అగ్ని మహా పురాణము

Table of Contents

నానారోగములను హరించు ఔషధములు

ధన్వంతరి చెప్పెను:

సింహ, శటి రెండు విధముల పసుపు వత్సకము. వీటి క్వాథము శిశువునకు కలుగు అన్ని అతిసారములను, స్తన్య దోషములను తొలగించును. శృంగి, కృష్ణ, అతివిష-వీటి చూర్ణమును తేనెతో నాకించవలెను. లేదా ఒక్క అతివిషనే నాకించవలెను. దీనిచే శిశువుల దగ్గు ఉపశమించి జ్వరము నశించును. పిల్లలకు దుగ్ధముతో ఘృతము లేదా తైలముతో పచ ఇవ్వవలెను. లేదా యష్టికను గాని, శంఖపుష్పిని గాని పాలతో త్రాగించ వలెను. అట్లు చేయుటచే వారి వాక్శక్తి రూప సంపత్తి ఆయువు బుద్ధికాంతి వృద్ధి చెందును. వచ అగ్నిశిఖ వాసా శుంఠి పిప్పలి, పసుపు కూటము, యష్టిక, సైంధవము వీటి చూర్ణము ప్రాతఃకాలమున బాలకులకు ఇచ్చినచో మేధావృద్ధి కలుగును. దేవదారు, మహాశిగ్రు త్రిఫలా పయోముక్కుల క్వాథముగాని, కృష్ణ, మృద్వికలతో చేసిన కల్కముగాని, సర్వకృమి రోగములను అపహరించును. త్రిఫల, భృంగరాజ విశ్వముల రసములందును మధు ఘృతములందును, మేషీ (ఆడమేక) క్షీరమునందుకాని, గోమూత్రమునందు కాని తడిపినచో శిశు రోగములను తొలగించును. దూర్వారసమును నశ్యముగా ఇచ్చినచో నాసా రక్తము శాంతించును. లశునము (తెల్లఉల్లి) ఆర్ద్రకము, శిగ్రు, వీటి రసమును చెవిలో పోసినను, అల్లము రసముకాని, తైలముగాని పోసినను చెవిపోటును ఓష్ఠ రోగములును నశించును. జాతి పత్రము, త్రిఫల, వ్యోషము గోమూత్రము, పసుపు, గోదుగ్ధము, అభయా కల్కము, తైలము-వీటిని కబలించుటచే దంత బాధ తొలగును. ధాన్యము నారికేళ జలము, గో మూత్రము, పోన్ శొంఠి వీటి క్వాథమును నోటిలో వుంచుకొన్నచో జిహ్వా వ్యాధి తొలగును. లాంగలీ కల్కమునందు నిర్గుండీ రసముతో సాధించిన తైలము ‘గండమాల’ గల గండ దోషములను నశింపచేయును. అర్క పూతిక స్నుహీ, రుగ్ఘాత, జాతిక పత్రములను గో మూత్రముతో నూరి ఒంటికి రాసినచో చర్మరోగములు అన్నియు నశించును. వకుచిని తిలలతో ఒక సంవత్సరము తిన్నచో కుష్ఠ రోగము నశించును. పథ్యభల్లాతకీ గుడము, తైలము, పిండ ఖర్జూరము-ఇవి కుష్ఠరోగ నాశకములు, యూథిక, చిత్రకము, పసుపు, త్రిఫల, వ్యోషముల చూర్ణమును తక్రము(మజ్జిగ)తో త్రాగినను గుడముతో ఉసిరికాయ తిన్నను హర్షరోగము నశించును. ప్రమేయ రోగము కలవాడు త్రిఫల, దార్వి విషముల క్వాథమును గాని, ఉసిరికాయ రసమును, పసుపు కల్కము, తేనె వీటితో కల్పిగాని సేవించవలెను. వాసా గర్భమును వ్యాధి ఘాత క్వాథమునందు ఆముదము కలిపి త్రాగినచో వాత శోణిత రోగము తగ్గును. పిప్పలి ప్లీహ రోగమును తొలగించును.

ఉదర రోగము గలవాడు స్నుక్ క్షీరమునందు అనేక పర్యాయములందు భావన చేసిన పిప్పలి సేవించవలెను. చిత్రక విడంగ త్రికటు కల్కములతో సిద్ధమగు క్షీరము, అరుచి రోగమును తొలగించును. గ్రంథికా, ఉగ్ర అభయ, కృష్ణ, విడంగములను నేతిలో కల్పం వుంచి గాని కేవలము తక్రముతో గాని ఒక మాసము సేవించుటచే గ్రహణహర్ష, పాండు గుల్మక రోగములు క్రుమి రోగములు నశించును. త్రిఫల, అమృత, వాస, తిక్త భూనింబముల క్వాథమును తేనెతో సేవించినచో పాండు రోగము, కామలా రోగము నశించును. రక్త పిత్తము కలవాడు వాసారసమును పటికబెల్లము తేనె కలిపి త్రాగినను శతావరి ద్రాక్షబల, శుంఠీలలో సాధించిన పాలు త్రాగినను ఆ రోగము నశించును. క్షయ రోగి శతావరి, విదారి, పథ్య, బలాత్రయ, వాసక, శ్వదంష్ట్రలను చూర్ణము చేసి తేనె, నెయ్యి కలిపి నాకవలెను. పథ్యశిగ్రు, కరంజచ, అర్క, త్వత్సార, మధు సైంధవములను గోమూత్రముతో కలిపి రాసినచో విద్రథిని పక్వముచేసి మాన్పుటకు మంచిది. త్రివృతా, జీవంతీ, దంతీ, మంజిష్ఠా, ద్వివిధ, శర్వరీ, తార్షజా, నింబపత్రముల లేపము భగరంధ్రమునకు మంచిది. రుగ్ఘాత, హరిద్ర, లాక్షాచూర్ణములను గోఘృతముతోను తేనెతోను కలిపి వస్త్రముతో వర్తిచేసి వ్రణము నందుంచినచో వ్రణమును శుద్ధముచేసి మాన్పును. శ్యామా, యష్టి, హరిద్రా, లోధ్ర, పద్మక, ఉత్పల, చందన, మరీచములతో క్షీరములో కాచిన తైలము వ్రణములను మాన్పును. శ్రీ కార్పా సదళ భస్మ, త్రిఫల, ఉపల, నిశలతో గోళములు చేసి తామ్ర పాత్రయందు ఉడికించి ఆ తైలమును గాయమునందు వ్రాయవలెను. కుంభీసారమును నిప్పుపై మాడ్చి దానిని పాలతో కలిపి వ్రణముపై వ్రాయవలెను. లేదా కొబ్బరి చెట్టు మొదటిలో ఉన్న మట్టిలో ఘృతము కలిపి కాచినచో వ్రణము మానును.

విశ్వ, అజమోద, సైంధవ, చించాత్వక్కుల సమ భాగము గల అభయతో కలిపి తక్రముగాని, ఉష్ణ జలముగాని త్రాగుటచే అతిసారము నశించును. ఇంద్రయవ, అతి విష, విశ్వముస్తలు వేసి, కాచిన క్వాథము ఆమసహితమగు జీర్ణాతి సారమును శూలముతో కూడిన రకాతి సారమును పోగొట్టును. అంగారములపై కాల్చిన సుగతమును సింధువును వేడినీళ్ళతో త్రాగవలెను. పిదప శూల బాధ కలవాడు దానిని వేడి నీళ్ళతో త్రాగవలెను లేదా సైంధవము, ఇంగువ, పిప్పలి అభయ వీటితో వేడి నీళ్ళతో త్రాగవలెను. తేనెలో తడిపిన కటురోహ, కమల, ఆతంక, లాజ చూర్ణములను గుడ్డలో చుట్టబెట్టి ముఖము లేదా సైంధవము, ఇంగువ, పిప్పలి అభయ వేడినీళ్ళతో త్రాగవలెను. తేనెలో తడిసిన కటు రోహకము, అతంక, లాజచూర్ణములను గుడ్డ చుట్ట బెట్టి ముఖమునందుంచుకున్నచో దాహము తగ్గును. పాఠదార్వి జాతీదలములను, ద్రాక్ష, మూల త్రి ఫలములతో సాధించి మధుక్వాథముతో కలిపి ముఖము నందుంచి చప్పరించినచో దాహము తగ్గును. కృష్ణ, అతి విష, తిక్త ఇంద్రదారు, పాఠ, పయోముక్కుల క్వాథమును, గో మూత్రమునందు మరిగించి తేనె కలిపినచో స్వరకంఠ రోగములను పోగొట్టును. పథ్య గోక్షుర, దుఃస్పర్శ, రాజవృక్ష, శిలాజిత్తుల కషాయమును తేనెతో త్రాగినచో మూత్ర కృచ్ఛ్రము పోవును. వెదురు బెరడు, వరుణ వృక్షపు బెరడుతో చేసిన క్వాథము శర్కరను, ఆశ్మరీ రోగమును నశింప చేయును. స్లీపద రోగము కలవాడు శాకోటక క్వాథమును తేనెతో కలిపి తినవలెను. మాష, అర్కత్వక్కులను, అర్క వృక్షపాలను, తైలమును, మైనమును, సైంధవమును కలిపి ఉపయోగించినచో పాద రోగములు నశించును. శొంఠి సౌవర్చము. హింగు చూర్ణము వీటిని శొంఠి రసముతోకాని, నేతితో కాని, లేదా వీటి క్వాథములు కాని, మలబంధ దోషమును పోగొట్టును. గుల్మరోగము కలవాడు, సౌవర్చల చిత్రక హింగు అజామోదముల రసముతో కలిపి లేదా విడంగ చిత్రకములతో కలిపి తక్రసానము చేయవలెను. ధాత్రి, పటోల, ముద్గముల క్వాథము, ఆజ్యముతో కలిపి తీసుకున్నచో విసర్ప రోగము తొలగును, శొంఠి దేవదారు, నవాక్షీర క్వాథము గోమూత్రముతో కలిపి తీసుకున్నచో విసర్పరోగమును పొందును. వ్యోష, అయోరజు, క్షార త్రిఫల క్వాథము శోధ రోగములు తొలగించును. గుడ శిగ్రు త్రివృత్, సైంధవ లవణముల చూర్ణముతో చేసిన క్వాథము శోధ రోగమును తొలగించును. విశోధ త్రిఫల, గుడములతో చేసిన క్వాథము విరేచకరము వచా, ఫల కషాయమునుండి తీసిన జలము వమనకారి. భృంగరాజ రసమున భావితమైన త్రిఫల నూరు పలములు వాయు విడంగలోహ చూర్ణములు, పదవ భాగము శతావరి, గుడూచి, చిత్రమూలములను ఇరువది ఐదు పలములు గ్రహించి చూర్ణముచేసి, దానిని మధు, ఘృత తైలములతో సేవించినచో వళులు వలితములు తొలగిపోవును. అట్లు సేవించినవాడు సకల రోగముక్తుడై నూరు సంవత్సరములు జీవించును. మధు శర్కరలు కలిపి సేవించి త్రిఫల సర్వరోగ వినాశకరము. కృష్ణా సహితమగు త్రిఫలను సితా మధు ఘృతములతో సేవించినచో అట్టి ఫలమే ఇచ్చును. పథ్య, చిత్రక, శొంఠి, ముసలీ చూర్ణములను గుడముతో భక్షించినచో రోగములను తొలగించి మూడు వందల సంవత్సరముల ఆయుర్దాయము ఇచ్చును. జపాపుష్పమును కొంచెము నలిపి నీటిలో కలిపి ఆ చూర్ణజలమును కొంచెము తైలములో కల్పినచో ఆ తైలము ఘృతమువలె యగును. పిల్లి మావితో ధూపము వేసినచో చిత్రము కనబడదు. మరల మైనము ధూపము వేసినచో వెనుకటి వలెనే కనబడును. కర్పూరము, జటగ, భేక తైలము, వీటిని పాటలి మూలముతో కలిపి నూరి పాదములకు రాసుకొని మనుష్యుడు నిప్పుల మీద నడువగలడు. తృణోత్థాపనాదము చేయుచు, ఆశ్చర్య కరముగ నడువగలడు. విషములను తొలగించుట, రోగనాశము, గ్రహనాశము, తుచ్చ క్రీడలు, కామనాపరమైనవి. ఇహలోక, పరలోకము లందు సిద్ధి నిచ్చు కర్మలను షట్కర్మ సహితముగ నీకు చెప్పితిని. మంత్ర, ధ్యాన ఔషధ, కథా, ముద్రా, యజ్ఞములు ఈ ఆరును ఇచట పిడికిళ్ళు కొలది ధర్మార్థ కామ మోక్షములను ఇచ్చు దీనిని ఎవడు పఠించునో ఆతడు స్వర్గమునకు వెళ్ళును. (283)