అగ్ని మహా పురాణము

Table of Contents

శాలగ్రామ పూజా కథనము

హయగ్రీవుడు చెప్పెను: ఇపుడు చక్రాంకిత సాలగ్రామముల పూజావిధానమును చెప్పుచున్నాను. ఇది సిద్ధిప్రదమైనది. శ్రీహరి పూజ కామ్య, అకామ్య, కామ్యాకామ్య అని మూడు విధములు. మత్స్యాది పంచ విగ్రహముల పూజ కామ్యముగాని, ఉభయాత్మిక గాని కావచ్చును, వెనుక చెప్పిన చక్రములతో ప్రకాశించు వారాహ, వామన, నృసింహుల పూజను ముక్తి కొరకు చేయవలెను, ఇపుడు మూడు విధములైన సాలగ్రామ పూజను గూర్చి వినుము. వీటిలో నిష్ఫల పూజ ఉత్తమము; సఫలపూజ కనిష్ఠము; మూర్తి పూజ మధ్యమము. చతురస్ర మండపముపైనున్న కమలమునందు కర్తను, హర్తను పూజింపవలెను. ఈశాన్యమున విష్వక్సేనుని, ఆగ్నేయమున క్షేత్రపాలుని పూజింపవలెను. పిమ్మట పూర్వాది దిక్కులందు ఋగ్వేదాది వేదచతుష్టయమును పూజించి, ఆధార శక్తిని, అనంతుని, పృథివిని, యోగపీఠమును పద్మమును, సూర్యమండలమును, చంద్రమండలమును, బ్రహ్మాత్మక వహ్ని మండలమును పూజించి, ద్వాద శాక్షరిచే ఆసనముపై శిలాస్తాపనముచేసి పూజింపవలెను. పిదప మూలమంత్రమును విభజించియు, సంపూర్ణ మంత్రముచేతను క్రమ పూర్వకముగా పూజింపవలెను. పిదప ప్రణవముచే పూజించి మూడుముద్రలు చూపవలెను. విష్వక్సేన, చక్ర, క్షేత్రపాలుల ముద్రలు చూపవలెను.

ఇంతవరకును చెప్పినది సాలగ్రామ మధ్యమపూజ. ఇపుడు నిష్ఫల పూజ చెప్పబడుచున్నది. వెనుకటి వలెనే షోడశదళ కమలముతో కూడిన మండలము చేయవలెను. దానిపై శంఖ, చక్ర, గదా, ఖడ్గములను, గురువు మొదలగువారిని వెనుక చెప్పినట్లుగనే పూజింపవలెను. పూర్వోత్తర దిశలయందు వరుసగా ధనుర్భాణములను పూజింపవలెను. ప్రణవముచే ఆసనము సమర్పించి, ద్వాదశాక్షరిచే శిలాన్యాసము చేయవలెను. ఇపుడు మూడవదైన కనిష్ఠ పూజను(సఫల పూజను) చెప్పుచున్నాను వినుము. అష్టదళ కమలముపై వెనుకటివలె గుర్వాదిపూజ చేయవలెను. పిదప అష్టాక్షరమంత్రముచే ఆసనము సమర్పించి, ఆ మంత్రముచేతను శిలను స్థాపించవలెను. (47)