అగ్ని మహా పురాణము

Table of Contents

వాస్తు పూజా విధానము

పరమేశ్వరుడు చెప్పెను: స్కందా! పిమ్మట ప్రాసాదమును ఆ సూత్రించి వాస్తు మండల రచన చేసి చతురస్రమైన సమతల క్షేత్రమునందు అరువది నాలుగు కోష్ఠములు నిర్మించవలెను, కోణములందు రెండు వంశముల విన్యాసము చేయవలెను. వికోణములకు పోవునట్లుగా ఎనిమిది రజ్జువులు గుర్తించవలెను. అవి ద్విపద-షట్పద స్థానముల రూపమున విభక్తములై యుండును. వాటిపై వాస్తు దేవతాపూజ చేయవలెను. కుంచిత కేశధారి యగు వాస్తు పురుషుడు వెల్లకితల పండుకొని ఉండును. అతని ఆకారము అసుర సదృశముగా నుండును. పూజా సమయమున ఆతనిని ఆ విధముగనే స్మరించవలెను. కాని గోడ మొదలైన వాటికి పునాది వేయునపుడు అతడు ముఖము క్రిందికి వంచి పండుకొని ఉన్నట్లు ధ్యానము చేయలెను. అతని మోకాళ్ళు, మోచేతులు, తొడలు, వాయవ్య, ఆగ్నేయ దిక్కుల వైపు పడియుండును. ఒకదానితో ఒకటి కలసియున్న పాదములు నైరృతి దిక్కువైపున ఉండును, ఆతని శిరస్సు ఈశాన్య దిక్కు వైపున ఉండును. చేతులు దోసిలిగా ఏర్పడి వక్షః స్థలముపై ఉండును. ఆ వాస్తు పురుషుని శరీరముపై ఎక్కియున్న దేవతలను పూజించుటచే శుభకరమగును. ఎనమండుగురు దేవతలు కోణాధిపతులు. వారు ఎనిమిది కోణార్థములందు ఉందురు. వరుసగా పూర్వాదిదిక్కులందున్న మరీచ్యాది దేవతలు ఆరేసి పదముల అధిపతులు. వారి మధ్యనున్న బ్రహ్మ నాలుగు పదముల అధిపతి. మిగిలిన దేవతలు ఒక్కొక్క పదమునకు అధిపతులు. సమస్తము, నాడీసంపాతము మహామర్శ, కమలము, ఫలము, త్రిశూల, స్వస్తిక, వజ్ర, మహాస్వస్తిక, సంపుట, త్రికటి, మణిబంధ, సువిశుద్ధ పదములు పండ్రెండు మర్మస్థానములు. వాస్తు భిత్త్వాదులందు వీటిని అన్నింటిని పూజించవలెను. రుద్రునకు ఘృతాక్షతలు సమర్పింపవలెను. పర్జన్యునకు కమల-జలములు, జయంతునకు కుంకుమ రంజితమగు నిర్మల పతాక, మహేంద్రునకు రత్న మిశ్రితోదకము, సూర్యునకు ధూమ్ర వర్ణమగు చాందిని, సత్యదేవతకు ఘృతయుక్త గోధుమలు, భృశునకు ముద్గాన్నము, అంతరిక్షునకు పక్షి మాంసము లేదా సక్తువులు సమర్పించవలెను. వీరు తూర్పు దిక్కునకు సంబంధించిన ఎనమండుగురు దేవతలు. అగ్నికి మధువు, పాలు, నెయ్యి నింపిన స్రుక్కు సమర్పించవలెను. వూషకు పేలాలు, వితథునకు సువర్ణ మిశ్రిత జలము, గృహక్షతునకు మధువు, యమునకు మాంసోదనము, గంధర్వనాధునకు గంధము, భృంగ రాజునకు పక్షిజిహ్వ, మృగమునకు యవపర్ణములు సమర్పించవలెను. ఈ ఎనమండుగురు దేవతలు దక్షిణమున పూజింపబడుదురు.

పితృదేవతకు తిలోదకమును సమర్పించవలెను. దౌవారిక దేవతకు క్షీర వృక్ష దంతధావన కాష్ఠమును ధేనుముద్రా ప్రదర్శన పూర్వకముగా సమర్పించవలెను. సుగ్రీవునకు పుష్పములు, పుష్పరంతునకు కుశలు, వరుణునకు ఎర్రని కమలములు, అసురునకు సురాసవములు, శేషునకు నేతిలో తడిపిన అన్నము, రోగునకు ఘృతమిశ్ర మండికములు సమర్పించవలెను. వీరు పశ్చిమ దిగ్దేవతలు, మారుతునకు పచ్చని రంగుగల ధ్వజము, నాగదేవతకు నాగకేసరము, ముఖ్యునకు భక్ష్య పదార్థము, భల్లాటునకు ముద్గసూపము, సోమునకు ఘృతమిశ్ర పాయసము, చరకునకు శాలూకము, అదితికి లోపి, దితికి పూరీ సమర్పించవలెను. ఈ ఎనమండుగురు ఉత్తరదిగ్దేవతలు, మధ్యనున్న బ్రహ్మకు మోదకములు సమర్పించవలెను. పూర్వదిక్కునందు ఆరు పదముల ఉపభోక్తయగు మరీచికి కూడ మోదకములు అర్పించవలెను. బ్రహ్మ క్రింద ఆగ్నేయ కోష్ఠమునందున్న సవితకు ఎర్రటి పుష్పములు, సవిత క్రింద ఆగ్నేయ కోష్ఠమునందున్న సావిత్రికి కుశోదకములు సమర్పించవలెను. బ్రహ్మకు దక్షిణమున ఆరుపదముల అధిష్ఠాతయగు మృవస్వంతునకు రక్త చందనము, బ్రహ్మకు నైరృతి దిక్కునందున్న క్రింది కోష్ఠమునందున్న ఇంద్రునకు పసుపు అన్నము, ఇంద్రుని క్రింద నైరృతి కోణమునందున్న ఇంద్రజునకు మిష్టాన్నము, బ్రహ్మకు పశ్చిమమున ఆరుపదములందున్న మిత్రునకు గుడమిశ్రాన్నము, వాయవ్య కోణము క్రింద పదమునందున్న రుద్రునకు ఘృతమపక్వాన్నము, రుద్రుని క్రింది కోష్ఠము నందున్న రుద్రదాసునకు అర్ద్రమాంసము, ఉత్తరమునందున్న ఆరు పదములకు అధిపతియగు పృథ్వీధరునకు పెనులతోచేసిన నైవేద్యము ఈశాన్యము నందు క్రిందనున్న పదము నందలి ఆపుని, దాని కింకను క్రిందనున్న ఆపవత్సుని యథావిధిగా పూజించి పెరుగు, పాయసము సమర్పించవలెను. మధ్యభాగమున నాల్గుపదములలో నున్న బ్రహ్మకు పంచగవ్యములు, అక్షతలు, ఘృతసహితమగు చరువు సమర్పించవలెను. (93)