అగ్ని మహా పురాణము

Table of Contents

ఉత్పాత శాంతి విధానము - 1

పుష్కరుడు పలికెను:

పరశురామా! ఒక్కొక్క వేదములో ఉన్న లక్ష్మీవర్ధకమగు శ్రీసూక్తమును తెలియ వలెను. ‘హిరణ్యవర్ణాం హరిణీం’ మొదలగు పదునైదు ఋక్కులు ఋగ్వేదీయ శ్రీసూక్తము. ‘రథే’ (29-43) ‘అక్షయరాజాయ’ (30-18) వాజః (18-34) చతస్రః (18-32) ఈ నాలుగు మంత్రములును యజుర్వేదీయ స్త్రీ సూక్తము. ‘శ్రాంవంతీయ సామ’ సామవేదీయ శ్రీసూక్తము. ‘శ్రియంధాతర్మయిదేహి’ ఇది అథర్వ వేదీయ శ్రీసూక్తము. భక్తి పూర్వకముగ శ్రీసూక్త జప హోమము చేయువానికి తప్పక లక్ష్మి లభించును. శ్రీదేవి అనుగ్రహమునకై కమలములు, బిల్వములు, ఆజ్యము, తిలలు, హోమము చేయవలయును. అన్ని వేదములందును పురుష సూక్తము ఉన్నది. అది సకల కామప్రదము. స్నానముచేసి పురుష సూక్తములోని ఒక్కొక్క మంత్రముతో మహావిష్ణువునకు ఒక్కొక్క జలాంజలియు పుష్పమును సమర్పించువాడు తాను పాపరహితుడై ఇతరుల పాపములను కూడ తొలగించును. స్నానము చేసి ఈ సూక్తమునందలి ఒక్కొక్క మంత్రముతో శ్రీమహావిష్ణువునకు ఫలమును సమర్పించువాడు సర్వకామములను పొందును. పురుషసూక్త జపముచే మహాపాతకములు ఉపపాతకములు నశించును. కృచ్ఛవ్రతముచేసి పరిశుద్ధుడైనవాడు స్నానపూర్వకముగ పురుష సూక్త జపహోమములు చేసినచో సర్వమును పొందును.

పదునెనిమిది శాంతులలో సమస్త ఉత్పాతములను తొలగించు అమృత, అభయ, సౌమ్య అను మూడు శాంతులు సర్వోత్తమములు. అమృతాశాంతి సర్వ దైవత్యము. అభయశాంతి బ్రహ్మ దైవత్యము. సౌమ్యాశాంతి సర్వ దైవత్యము. వీటిలో ఒక్కొక్కటి కూడ సర్వకామప్రదము. ఓ భృగుశ్రేష్ఠా! అభయశాంతి కొరకై వరణ వృక్షముయొక్క మూలముతో మణి చేయవలయును. అమృతశాంతికి దూర్వామూల మణిని, సౌమ్యా శాంతికి శంఖమణిని ధరించవలయును. ఆయా శాంతుల దేవతలకు సంబంధించిన మంత్రములతో మణిని సిద్ధముచేసి కట్టవలెను. ఈ శాంతులు దివ్య అంతరిక్ష భౌమ ఉత్పాతములను శమింపచేయును. దివ్య, అంతరిక్ష, భౌమములను మూడు విధముల అద్భుతములగు ఉత్పాతములను చెప్పెదను వినుము.

గ్రహ నక్షత్రముల వికారములచే కలుగు ఉత్పాతములు దివ్యములు. అంతరిక్షోత్పాతములను వినుము. ఉల్కాపాతము, దిగ్దాహము, సూర్యుడు గుడికట్టుట, గంధర్వ నగరము, వికృతమైన వర్షము-ఇవి అంతరిక్ష ఉత్పాతములు. స్థావరములందును, జంగమ ప్రాణులందును కలుగు ఉపద్రవములు, భూకంపము, ఇవి భూమిజోత్పాతములు. ఈ ఉత్పాతములు కనబడిన తరువాత ఒక వారములో పునఃవర్షము పడినచో ఆ అద్భుతము నిష్ఫలమగును. మూడు సంవత్సరముల వరకు ఈ అద్బుతోత్పాతమునకు శాంతిచేయకున్నచో అది లోకమునకు భయావహము. దేవతా ప్రతిమలు నాట్యమాడుట, కదలుట, మండుట, శబ్దము చేయుట, ఏడ్చుట, చెమట పట్టుట, నవ్వుట మొదలగు వికారములు కనబడినచో ఆ దేవతలను పూజించి ప్రాజాపత్య హోమము చేయవలయును. ఏ రాష్ట్రము నందు అంటించకుండగనే అగ్నిఘోర శబ్దముతో ప్రజ్వలించినదో ఆ రాష్ట్రము రాజుచే పీడింపబడును.

భృగు నందనా! ఇట్టి అగ్ని వికారశాంతికి అగ్ని దైవత్యములగు మంత్రములలో హోమము చేయవలయును. వృక్షములు ఫలములిచ్చినను, వాటి నుండి పాలు, రక్తము కారినను అది వృక్షజనిత భౌమోత్పాతము. అపుడు శివుని పూజించి ఉత్పాతములకు శాంతి చేయవలయును. అతివృష్టి, అనావృష్టి, రెండును దుర్భిక్ష కారణములు. వర్షఋతువుకాని ఋతువులో మూడు దినములు నిరంతర వృష్టి కలిగినచో అది భయజనకము. పర్జన్య, చంద్రసూర్యులను పూజించుటచే ఈ వర్షవికారము నశించును. ఒక నగరమునుండి నదులు, దూరమైపోయినను దగ్గరకు వచ్చినను, అందలి సరోవరములు ప్రవాహములు ఎండిపోయినను ఈ జలాశయ వికారమును తొలగించుటకు వారుణ మంత్రము జపించవలెను. స్త్రీలు ఆ సమయమున ప్రసవించినను, సమయమున ప్రసవించకున్నను వికృతమైన గర్భము కన్నను, కవల పిల్లలు మొదలగు వారిని కన్నను ఈ ప్రసవ వికారమును తొలగించుటకు పతివ్రతలైన స్త్రీలను, బ్రాహ్మణాదులను పూజించవలెను. గుఱ్ఱముగాని, ఏనుగుగాని, ఆవుగాని, రెండు పిల్లలుకన్నను, వికృతమైన విజాతీయ సంతానమును కన్నను ఆరు మాసములలోపు మరణించినను వికృత గర్భము కన్నను ఆ రాజ్యమునకు శత్రువుల నుండి భయము కలుగును. ఈ ఉత్పాతమును శాంతింప చేయుటకై హోమము జపము బ్రాహ్మణ పూజ చేయవలెను. అయోగ్యమైన పశువులు బండి కట్టినను, యోగ్య పశువులు బండి లాగకున్నను, ఆకాశమున తూర్యనాదము వినబడినను మహాభయము వచ్చును. వన్య పశుపక్షులు గ్రామములో ప్రవేశించినను గ్రామ్య పశువులు వనములోనికి వెళ్లిపోయినను స్థలచరములు జలములో ప్రవేశించినను జలచరములు స్థలము పైకి వచ్చినను రాజు ద్వారాది సమీపమునకు నక్కలు వచ్చినను, ప్రదోష కాలమున కోడి కూసినను, సూర్యోదయ సమయమున నక్కలు అరచినను, పావురములు, ఇంటిలో దూరినను మాంసము తిను పక్షులు తలపై తిరిగినను, సామాన్యపు ఈగ తేనెకూర్చినను కాకులు మైథునము చేయుచుండగ కనబడినను దృఢమైన ప్రాసాదములు తోరణములు, ఉద్యానములు, ద్వారములు, ప్రాకారములు, భవనములు, అకారణముగ పడిపోయినను రాజు మరణించును. పరాగముగాని, ధూమముగాని, పది దిక్కుల నిండిపోయినను కేతువు ఉదయించినను గ్రహణమువచ్చినను, సూర్య చంద్ర బింబముల మధ్య రంధ్రము కనబడినను, ఇవి గ్రహ నక్షత్ర వికారములు. ఇవి ఎచట కనబడునో అచట భయమును సూచించును. అగ్ని మండకపోయినను, ఉదకకుంభము అకారణముగ కారినను, ఈ ఉత్పాతములకు ఫలితముగ మరణము, భయము, మహామారి, మొదలగునవి కలుగును. బ్రాహ్మణులను దేవతలను పూజించుటచేతను, జపహోమముల చేతను ఈ ఉత్పాతములు శాంతించును. (263)