గుఱించి తెలిపేటప్పుడు విగ్రహ ప్రతిష్ఠ, పూజా విధానం మొదలైన దేవాలయాలకు సంబంధించిన సమస్త విషయాలు వివరించబడ్డాయి. ఈ పురాణంలో జ్యోతిష, ధర్మశాస్త్ర, ఆయుర్వేద, గజవైద్య, పశువైద్య, రాజనీతి, రత్నపరీక్ష మొదలైన శాస్త్రాలను గుఱించిన దీర్ఘవివరణ ఇవ్వబడింది. ఇందులో చెప్పబడిన యోగశాస్త్ర విషయాలైన యమ నియమాది ఎనిమిది యోగ విశేషాల వివరణ ప్రామాణికంగానే చెప్పబడింది. అద్వైత వేదాంతసారం ఇందులో హృద్యంగా వర్ణింపబడింది. ఒక అధ్యాయంలో భగవద్గీతా సారం ఉన్నది.

అందువలననే ఈ పురాణం తనను గుఱించి ఒకానొక సందర్భంలో తాను విష్ణు స్వరూపమునని చెప్పుకొన్నది. ఇంకా

వేదేషు సపురాణేషు యజ్ఞమూర్తిశ్చ గీయతే

ఆగ్నేయాఖ్యం పురాణంతు రూపం విష్ణోర్మహత్తరం

ఆగ్యేయాఖ్య పురాణస్య కర్తా శ్రోతాజనార్దనః

తస్మాత్ పురాణమాగ్నేయం సర్వవేద మయం మహత్

సర్వవిద్యామయం పుణ్యం సర్వజ్ఞాన మయం వరమ్ (అగ్ని ఽ7ఽ-16-ఽ8)

అని దీనికి కర్త శ్రోత జనార్దనుడేనని, ఇది విష్ణు రూపమైన పురాణమని ఇది సర్వ విద్యల మయమైనదని చెప్పుకొన్నది. ఈ పురాణము తనను తాను మహా పురాణాలలో ఒకటిగా చెప్పుకొన్నది. ఇందులో ఉన్న విషయ క్రమాన్ని బట్టి కూడా ఇది నిశ్చితమే. 

దీని యందు వర్ణ్యవిషయం కేవలం పురాణ పంచ లక్షణాలకే పరిమితంగాక సమస్త విజ్ఞానాన్నీ క్రోడీకరించి రాశిపోసింది. కాబట్టే అగ్నిపురాణం ‘విద్యా సారం పురాణం యత్ సర్వం సర్వస్య కారణమ్’ అని చెప్పుకొన్నది.