అగ్ని మహా పురాణము

Table of Contents

విద్యాకళా శోధన విధానము

పరమేశ్వరుడు చెప్పెను. పూర్వమునందున్న కళాప్రతిష్ఠతో కూడ విద్యాకళా సంధానముచేసి, వెనుకటివలెనే దానియందు తత్త్వ వర్ణాదుల చింతనము చేయవలెను. ‘ఓం హాం హీం హూం హాం’ అనునది సంధాన మంత్రము. రాగ, శుద్ధ విద్యా, నియతి, కలా, కౌల, మాయా, అవిద్యలనెడు ఏడు తత్త్వములను, ర, ల, వ, శ, ష, స అను ఆరు వర్ణములును విద్యా కలాంతర్గతములు. ప్రణవము మొదలగు ఇరువది యొక్క పదములు గూడ తదంతర్గతములే. ‘ఓం నమఃశివాయ సర్వప్రభవే శివాయ ఈశానముర్ధ్నే తత్పురుష వక్త్రాయ అఘోర హృదయాయ, వాసుదేవగుహ్యాయ సద్యోజాతమూర్తయే, ఓం నమోనమః గుహ్యాతి గుహ్యాయ గోప్త్రే అనిధానాయ సర్వయోగాధికృతాయ సర్వ యోగాధిపాయ జ్యోతీ రూపాయ పరమేశ్వరాయ అచేతన అచేతన వ్యోమన్ వ్యోమన్’ ఇవి ఇరువది యొక్క పదములు.

ఇపుడు రుద్రుల స్వరూపము, భువనముల స్వరూపము చెప్పబడుచున్నది. ప్రమథ వాసుదేవ, సర్వదేవోద్భవ, భవోద్భవ, వజ్రదేహ, ప్రభు, ధాతృ, క్రమ, విక్రమ, సుప్రభ, బుద్ధ, ప్రశాన్త నామన్, ఈశాన, అక్షర, శివ, సశివ, బభ్రు, అక్షయ, శంభు, అదృష్టరూప నామన్, రూపవర్ధన, మనోన్మన, మహావీర, చిత్రాఙ్గ, కల్యాణులు (ణములు), ఈ ఇరువది యైదును భువనములు, రుద్రులును అని తెలియవలెను.

విద్యాకళలో అఘోరము మంత్రము. మ ర లు బీజములు, పూషా, హస్తి జిహ్వా అనునవి నాడులు. వ్యాన, నాదములు రెండు ప్రాణవాయువులు. రూప మొక్కటియే విషయము. పాదములు, నేత్రములు ఇంద్రియములు, శబ్ద స్పర్శ రూపములు మూడు గుణములు. సుషుప్తి అవస్థ, రుద్రదేవుడు కారణము. భువనాది సమస్త వస్తువులును విద్యాంతర్గతములని భావన చేయవలెను. ‘ఓం హూం హైం హాం’ అనునది సంధాన మంత్రము, రక్తవర్ణము, స్వస్తిక చిహ్నాంకితము అగు త్రికోణాకార మండలమును భావన చేయవలెను. శిష్యుని పక్షమున తాడనము, కలాపాశచ్ఛేదనము, శిష్య హృదయ ప్రవేశము, వాని జీవచైతన్యమును పాశవిముక్తము చేయుట, ఆతని హృదయ ప్రదేశమునుండి జీవచైతన్యముల ఆకర్షణ గ్రహణములును చేయవలెను. జీవచైతన్యమును తన ఆత్మయందు ఆరోపించుకొనుట, కళాపాశ సంగ్రహణము, దానిని కుండమునందు స్థాపించుట ఇవన్నియు వెనుకటివలెనే చేయవలెను. కారణ రూపుడగు రుద్ర దేవుని ఆవాహన పూజాదులుచేసి, శిష్యునకు బంధము చేయవలదని ఆతనిని ప్రార్థించవలెను.

మాతాపిత్రాదుల ఆవాహనముచేసి శిష్యుని హృదయమున తాడనము చేయవలెను. పూర్వోక్త విద్యనుసారముగ అస్త్ర మంత్రముతో హృదయము నందు ప్రవేశించి జీవచైతన్యమును కలాపాశ విముక్తము చేయవలెను. మరల దానిని ఆకర్షించి, గ్రహించి, తన ఆత్మలో చేర్చుకొనవలెను. వామా, ఉద్భవ ముద్రతో దానిని వాగీశ్వరీదేవీ గర్భమునందు స్థాపించినట్లు భావన చేయవలెను. పిమ్మట దేహ సంపాదనము చేసి, జన్మ, అధికార, భోగ, లయ, స్రోతఃశుద్ధి, తత్త్వశుద్ధుల కొరకును, సకల మలకర్మాది నిర్మూలనము కొరకును, పాశ బంధ నివృత్తి కొరకును, నిష్కృతి కొరకును స్వాహాంతాస్త్ర మంత్రముచే నూరు హోమములు చేయవలెను.

పిమ్మట అస్త్ర మంత్రముచే పాశబంధ శిధిలీకరణము, మలశక్తి తిరోధానము, కళాపాశచ్ఛేదనము, మర్దనము, వర్తులీకరణము, దాహము, అంకురాభావ సంపాదనము, ప్రాయశ్చిత్తకర్మ-ఇవి అన్నియు వెనుకటివలెనే చేయవలెను. పిదప రుద్రుని ఆవాహనచేసి, పూజించి, ‘ఓం హాం రూపగన్ధౌ శుల్కం రుద్ర గృహాణ స్వాహా’ అను మంత్రముచే రూప గంధములను సమర్పించవలెను. పరమేశ్వరుని ఆజ్ఞ వినిపించి రుద్రుని విసర్జించవలెను. జీవచైతన్యమును తన ఆత్మలో నుంచి, దాని పాశసూత్రము నందు చేర్చవలెను. జలబిందు స్వరూపము అగు ఆ చైతన్యమును శిష్యుని శిరముపై నుంచి మాతాపితరులను విసర్జించవలెను. సకలవిధి సంపూర్తి కొరకు పూర్ణాహుతి చేయవలెను. విద్యలో తాడనాది క్రియలు అన్నియు పూర్వోక్త విధానానుసారమే చేయవలెను. అంతలోను దానికి సంబంధించిన బీజములను ఉపయోగించుట యొక్కటియే భేదము. ఈ విధానము అంతయు పూర్తియైనచో విద్యాకళాశోధనము అగును. (86)