అగ్ని మహా పురాణము

Table of Contents

అశోకపూర్ణిమాది వ్రతములు

అగ్ని పలికెను:

ఫాల్గుణ శుక్ల పూర్ణిమనాడు వరాహమూర్తిని, భూదేవిని పూజించవలెను. ఈ విధముగ ఒక సంవత్సర మాచరించువాడు భుక్తి ముక్తులను పొందును. కార్తిక పూర్ణిమనాడు వృషోత్సర్గము చేసి రాత్రి వ్రతమును అనుష్ఠించవలెను. దీనిచే శివలోకమును పొందును. దీనికి ‘వృషోత్సర్గ వ్రతము’ అని పేరు. ఆశ్వయుజమున పితృపక్ష అమావాస్య యందు పితృ దేవతలను ఉద్దేశించి చేసిన దానము అక్షయ ఫలప్రదము. ఏ సంవత్సరము నందైనను ఈ అమావాస్యనాడు ఉపవాసముండి పితృపూజ చేయువాడు పాపవిముక్తుడై స్వర్గము పొందును. మాఘ అమావాస్యనాడు బ్రహ్మను పూజించినవాడు సకల అభీష్టములను పొందును. ఇపుడు భుక్తి ముక్తి ప్రదమగు వటసావిత్రీ వ్రతమును గూర్చి చెప్పెదను. వ్రతము ఆచరించు స్త్రీ మూడు దినములు ఉపవాసము చేసి, జ్యేష్ఠ అమావాస్యనాడు వటవృక్ష మూలమునందు మహాపతివ్రతయగు సావిత్రిని సప్త ధాన్యములతో పూజించవలెను. కొంచెము రాత్రి శేషించి యుండగా ఆ వటవృక్షమునకు కంఠసూత్రము చుట్టి కుంకుమాదులతో దానిని పూజించవలెను. ప్రభాతసమయమున ఆ వటముదగ్గర నృత్యము చేయుచు గీతములు గానము చేయవలెను. ‘నమః సావిత్ర్యై సత్యవతే’ అనుచు సావిత్రీ సత్యవంతులకు నమస్కారముచేసి, వారికి సమర్పించిన నైవేద్యము బ్రాహ్మణునకు దానము ఈయవలెను. పిదప ఇంటికి వచ్చి బ్రాహ్మణులకు భోజనము పెట్టి తరువాత తాను భుజించ వలెను. ‘సావిత్రీదేవీ ప్రీయతామ్’ అని అనుచు వ్రతసమాప్తి చేయవలెను. ఇట్లు చేసిన స్త్రీ సౌభాగ్యాదులను పొందును. (194)