అగ్ని మహా పురాణము
బాలగ్రహహర బాలతంత్రము
అగ్నిదేవుడు చెప్పెను:
బాలాది గ్రహములను తొలగించు బాలతంత్రమును చెప్పెదను. పుట్టిన దినమున శిశువును పాపినియను గ్రహి ఆవేశించును. దానిచే శిశువు శరీరమున ఉద్వేగము కలుగును. పాలు త్రాగక మెడ ఇటు అటు త్రిప్పుచుండును. ఇది పాపినీ గ్రహచేష్ట, దీనిని నివారించుటకు పాపిని గ్రహికిని మాతృకలకును మత్స్య, మాంస, సుర, భక్ష్య గంధమాలా, ధూప దీపములతో బలి ఇవ్వవలెను. ఆ శిశువు శరీరమున, ధాతకీ లోధ్ర, మంజిష్ఠా తాల చందనముల లేపనముచేసి గుగ్గులు, ధూపము వేయవలయును. రెండవ రోజున భీషణి అనుగ్రహి ఆవేశించును. కాస నిశ్వాసములు మాటి మాటికి గాత్ర సంకోచము ఇవి దానివలన కలుగు చేష్టలు. అట్టి శిశువుకు అజా మూత్రము పోసి కృష్ణ, అపామార్గ చందనములతో అరగదీసిన పిప్పలి లేపము చేయవలయును. గో శృంగ, దంత, కేశములతో ధూపమువేసి వెనుకటివలెనే బలి ఇవ్వవలయును. మూడవ రోజు ఆక్రమించు గ్రహిపేరు ‘ఘంటాలి’ మాటిమాటికి ఏడ్చుట ఆవులింత అరచుట భయము గాత్రోద్వేగము అరుచి ఇవి దాని వలన కలుగు చేష్టలు. అట్టి శిశువునకు కేసరము రసాంజనము గోదంతము హస్తిదంతము వీటిని మేకపాలలో నూరి శరీరమునకు పూయవలయును. నఖరాజీ బిల్వపత్రములలో ధూపమువేసి వెనుకటివలెనే బలి యివ్వవలయును. నాల్గవ దినమున గ్రహికాకోలి. ఇది ఆవహించిన శిశువు గాత్రో ద్వేగముతో ఎక్కువగా ఏడ్చును. నురుగు కక్కును. దిక్కులవైపు చూచును. దీని శాంతి కొరకై కుల్మాష మద్యములతో బలియిచ్చి గజదంత సర్పత్వక్ అశ్వమూత్రములను శరీరమునకు పూసి రాజీనింబ పత్రములతో గొట్టే వెంట్రుకలతో ధూపము వేయవలయును. ఐదవ గ్రహియగు హంసాదిక ఆవులింతలను ఎగుడు శ్వాసలను, ముష్టి బంధనమును కలిగించును. వెనుకటి వలెనే బలి యివ్వవలయును. శిశు శరీరమునకు మేష శృంగ బలాలోధ్ర శీలా తాలములు పూయ వలయును. ఆరవ గ్రహిపట్కారి. భయమును మోహమును అధిక రోదనమును కల్గించును. శిశువు ఆహారము తినక అవయవములను ఎక్కువగా కదల్చును. వెనుకటివలె బలి ఇవ్వవలయును. రాజీ, గుగ్గులు, కుష్ట గజ దంతాడులతో ధూపన లేపనాదులు చేయవలయును. ఏడవ రోజున గ్రహిముక్త కేశి, దానిచే ఆక్రమించబడిన శిశువు దుఃఖాతురుడగును. శరీరము నుండి దుర్వాసన వచ్చును. ఆవులింత, అధికమగును. రోదనము కాసము కలుగును. వానికి వ్యాఘ్రనఖములతో ధూపము వేసి శరీరమునకు గోమయ గోమాత్రములు లేపనము చేయవలయును. ఎనిమిదవ దినమున గ్రహి శ్రీదండి, ఈ గ్రహి ఆవేశించిన శిశువు దిక్కులు చూచును. నాలుక కదల్చును. దగ్గును. రోదనము చేయును. పూర్వోక్తమగు బలిని ఇవ్వవలయును. హింగులావచా, సిద్ధార్థ లశునములతో ధూప అనులేపములు చేయవలయును. తొమ్మిదవది ఊర్ధ్వ గ్రహియను మహాగ్రహి. ఇది ఆవేశించిన శిశువు ఉద్వేగముతో ఊర్ధ్వ నిశ్వాసములతో తనరెండు పిడికిళ్లను నమలును. వానికి రక్తచందన కుష్టాదులతో ధూపలేపనములు చేయవలయును. కపి రోమ నఖములతో ధూపము వేయవలయును. పదవ దివసమున రోదని అను గ్రహి ఆవేశించును. అపుడు శిశువు ఎక్కువ రోదనము చేయును. శరీరము నీలవర్ణమై సుగంధ యుక్తమగును. అట్టి శిశువునకు వేపాకుతో ధూపము, ఉగ్రరాజి సర్జరముల లేపము చేయవలయును. లాజకుల్మాష, ఓదనములతో దానికి బలి ఇవ్వవలెను. ఈ విధముగ పదమూడు రోజుల వరకు ధూపాదిక క్రియ జరుపవలయును.
ఒక మాసము వయస్సుగల శిశువును పూతన అను గ్రహి ఆవహించును. ఇది ఆవహించిన శిశువు కాకివలె అరచుచు, ఏడ్చును. పొడవుగా శ్వాసపీల్చుచు మాటి మాటికి కండ్లు మూయును. వాసన మూత్ర గంధమువలె ఉండును. అట్టి శిశువునకు గోమూత్రముచే స్నానము చేయించి, గోదంతము ధూపము వేయవలయును. ఆ పూతన కొరకై గ్రామమునకు దక్షిణమున కరంజ వృక్షము క్రింద ఒక సప్తాహము వరకు పీత వస్త్ర రక్త మాల్యమద్య తిల చతుర్విధమాంస గంధ దీప త్రివిధ పాయసములతో బలి ఇవ్వవలెను. రెండు మాసముల శిశువును ముకట అను గ్రహి ఆవహించును. ఆ శిశువు శరీరము పచ్చబడిపోయి చల్లబడును. జలుబుచేసి ముక్కు నుండి నీరు వచ్చును. ముఖము ఎండిపోవును. ఈ గ్రహికొరకై పుష్పగంధ, వస్త్ర అపూప, ఓదన, దీపములతో బలి యివ్వవలెను. కృష్ణాగరు మొదలగు వాటితో ధూపము వేయవలయును. మూడవ మాసమున గోముఖి ఆవహించును. ఆశిశువు ఎక్కువ నిద్రపోవును. మాటిమాటికి మల మూత్రములు విడుచుచు గట్టిగా ఏడ్చును. ఆ గ్రహికొరకు ముందుగా తూర్పున యవ, ప్రియంగు, కుల్మాష, శాక, అన్న దుగ్ధముతో బలియిచ్చి పిదప శిశువుకు మధ్యాహ్నమున పంచ భంగముతో స్నానము చేయించి నేతితో ధూపము వేయవలయును. నాలవ మాసమున పింగళ అను గ్రహి ఆవహించును. అపుడు ఆశీశువు శరీరము తెల్లనై దుర్గంధయుక్తమై ఎండిపోవ ప్రారంభించును. అట్టి శీశువు తప్పక మరణించును. ఐదవ మాసమున లలన అనుగ్రహిచే ఆవహింపబడిన శిశువు శరీరము శిథిలమై పోవును. ముఖము ఎండిపోవును. దేహము పాలిపోయి అపాన వాయు వెడలుచుండును. లలనా శాంతికి దక్షిణ దిక్కునందు వెనుక చెప్పిన విధముగ బలి ఇవ్వవలెను. ఆరవ మాసమున పంకజ అను గ్రహి ఆవహించును. దీనిచే రోదనము వికృతస్వరము మొదలగునవి కలుగును. ఈ గ్రహికొరకు వెనుక చెప్పిన పదార్థములు అన్న పుష్ప గంధాదులు బలి ఇవ్వవలయును. ఏడవ మాసమున నిరాహారముగా ఉండును. అందుయను గ్రహి ఆవహించగా, దుర్గంధ దంత రోగాదులు కలుగును. నిరాహార కొరకై మిష్టాన్నము వెనుక చెప్పిన పదార్థములు బలి యివ్వవలయును. ఎనిమిదవ మాసమున యమునయను గ్రహి ఆవహించగా శిశువు శరీరముపై దద్దురులు బయలుదేరి శరీరము ఎండిపోవును. దీనికొరకై చికిత్సచేయకూడదు. తొమ్మిదవ మాసమున కుంభకర్ణియను గ్రహి ఆవహించిన శిశువు జ్వరము, జలుబులతో బాధపడును. ఎక్కువగా ఏడ్చును. ఆ గ్రహికొరకై పూర్వము చెప్పిన పదార్థములు కుల్మాషములు మొదలగునవి ఈశాన్యమున బలి ఇవ్వవలయును. దశమ మాసమున తాపసిగ్రహి ఆవహించిన శిశువు ఆహారము త్యజించి కండ్లు మూసుకొనియుండును. ఈ గ్రహికొరకై ఘంటా, పతాకా, పిష్టాన్నములు మొదలగునవి బలిగా ఇవ్వవలెను. పదకొండవ మాసమున చంచల అనుగ్రహి ఆవహించగా శిశువు నేత్ర రోగముచే పీడితుడగును. దానికి చికిత్స చేయుట వ్యర్థము. పండ్రెండవ మాసమున చంచల అను గ్రహి ఆవహించగ శిశువునకు దీర్ఘనిశ్వాసము భయాదికము కలుగును. శాంతి కొరకై మధ్యాహ్న సమయమున తూర్పునందు కుల్మాష తిలాదులతో బలి ఇవ్వవలయును.
రెండవ సంవత్సరమున యాతన ఆవహించగా శిశువునకు యాతన కలుగును. రోదనాదికము ఉండును. శాంతికొరకై వెనుకటివలె స్నానాదికము చేయించి తిల మాంస, మద్యములు బలిగా యివ్వవలెను. మూడవ సంవత్సరమున రోదని గ్రహి ఆక్రమించగా కంపము రోదనము, రక్త మూత్రము కలుగును. ఇందు నిమిత్తమై గుడోదన, తిలాపూపములు తిలపిష్ఠముతో చేసిన ప్రతిమ దానము చేయవలయును. శిశువునకు తిలమిశ్ర జలముతో స్నానము చేయించి పంచపత్రములతోను రాజఫలత్వ తోను ధూపము వేయవలయును. నాల్గవ వర్షమున ఛటక అను గ్రహిబాలునకు జ్వరము, వాపు అన్ని అవయవములందు నొప్పికల్గును. ఛటక నిమిత్తమై వెనుక చెప్పిన పదార్థము లను తిలలను బలి యిచ్చి బాలకునకు స్నానము చేయించి ధూపము వేయవలయును. ఐదవ వర్షమున గ్రహిచంచల. బాలునకు జ్వరము, భయము, అంగ శైథిల్యము కలుగును. చంచల కొరకై అన్నము మొదలగునవి బలియిచ్చి బాలునకు మేష శృంగములతో ధూపము వేయవలయును. పలాశ, ఉదుంబర, అశ్వత్థ, వట, బిల్వదళములు కలిసిన జలముతో వానికి స్నానము చేయించ వలయును. ఆరవ సంవత్సరమున ధావని అనుగ్రహిచే ఆక్రమింపబడిన బాలుని శరీరము నీరసమై ఎండిపోవును. ప్రతి అవయవము నందును పీడకలుగును. ఏడుదినముల వరకు వెనుక చెప్పిన పదార్థములను బలిగా ఇచ్చి బాలకునకు భృంగరాజముతో స్నానము చేయించి ధూపము వేయవలయును.
ఏడవ సంవత్సరమున యమునా అనుగ్రహి ఆవహించిన పిల్లవానికి వాంతులు, మాట లేక పోవుట, ఎక్కువ నవ్వుట, ఏడ్చుట కలుగును. మాంస, పాయస, మద్యాదులు బలి ఇచ్చి స్నానము చేయించి ధూపము వేయవలయును. ఎనిమిదవ సంవత్సరమున జాతవేద ఆవహించగా, బాలుడు నిరాహారుడై ఏడ్చును. కృసర అపూప దధ్యాదులు బలిగా ఇచ్చి స్నానము చేయించి ధూపము వేయవలయును. తొమ్మిదవ వర్షమున కాల ఆవహించగా భుజము కొట్టుకొనుట, గర్జనము భయము కలుగును. కృసర అపూపసకు కుల్మాష పాయసములు బలిగా ఇవ్వవలెను. పదవ సంవత్సరమున కలహంసి ఆవహించగా దాహము కృశత్వము జ్వరము కలుగును. ఐదు దినములు పౌలిక, దధి, అన్నములు బలిగా ఇవ్వ వలెను. వేపాకుల ధూపము కుష్ట లేపనము చేయవలయును. పదకొండవ సంవత్సరమున దేవదూతి ఆవహించగా బాలుడు నిష్ఠురముగా పలుకును. వెనుకటి వలెనే బలి ఇచ్చి లేపాదికము చేయవలయును. పండ్రెండవ సంవత్సరమున బలిక ఆవహించిన బాలుడు శ్వాస రోగముతో బాధపడును. వెనుకటి వలెనే బలి లేపాదికము చేయవలయును. పదమూడవ సంవత్సరమున వాయవి ఆవహించిన బాలునకు ముఖరోగ అంగ శైథిల్యములు కలుగును. రక్తాన్న గంధ మాల్యాదులు బలి ఇచ్చి బాలునకు పంచదళములతో స్నానము చేయించవలెను. రాజి, నింబదళములు ధూపము వేయ వలెను. పదునాల్గవ సంవత్సరమున యక్షిణి ఆవహించగ శూల జ్వర దాహాదులు కలుగును. మాంస భక్ష్యాదులతో బలి ఇవ్వవలయును. శాంతి కొరకై స్నానాదికము కూడ వెనుకటివలెనే చేయవలెను. పదునైదవ సంవత్సరమున ముండికా గ్రహి ఆవహించిన బాలునకు సర్వదా రక్తస్రావము కల్గుచుండును. దీనికి చికిత్స చేయించకూడదు. పదునారవ సంవత్సరము వానరి ఆవహించిన బాలుడు నేలపై పడిపోవును. నిద్రా జ్వరాదులతో బాధపడును. మూడు దినములు పాయసాదులు బలిగా ఇచ్చి స్నానాదికము వెనుకటి వలెనే చేయించవలెను. పదునేడవ సంవత్సరమున గంధవతి ఆవహించగా బాలకుని శరీరమున ఉద్వేగము కలుగును. ఆతడు ఎక్కువగా ఏడ్చును. కుల్మాషాదికము బలిగా ఇచ్చి వెనుకటివలెనే స్నాన ధూప లేపనాదులు చేయవలెను. దిన దేవత పూతన వర్ష దేవత సుకుమారిక. ‘ఓం నమః సర్వ మాతృభ్యః’ మొదలు ‘రుద్రోజ్ఞాపయతి’ వరకు వున్న మూలోక్త మంత్రము సర్వకామ ప్రదము. దీనిని బాల గ్రహశాంతికై ఉపయోగించ వలెను. ‘ఓం నమో భగవతి’ మొదలు ‘వస వస’ వరకు వున్న మూలోక్త మంత్రమును రక్షార్థమై బలి దాన సమయమున పఠించవలెను. బ్రహ్మ, విష్ణువు, శివుడు, స్కందుడు, గౌరి, గణాదులు రక్షింతురు గాక! జ్వర దాహముతో బాధపడుచున్న పిల్లవానిని విడచెదరు గాక! ఈ మంత్రము కూడ బాలగ్రహ నివారకము. (299)
