అగ్ని మహా పురాణము

Table of Contents

ఆసన ప్రాణాయామ ప్రత్యాహారములు

అగ్నిదేవుడు పలికెను:

పద్మాసనము మొదలగు ఆసనము బంధించి పరమాత్మ ధ్యానము చేయవలెను. పవిత్రమైన ప్రదేశమున చాల ఎత్తు కానిదియు చాల పల్లము కానిదియు వస్త్రము అజినము, కుశలు పరచిన స్థిరమైన ఆసనమును ఏర్పరచుకొని దానిపై కూర్చుండి చిత్త ఇంద్రియ పనులను అరికట్టి మనస్సు ఏకాగ్రముచేసి ఆత్మ విశుద్ధికై యోగాభ్యాసము చేయవలెను. శరీరమును శిరస్సును కంఠమును సమముగా ఉన్నట్లు స్థిరముగ నిలపి తన నాసికాగ్రమును చూచుచు దిక్కులనుచూడక మణవలచే వృషణములను జననేంద్రియమును రక్షించుచు తొడపై బాహువులను అడ్డముగావుంచి ఎడమ అరచేతిలో దక్షిణ హస్త పృష్ట భాగమును ఉంచి ముఖమును కొంచెము ఎత్తి ముందుకు చొచ్చు కొనునట్లు చేసి ధ్యానము చేయవలెను. తన దేహములో ఉన్న వాయువు ప్రాణము. దానిని నిరోధించుట ప్రాణాయామము. ఒక నాసికా పుటమును వ్రేలితో నొక్కిపట్టి రెండవ నాసికాపుటము నుండి ఉదరములో ఉన్న వాయువును పైకి పంపవలెను. ఇట్లు రేచనము చేయుటచే దీనికి రేచక ప్రాణాయామమని పేరు. బాహ్య వాయువుతో దేహమును తిత్తిని నింపినట్లు నింపి అట్లే ఉండవలెను. పూరించుటచే దీనికి పూరకమని పేరు. లోపల వాయువును విడువక బయటనున్న వాయువును లోపలకు తీసుకొనక సంపూర్ణకుంభమువలె స్థిరుడై ఉండవలెను. దానికి కుంభకమని పేరు. పండ్రెండు మాత్రల కాలము ఉద్ఘాతము. అంతకాలము ప్రాణాయామము చేయుట కనిష్ఠము. రెండు ఉద్ఘాతముల కాలము అనగా ఇరువది నాలుగు మాత్రలకాలము మధ్యమము. మూడు ఉద్ఘాతముల కాలము అనగా ముప్పది ఆరు మాత్రల కాలము ఉత్తమము. స్వేదమును కంపమును అభిఘాతమును కల్గించు ప్రాణాయామము ఉత్తమోత్తమము. తనకు అధికారములేని ప్రాణాయామ భూమికలను అధిష్ఠించకూడదు. ప్రాణాయామము చేయువానికి హిక్కాశ్వాసాధులు తొలగును. ప్రాణము జయించిన వానికి మల మూత్రాది దోషములుకూడ అత్యల్పముగ ఉండును. ఆరోగ్యము శీఘ్రముగా నడచుట, ఉత్సాహము స్వరమాధుర్యము, బలము, శరీర వర్ణము స్వచ్ఛమగుట సకల దోషముల క్షయము-ఇది ప్రాణాయామము వలనకలుగు లాభములు. జప, ధ్యానము లేని ప్రాణాయామము ఆగర్భము, అవి ఉన్నది సగర్భము. ఇంద్రియ జయము కోరువాడు సగర్భ ప్రాణాయామము చేయవలయును. జ్ఞాన వైరాగ్యముల చేతను ప్రాణాయామము చేతను ఇంద్రియములను జయించినవాడు సర్వమును జయించినట్లే. స్వర్గము నరకము అనునవి కూడ ఇంద్రియములే. వశము చేసికొనబడని ఇంద్రియములు నరకమును ఇచ్చును. ఈ శరీరము రథము. ఇంద్రియములు అశ్వములు. మనస్సు సారథి. ప్రాణాయామము కొరడా. మాయ జ్ఞానము. వైరాగ్యమను కళ్ళెములతో మనస్సును స్వాధీనములో ఉంచుకొనును. ఈ విధముగా ప్రాణాయామముచే నిరోధింపబడిన మనస్సు మెల్లగా నిశ్చలత్వమును పొందును. మాసమునకు ఒకసారి కుశాగ్రముతో జలబిందువును త్రాగుచు నూరు సంవత్సరములు ఎంత తపస్సు చేసిన ఎంత ఫలమో అంత ఫలమును ప్రాణాయామము ఇచ్చును. విషయ సముద్రములో ప్రవర్తించిన ఇంద్రియములను వెనుకకు లాగి నిగ్రహించుట ప్రత్యాహారము. నీటిలో మునిగిపోవుచున్నట్లు విషయములలో మునిగి పోవుచున్నతనను తానే ఉద్ధరించు కొనవలెను. భోగములనెడు నది యొక్క వేగముచే కొట్టుకొనిపోవువాడు జ్ఞానమనెడి వృక్షమును ఆశ్రయించవలెను. (373)