అగ్ని మహా పురాణము

Table of Contents

అర్ఘకాండము

పరమేశ్వరుడు పలికెను:

వస్తువుల మూల్యమును (అల్పత్వాధికత్వముల) గూర్చి చెప్పెదను. భూతలముపై ఉల్కాపాతము, భూకంపము, వజ్రపాతము, చంద్ర సూర్య గ్రహణములు, దిక్కులందు అధికముగ వేడి కలుగునపుడు ఈ విషయమును ప్రత్యేకమాసము నందును పరిశీలించ వలెను. పైన చెప్పిన లక్షణములలో ఏదైన లక్షణము చైత్రమునందైనచో అలంకార సామగ్రిని (వెండి, బంగారము మొ!!) సంగ్రహించు కొనవలెను.

ఆరు మాసముల తరువాత అవి నాలుగు రెట్లు మూల్యమునకు అమ్ముడుపోవును. వైశాఖము నందైనచో వస్త్ర, ధాన్య, సువర్ణ, ఘృతాదులను సంగ్రహించుకొనవలెను. ఎనిమిదవ మాసమున ఆరు రెట్ల మూల్యమునకు అమ్ముడుపోవును. జ్యేష్ఠాషాఢములందైనచో యవలు, గోధుమలు, ధాన్యము సంగ్రహించుకొనవలెను. శ్రావణమునందైనచో ఘృత తైలాది రసపదార్థములను సంగ్రహించవలెను. ఆశ్వయుజ మాసము నందైనచో వస్త్రములు, ధాన్యము సంగ్రహించవలెను. కార్తికమునందైనచో అన్ని విధముల అన్నమునుకొని ఉంచుకొనవలెను. మార్గశిర పుష్యములందైనచో కుంకుమము వలనను సుగంధ పదార్థముల వలనను లాభము వచ్చును. మాఘమునందైనచో ధాన్యము వలన లాభము కలుగును. ఫాల్గుణము నందైనచో సుగంధ పదార్థములవలన లాభము కలుగును. లాభము వచ్చు అవధి ఆరు-ఎనిమిది మాసములని గ్రహించవలెను. (129)