అగ్ని మహా పురాణము

Table of Contents

అగ్నిపురాణం-వర్గీకరణ

అగ్నియొక్క మాహాత్మ్య ప్రతిపాదనమే అగ్ని పురాణ లక్ష్యం అని స్కాందపురాణంలోని శివరహస్య ఖండంలో చెప్పినా, ఈ పురాణంలో అలాంటి వృత్తాంతం ఏమీ లేదు.

యత్త దీశానకం కల్పం వృత్తాంత మధికృత్యచ

వసిష్ఠాయాగ్ని నాప్రోక్త మాగ్నేయం తత్ ప్రచక్షతే

తచ్చ షోడశ సాహస్రం సర్వ క్రతు ఫలప్రదం

(ఈశాన కల్పవృత్తాంతాన్ని వశిష్ఠునికి అగ్ని ఉపదేశించిన సర్వ యజ్ఞ ఫలప్రదమైన పదహారు వేల శ్లోకాలుగలది ఈ పురాణం) అని మత్స్యపురాణం తెలుపుతున్నది.

పురాణముల వర్గీకరణ ప్రకారము అగ్ని పురాణము ‘తామస పురాణము’ల విభాగము నందు చేర్చబడినది. తామస పురాణములు శివ భక్త్యాత్మకములు. అందుచే దీనిని శివ భక్త్యాత్మక పురాణముగా చెప్పవచ్చును.

అగ్ని, గరుడ, నారద పురాణాది పురాణములు కేవలం పురాణ పంచలక్షణములు, దశ లక్షణములకు పరిమితములుకావు. సామాన్యముగా ఏ పురాణమూ పంచ లక్షణములకు పరిమితమై ఉండదు. అగ్ని పురాణము ఇంకను విస్తరించినది. ప్రతిపాద్య విషయమును బట్టి అగ్నిపురాణము బహువిధ విషయ విస్తారకముగా ఉన్నదని చెప్పవచ్చును. నిఘంటు, వ్యాకరణ, ఛంద, అలంకార, జ్యోతిష, వైద్య, సాముద్రికాది శాస్త్రములతో ఆఖ్యానోపాఖ్యానములతో, తీర్థ, క్షేత్ర, శ్రాద్ధాది నానా విషయములు అగ్నిపురాణమున చెప్పబడినవి.

అగ్నిపురాణ విషయములను పరిశీలించిన భారతీయ (మానవ) విజ్ఞానమునందలి సర్వ విషయములును జన వ్యవహారము నందుగలవి, జనులకు తెలిసిన సర్వ విషయములు స్పష్టముగా విశదీకరింప బడినవి. ఈ దృష్టితో పరిశీలించిన అగ్నిపురాణము వాస్తవముగా విజ్ఞాన సర్వస్వమే కాక విజ్ఞానం కోశమే. విషయములను వివరించునపుడు అగ్ని పురాణము ప్రామాణికమైన సారాత్సార వివేచనపద్ధతిలో చేయబడినట్లు గ్రహించ గలము. ఈ విషయమే ఈ పురాణ ఆరంభంలో

విష్ణుః కాలాగ్ని రుద్రోఽహం విద్యాసారం వదామితే

విద్యాసారం పురాణం యత్సర్వ సర్వస్య కారణమ్ (అగ్ని 1-13)

అని ఇది సర్వవిద్యల సారమని చెప్పబడినది. ఒకానొక సందర్భమున ఈ పురాణము అగ్ని పురాణము విష్ణుస్వరూపమని చెప్పబడినది. దీని కర్త శ్రోత సాక్షాత్ జనార్దనుడే. అందుచేతనే ఈ పురాణము సర్వవేదమయము సర్వ విద్యామయమని

వేదేషు స పురాణేషు యజ్ఞ మూర్తిశ్చ శీయతే

ఆగ్నేయాఖ్యం పురాణం తు రూపం విష్ణో ర్మహత్తరమ్

తస్మాత్ పురాణ మాగ్నేయం సర్వవేద మయం మహత్

సర్వ విద్యామయం పుణ్యం సర్వజ్ఞాన మయం వరమ్ (అగ్ని ఽ71-16-ఽ8)

అని చెప్పబడినది. ఈ విధముగా అగ్నిపురాణము తనను మహాపురాణములలో ఒకటిగా చెప్పుకొనుచున్నది. అందలి విషయ క్రమమును బట్టి కూడా అది నిశ్చితమైన విషయమే. కానీ పరిశోధనలు దీని ప్రాచీనత విషయమున సందేహము వెలిబుచ్చి యున్నారు. కాన దీనిని మూల అగ్నిపురాణము గనుక వహ్ని పురాణముగను పరిగణింప లేదు.

అగ్ని, గరుడ, నారద పురాణములను విజ్ఞాన సర్వస్వాత్మక పురాణములని వేరొక విభాగము చేయవచ్చును. వీనియందు వర్ణ్యవిషయము కేవలము పురాణ పంచలక్షణములు నియమితమే కాక సమస్త విజ్ఞానమును క్రోడీకరించి రాశిపోసినవి. కావుననే ఇది తనను గుఱించి ‘విద్యాసారం పురాణం యత్ సర్వం సర్వస్య కారణమ్’ అని చెప్పుకొనినది.

కావున దీనిని ప్రాచీనమైన మౌలిక పురాణమని చెప్పలేము. ఇది సామాన్య జనోప యోగము కొఱుకు ఫ్రౌఢగ్రంథముల సారాంశమును క్రోడీకరించిన రచన. జన సామాన్యమునకు విద్యగ ఉపయోగకరముగ రచింపబడి ఉండును. అగ్ని పురాణము ప్రత్యేకముగా ఏ మతశాఖ వైపును మొగ్గు చూపు గ్రంథముకాదు. ఇందు శైవ, వైష్ణవ, శాక్తపరమైన అంగములు అన్నియు వివరింపబడినవి.