అగ్ని మహా పురాణము
త్వరితాజ్ఞాన నిరూపణము
అగ్నిదేవుడు పలికెను:
ఓం హ్రీం హ్రూం ఖే, ఛే, క్షః స్త్రీం, హ్రూం క్షే హ్రీం ఫట్ త్వరితాయై నమః అను మంత్రముతో న్యాసపూర్వకముగ ద్విభుజ లేదా అష్ట భుజయగు త్వరితా దేవిని ధ్యానించుచు పూజించవలెను. సింహాసనమును దానిపై ఉన్న త్వరితాదేవిని, ఆ దేవినాల్గు వైపుల హృదయాద్యంగములను పూజించవలెను. పూర్వాదిక్కులందు హృదయా ద్యంగములను పూజించి మండలముపై గాయత్రిని ప్రణీతాదేవిని పూజించవలెను. ఎనిమిది దళములపై హుంకారీ, ఖేచరీ, చండా, భేదినీ, క్షేపణీ, స్త్రీ హుంకారీ, క్షేమంకరులను పూజించి, మధ్యయందు ఫట్కారిణిని పూజించవలెను. దేవికి ఎదురుగా నున్న ద్వారము యొక్క దక్షిణ వామ పార్శ్వములందు జయ విజయలను ద్వారాగ్రమున కింకరుని పూజించవలెను. తిల హోమములు చేసినచో సకలాభీష్ట వస్తువులు నశించును, దేవికి అలంకారములగు ఎనిమిది నాగులను నామోచ్చారణ పూర్వకముగ పూజించవలెను. అనంతాయనమః స్వాహా, కులికాయ నమః స్వధా, వాసుకి రాజాయ స్వాహా, శంఖ పాలాయ వౌషట్, తక్షకాయ వషట్, మహాపద్మాయ నమః కర్కోట నాగాయ స్వాహా, పద్మాయ నమః ఫట్. ఇవి నాగ పూజా మంత్రములు.
పది నిలువు రేఖలు, పది అడ్డరేఖలు గీసినచో, ఎనుబది యొక్క పదములు ఏర్పడును, ఇది నిగ్రహ చక్రము, దీనిని వస్త్రముపైగాని, వేదికపై గాని, భూర్ణ వృక్షత్వక్కుపై గాని, శిలా పట్టముపైగాని, యష్టికలపై గాని, వ్రాయవచ్చును. మధ్యవర్తి కోష్టమునందు పేరు వ్రాయవలెను. దాని పార్శ్వ భాగమున పూర్వాది దిక్కులయందు నాలుగు పట్టికలపై భ్రూం, క్ష్రూం, భ్రూం, హ్రూం యను నాలుగు బీజములు వ్రాసి ఈశానాది కోణములందు లోపలి వైపున కాళరాత్రి మంత్రమును వ్రాసి వెలుపల వైపున యమరాజ మంత్రము వ్రాయవలెను. ‘కాళీ, మార’ మొదలు ‘అక్షర’ వరకును మూలోక్తమైనది. కాళీ మంత్రము యమావాట, మొదలు రీటట వరకువున్న మూలోక్తమంత్రము యమ మంత్రము. యమ మంత్రము వెలుపల నలువైపుల రం వ్రాసి దాని క్రింద యం వ్రాయవలెను. దీనిచే మారణాత్మక నిగ్రహ మంత్రము ఏర్పడును. వేపచిగురు మజ్జ రక్తము, విషము కలిపిన సిరాలో కొంచెము చితాబొగ్గు నూరి కలిపి దానిని పింగళ వర్ణమగు సిరా బుడ్డిలో వుంచి, కాకి ఈక కలముతో నిగ్రహ మంత్రము వ్రాసి దానిని శ్మశానభూమి యందుకాని, చతుష్పథము నందు గాని, గోతిలో క్రిందికి పాతవలెను. లేదా పుట్టయందు వుంచవలెను. లేదా విభీతకద్రుమశాఖ క్రింద పాతవలెను. ఇట్లు చేయుటచే శత్రువులందరును నశింతురు.
శుక్ల పక్షమున భూర్జపత్రము నందును నేలపైనను గోడపైనను లాక్షారసముతో గాని, కుంకుమతో గాని, ఖడికా చందనముతోగాని అనుగ్రహ చక్రము వ్రాయవలెను. మధ్యకోష్టమున వ్యక్తి పేరు ఠం, ఠం, అను అక్షరముల మధ్య వ్రాసి పూర్వాది వీథియందు, జూం, నః, వషట్, అనునది వ్రాసి, ఈశాన్యముతో ప్రారంభించి వీథిని విడచుచు ఆగ్నేయము పర్యంతము లక్ష్మీ మంత్రమును వ్రాయవలెను. ఇది పై నాలుగు పంక్తులందును పూర్తియగును. క్రింది నాలుగు పంక్తులలో అన్నిటి కంటెను క్రిందనున్న నైఋతి కోణస్థ కోష్టమునందు ప్రారంభించి, కుడి పంక్తి తరవాత పై పంక్తి కూడ ఎడమనుండి కుడికి వ్రాయవలెను. ఈవిధముగా నాలుగు పంక్తులలో లక్ష్మీ మంత్రము పూర్తి అగును. ‘శ్రీసా’ మొదలు ‘జ్ఞేయ’ వరకును మూలోకమగునది లక్ష్మీ మంత్రము. చక్ర బహిర్భాగమున నలువైపుల త్వరితామంత్రము ప్రతి దిక్కునందును ఒక పర్యాయము చొప్పున వ్రాయవలెను. ఈ చతురశ్ర చక్రమును గోళ్ళరేఖతో, అది కలశములోనికి వెళ్లునట్లు చుట్టి, కలశము క్రింద ఒక కమలము ఏర్పరచి దానిపై కమలమును స్థాపించవలెను. కమలముపై స్థాపించిన పద్మ చక్రమును వ్రాసి, దానిని ధరించినచో మృత్యువు తొలగును, స్వర్గము లభించును. అది శాంత సాధనమునకు కూడ ఉపయోగించును. సౌభాగ్యాదులను ఇచ్చును.
పదకొండు నిలువు రేఖలు పదకొండు అడ్డ రేఖలు గీసికూడ ఇరువది ఒక్క కోష్ఠములు ఏర్పరచి మధ్య కోష్ఠమునందు పేరు వ్రాయవలెను. ఈశాన్య కోష్ఠముతో ప్రారంభించి ప్రదక్షిణ క్రమమున పండ్రెండు పర్యాయములు త్వరితా విద్యాక్షరములను హ్రీం, విడచి వ్రాయవలెను. రేఖాగ్ర భాగము లందు త్రిశూల చిహ్నమును ఉంచవలెను. త్వరితా విద్యా వర్ణములను క్రమముగానే వ్రాసి అంతమున క్రింది వైపు ‘వషట్’ చేర్చవలెను. ఇది సర్వ కామార్థ సాధకమగు ప్రత్యంగితా విద్య, ఎనుబది యొక్క కోష్ఠములుగల చక్రముపై త్వరితా విద్యాక్షరములను మొదటి అక్షరముతో ప్రారంభించి వ్రాయవలెను. ఆరు పర్యాయములు మంత్రములు వ్రాసిన పిమ్మట అంతములందు మిగిలిన కోష్ఠములపై పేరు వ్రాసి చివర ‘వషట్’ చేర్చవలెను. ఇది రెండవ ప్రత్యంగిరా విద్య. సర్వార్థ సాదిక అరువది నాలుగు కోష్టములుగల చక్రముపై గూడ నిగ్రహ చక్రమును, అనుగ్రహ చక్రమును వ్రాయవచ్చును. ఇది అమృతా విద్య. దీని మధ్య కోష్ఠమున క్రీం, సః, హూం, అనియు పేరును వ్రాయవలెను. బాహ్య భాగమున కమలము ఏర్పరచి దానిదళములపై విలోమ క్రమమున త్వరితా విద్యను వ్రాయవలెను. దానిని హ్రీంకార యుక్తములగు మూడు వృత్తాకార పంక్తులతో వేష్టించి కుంభాకారము యంత్రము లోపల లిఖితములగు ఈ విద్యను ధరించుటచే సర్వ శత్రువులు నశింతురు. సర్వము లభించును. రోగి చెవిలో దీనిని జపించినచో సర్పాది విషములు శాంతించును. దీని అక్షరములతో చిహ్నితములగు దండములతో శరీరముపై కొట్టినచో విషము నశించును. (314)
