అగ్ని మహా పురాణము
సామాన్య దేవపూజా విధానము
నారదుడు ఇట్లు చెప్పెను. ఇప్పుడు విష్ణువు మొదలగు దేవతల సామాన్య పూజను, సర్వ ఫలములను ఇచ్చు మంత్రములను గూర్చి చెప్పెదను. సకల పరివార సమేతుడైన అచ్యుతునికి నమస్కరించి పూజించవలెను.
విష్ణు పూజాంగముగ ద్వారదక్షిణ భాగమున ధాతను, విధాతను, వామభాగమున గంగను, యమునను రెండు నిధులను, ద్వారలక్ష్మిని, వాస్తు పురుషుని, శక్తిని, కూర్మమును, అనంతుని, పృథివిని, ధర్మమును జ్ఞానమును, వైరాగ్యమును, ఐశ్వర్యమును, అధర్మాదులను, పద్మభావన చేసి దాని కందమును, నాళమును, పద్మకేసరములను పద్మవర్ణిక (మధ్య భాగము)ను, ఋగ్వేదాదులను, కృతయుగాదులను, సత్త్వాది గుణములను, సూర్యాది మండలములను పూజించవలెను. విమల, ఉత్కర్షిణీ, జ్ఞాన, క్రియా, యోగాది శక్తులను పూజించవలెను ప్రహ్వ, సత్య, ఈశ, అనుగ్రహి, అమలమూర్తి అగు దుర్గ, గీర్దేవి, గణము, గణాధిపతి క్షేత్రము, క్షేత్రపాలుడు, వాసుదేవాదులు వీరిని కూడ పూజింపవలెను. హృదయమును శిరస్సును, కేశశిఖను, కవచమును, అస్త్రమును, శంఖమును, చక్రమును గదను, పద్మమును, శ్రీవత్సమును, కౌస్తుభమును, వనమాలను, లక్ష్మిని, పుష్టిని, గరుత్మంతుని, గురువును, ఇంద్రుని, అగ్నిని, యముని, రాక్షసుని, జలమును, వాయువును, కుబేరుని, ఈశ్వరుని, బ్రహ్మను, అస్త్రమును, వాహనమును, కుముదాడులను, విష్వక్సేనుని పూజింపవలెను. పూజ మండలాదులలో ఈ విధముగా చేసినచో సిద్ధి లభించును.
ఇపుడు సామాన్య శివపూజ చెప్పబడుచున్నది. ప్రారంభమున నందిని పూజించవలెను. మహాకాలుని, గంగను, యమునను, గణాదులను, గీర్దేవిని, లక్ష్మిని, గురువును, వాస్తుపురుషుని, ఆధార శక్త్యాదులను, ధర్మాదులను పూజించవలెను.
వామ, జ్యేష్ఠ, రౌద్రి, కాలి, కలవికరిణి, బలవికరిణి, బలప్రమథని, సర్వభూత దమని, మనోన్మని అను తొమ్మండుగురు శక్తులను పూజింపవలెను.
“హాం, హూం, హాం శివమూర్తయే నమః” అను మంత్రముతో ఆయా అవయవములను, ముఖములను పూజించుచు శివుని పూజించవలెను. “హౌం శివాయ హౌం” అని శివుని, ‘హాం’ అను బీజాక్షరముతో గణమును (గణాధిపతిని) పూజింపవలెను. ఇంద్రుడు మొదలగువారిని, చండుని, హృదయము మొదలగు వాటిని క్రమముగ పూజించవలెను. ఇపుడు సూర్యార్చన మంత్రములు చెప్పబడుచున్నవి. ముందుగా దండిని పిదప పింగళుని పూజించవలెను. ఉఛ్చైఃశ్రవస్సును, అరుణుని పూజించి ప్రభూతుని, విమలుని, సోముని, సంధ్యలను, వరసుఖుని, స్కందాదులను మధ్యయందు పూజింపవలెను.
దీప్తా, సూక్ష్మా, జయా, భద్రా, విభూతి, విమలా, అమోఘా విద్యుతా, సర్వతోముఖీ అను నవశక్తులను పూజింపవలెను. “హం” “ఖం” “ఖం” అను బీజాక్షరములచే ఆర్కాసనమును “సోత్కాయనమః అని మూర్తిని “హాం హ్రీం సః సూర్యాయ నమః” అని సూర్యుని, “ఆం నమోహృదయాయ” అని హృదయమును పూజింపవలెను.
“ఓం అర్కాయ నమః అని శిరస్సును పూజించవలెను. అట్లే అగ్ని, ఈశ, అసుర, వాయువులను అధిష్టించియున్న సూర్యుని పూజింపవలెను. “భూః” భువః స్వః జ్వాలిన్యై శిఖాయైనమః అని శిఖయు “హుం” అని కవచమును “భాం” అని నేత్రములను, హః, అని అర్కాస్త్రమును పూజించవలెను.
రాజ్ఞి అను సూర్యశక్తిని, దాని నుండి క్రటితమగు ఛాయా దేవిని పూజించవలెను. పిమ్మట సోమ, అంగారక, బుధ, గురు, శుక్ర, శని, రాహు కేతువులను తేజశ్చండిని పూజింపవలెను.
పిమ్మట సంక్షేపముగ పూజ చెప్పబడుచున్నది. ఆసనము, మార్తులు, మూలము, హృదయాదులు, పరిచారకులు వీరి పూజ చేయవలెను. విష్ణ్వాసనమును పూజించవలెను. విష్ణువు యొక్క మూర్తిని పూజింపవలెను. “రాం శ్రీం శ్రీం శ్రీధరాయ హరయే నమః” అని మంత్రము. “హ్రీం” అనునది సర్వమూర్తులకును సంబంధించిన త్రైలోక్య మోహన మంత్రము. “క్లీం” హృషీ హేశాయనమః” “హూం విష్ణవేనమః” అను మంత్రములు ఉచ్చరించవలెను. అన్ని దీర్ఘ సర్వములచే హృదయాదికమును పూజించవలెను. ఈ పంచమ పూజ యుద్ధాదులలో జయము నిచ్చును.
చక్ర, గదా, శంఖ, ముసల, ఖడ్గ, శార్ఙ్గ, పాశ, అంకుశ, శ్రీవత్స, కౌస్తుభ వనమాలలను పూజించవలెను. “శ్రీం” అను బీజాక్షరముతో శ్రీదేవిని, మహాలక్ష్మిని, తార్క్ష్యుని, గురువును, ఇంద్రాదులను పూజించవలెను.
సరస్వతీ పూజయందు ఆసనమును, మూర్తిని పూజించవలెను. “రౌం హ్రీం దేవ్యై సరస్వత్యై నమః” అని మంత్రము. హృదయాదులను పూజించవలెను. లక్ష్మి, మేధ, కుల, తుష్టి, ప్రష్టి, గౌరి, ప్రభావతి, దుర్గ, గణము, గురువు క్షేత్రపాలుడు- వీరి నందరిని పూజించవలెను.
“గం గణపతయే నమః” “హ్రీం గౌర్యై నమః”, “శ్రీం శ్రియై నమః”, “హౌం త్వరితాయై నమః”, “ఏం క్లీం సౌం త్రిపురాయై నమః” అని మంత్రములు. వీటికి ప్రారంభమున ప్రణవమును చేర్చి పేరాలోని మొదటి అక్షరమునకు బిందువు చేర్చవలెను. లేదా పూజాజపములందు అన్ని మంత్రములను “ఓం” కారముతో ప్రారంభింపవలెను.
ఈ మంత్రములతో నువ్వులు, నెయ్యి, మొదలైనవి హోమము చేసినచో ధర్మార్థ కామమోక్షములు లభించును. పూజా మంత్రములను పఠించువాడు భోగములనన్నియు అనుభవించి స్వర్గమునకు వెళ్ళును. (21)
