అగ్ని మహా పురాణము
తృతీయాతిథి వ్రతములు
అగ్ని దేవుడు చెప్పెను:
ఇపుడు భుక్తి ముక్తి ప్రదములగు తృతీయా (తదియ) వ్రతములను చెప్పెదను. లలితా తృతీయనాడు చేయు మూలగౌరీ వ్రతమును వినుము. పరమేశ్వరుడు చైత్ర శుక్ల తృతీయ దివసమున పార్వతిని వివాహమాడెను. అందుచే ఆ దివసమున తిలమిశ్ర జలముతో స్నానమాచరించి, పార్వతీ సమేతుడగు పరమేశ్వరుని బంగారము, ఫలములు మొదలగు వాటితో పూజించవలెను. నమోస్తు పాటలాయై అని చెప్పి పార్వతి పాదములను, శంకరుని పాదములను పూజించవలెను. శివాయ నమః అని శివుని, జయాయై నమః అని పార్వతిని అర్చించవలెను. త్రిపురఘ్నాయ నమః ‘భవాన్యై నమః’ అని చెప్పుచు క్రమముగా శివపార్వతుల జంఘలను పూజించవలెను. ‘రుద్రేశ్వరాయ నమః, ‘విజయాయై నమః’ అని చెప్పుచు శివపార్వతుల మోకాళ్ళు పూజించవలెను. ‘ఈశాయై నమః’, ‘శంకరాయ నమః’ అని చెప్పుచు వరుసగా పార్వతీ శివుల కటి భాగమును, ‘కోటవ్యై నమః’, ‘శూలపాణయే నమః’ అని చెప్పుచు కుక్షి ప్రదేశములను, ‘మఙ్గలాయై నమః’, ‘తుభ్యం నమః’ అని చెప్పుచు వారి ఉదరమును పూజించవలెను. ‘సర్వాత్మనే నమః’, ‘ఈశాన్యై నమః’ అని చెప్పుచు వరుసగా శివ పార్వతుల స్తనములను, ‘దేవాత్మనే నమః’, ‘హ్రాదిన్యై నమః’ అని చెప్పుచు కంఠ ప్రదేశమును, ‘మహాదేవాయ నమః’, ‘అనన్తాయై నమః’ అని హస్తములను, ‘త్రిలోచనాయ నమః’, ‘కాలానల ప్రియాయై నమః’ అని భుజములను, ‘మహేశాయ నమః’, ‘సౌభాగ్యాయై నమః’ అని వారి అలంకారములను పూజించవలెను. పిదప ‘అశోక మధువాసిన్యై నమః’, ‘ఈశ్వరాయ నమః’ అని చెప్పుచు వరుసగా పార్వతీ పరమేశ్వరుల ఓష్ఠములను, ‘చతుర్ముఖ ప్రియాయై నమః’, ‘హరాయ స్థాణవే నమః’ అని ముఖములను పూజించవలెను. ‘అర్ధనారీశాయ నమః’, ‘అమితాఙ్గాయై నమః’ అని శివపార్వతుల నాసికలను, ‘ఉగ్రాయనమః’, ‘లలితాయైనమః’ అని కనుబొమ్మలను పూజించవలెను.
‘శర్వాయ నమః’, ‘వాసన్త్యై నమః’ అని చెచు వరుసగ శివపార్వతుల తాలు ప్రదేశమును పూజించవలెను. ‘శ్రీకణ్ఠనాథాయై నమః’, ‘శితికణ్ఠాయ నమః’ అని చెప్పుచు వరుసగా పార్వతీ పరమేశ్వరుల కేశపాశములను పూజించవలెను. ‘భీమోగ్రాయ నమః’, ‘సురూపిణ్యై నమః’ అని చెప్పుచు శివపార్వతుల శిరస్సులను పూజించవలెను. ‘సర్వాత్మనే నమః’ అని చెప్పి పూజను ఉపసంహరించవలెను. చైత్రము మొదలు పండ్రెండు మాసములందు వరుసగా మల్లిక, అశోకము, కమలము, కుందము, తగరము, మాలతి, కదంబము, కరవీరము, బాణము, అమ్లానము, కుంకుమము, సింధువారము-ఈ పుష్పములతో శివపూజ చేయవలెను. ఉమామహేశ్వర పూజానంతరము వారి ఎదుట-ఘృతమిశ్ర నిష్పావము, కుసుంభము, దుగ్ధము, జీవకము, దూర్వలు, చెరకు కర్ర, ఉప్పు, కొత్తిమిరి అను ఎనిమిది సౌభాగ్య ద్రవ్యములను ఉంచవలెను. చైత్రమాసమున పర్వత శిఖరాగ్ర జలము త్రాగి పార్వతీ పరమేశ్వరుల సముఖమున శయనించవలెను. ప్రాతః స్నానము చేసి, పార్వతీ పరమేశ్వరుల పూజచేసి, బ్రాహ్మణ దంపతులను అర్చించి ‘లలితా ప్రీయతాం మమ’ అని చెప్పుచు ఆ అష్ట సౌభాగ్య ద్రవ్యములను దానము చేయవలెను. వ్రతమాచరించు వాడు, చైత్రాది మాసములందు వరుసగా వ్రతదినములలో, పర్వత శిఖర జలమును, గోమయమును, మందారమును, బిల్వపత్రములను, ఘృతమిశ్రమగు పెరుగును, గోమూత్రమును, ఘృతమును, నల్లని తిలలను, పంచగవ్యములను భుజించవలెను. సౌభాగ్యాష్టకము దానము చేయుసమయమున, చైత్రాది మాసములందు, వరుసగా ‘ప్రీయతాం మమ’ అనుదానికి ‘లలితా, విజయా, భద్రా, భవానీ, కుముదా, శివా, వాసుదేవీ, గౌరీ, మంగళా, కమలా, సతీ’ అనునవి చేర్చవలెను. వ్రతము ముగిసిన తరువాత ఏదైన ఒక ఫలమును పరిత్యజించవలెను. గురువునకు తలగడలతో గూడిన శయ్యను, స్వర్ణ నిర్మితమగు ఉమా మహేశ్వరమూర్తిని, గోసహిత వృషభమును దానము చేయవలెను. గురువునకును, బ్రాహ్మణ దంపతులకును వస్త్రాదులతో సత్కారము చేసినవాడు భుక్తి ముక్తులను పొందును. ‘సౌభాగ్య శయనము’ అను ఈ వ్రతమును ఆచరించుటచే మనుష్యుడు సౌభాగ్య, ఆరోగ్య, రూప, దీర్ఘాయువులను పొందును.
భాద్రపద, వైశాఖ, మార్గశీర్ష శుక్ల తృతీయలందు గూడ ఈ వ్రతము చేయవచ్చును. ‘లలితాయై నమః’ అని చెప్పుచు పార్వతీపూజ చేయవలెను. ప్రతి పక్షమునందును ఈ విధముగా పూజించి వ్రతాంతమునందు ఇరువది నలుగురు దంపతులకు వస్త్రదానము చేయువాడు భుక్తి ముక్తులను పొందును. ఇది సౌభాగ్యశయన వ్రతము రెండవవిధి. ఇపుడు సౌభాగ్య వ్రతమును గూర్చి చెప్పెదను. ఫాల్గుణాది మాసముల శుక్లపక్ష తృతీయల యందు వ్రతము చేయువాడు ఉప్పు పరిత్యజించవలెను. వ్రతము సమాప్తమైన పిమ్మట బ్రాహ్మణ దంపతి పూజచేసి, ‘భవానీ ప్రీయతామ్’ అని చెప్పి శయ్య, సంపూర్ణ సామగ్రి చేర్చి గృహము దానము చేయవలెను. ఇది సౌభాగ్య తృతీయా వ్రతము, ఇది పార్వత్యాది లోకములను ఇచ్చును. మాఘ, భాద్రపద, వైశాఖ తృతీయలందు గూడ ఈ విధముగనే చేయవలెను. చైత్రము నందు దమనక తృతీయా వ్రతమాచరించి దమనక పుష్పముతో పార్వతిని పూజించవలెను. మార్గ శీర్షమున ఆత్మ తృతీయావ్రత మాచరించవలెను. దాని యందు పార్వతీ పూజచేసి బ్రాహ్మణులకు యథేచ్ఛగా భోజనము పెట్టవలెను. మార్గశీర్ష తృతీయతో ప్రారంభించి, క్రమముగా పౌషాది మాసములందు పై వ్రతమును ఆచరించి ‘గౌరీ, కాలీ, ఉమా, భద్రా, దుర్గా, కాంతి, సరస్వతీ, వైష్ణవీ, లక్ష్మీ, ప్రకృతి, శివా, నారాయణీ’ అను నామములకు ప్రీయతామ్ అని చేర్చి చెప్పవలెను. ఈ విధముగా వ్రతము చేయువాడు సౌభాగ్యమును స్వర్గమును పొందును. (178)
