అగ్ని మహా పురాణము
మండలములు
ఈశ్వరుడు పలికెను:
స్కందా! ఇప్పుడు సర్వతో భద్రములు అను పేరుగల ఎనిమిది మండలములను చెప్పెదను. శంకువుతో తూర్పు దిక్కున సాధించి విషువ కాలమున చిత్ర స్వాతి నక్షత్రముల మధ్య యందుగాని లేదా సూత్రముగ్రహించి తూర్పునుండి పశ్చిమమువరకు లాగి మధ్యము నందు రెండు కోటులను గుర్తించవలెను. వాటి మధ్య నుండి ఒక దీర్ఘమైన ఉత్తర దక్షిణ రేఖ గీసి రెండు మత్స్యములను నిర్మించి వాటిని దక్షిణోత్తరములపై ఆస్ఫాలనము చేయవలెను. క్షత పద క్షేత్రము యొక్క అర్ధమానముచే కోణ సంపాతము చేయవలెను. ఈ విధముగా నాల్గు పర్యాయములు సూత్రమును క్షేత్రమునందు ఆస్ఫాలనము చేయగా ఒక చతురస్రము ఏర్పడును. దాని నాల్గు హస్తముల శుభకరమగు భద్ర మండలము ఏర్పరుపవలెను. ఎనిమిది పదములచే అన్ని వైపులను విభక్తములగు అరువది నాలుగు పదముల నుండి ఇరువది పదములుగల క్షేత్రమున వెలుపల ఒక వీథిని నిర్మించవలెను. ఈ వీథి ఒక మంత్రమునకు సంబంధించినది. కమల మానముచే రెండు పదముల ద్వారము నిర్మించి దానిని కపోలయుక్తముగ చేయవలెను. కోణబంధముచే అది అందముగ ఉండవలెను. ఈ విధముగ ద్విపదమును ద్వార నిర్మాణమునందు ఉపయోగించవలెను. కమలమును శ్వేత వర్ణముగాను, కర్ణికను పీత వర్ణముగాను, కేసరములను చిత్ర వర్ణములు గాను, వీథిని రక్త వర్ణముగాను చేయవలెను. ద్వారములలో కపాల స్వరూపములు నిత్య నైమిత్తిక వీథులందు కోణము ఎర్రగా వుండవలెను. ఇపుడు పద్మమును గూర్చి వినుము. అసంసక్తము, సంసక్తము అని అవి రెండు విధములు. భుక్తి ముక్తి ప్రదము. అసంసక్తము ముముక్షువులకు ఉపయుక్తము బాల, యువ, వృద్ధములని సంసక్త కమలములు మూడు విధములు. అవి తమ పేర్లను అనుసరించి ఫలసిద్ధిని ఇచ్చును.
కమల క్షేత్రము నందు దిక్ విదిక్కులవైపు సూత్ర విన్యాసముచేసి పద్మ క్షేత్ర సమములగు ఐదు వృత్తములను నిర్మించవలెను. ప్రథమ వృత్తము నందు నాలుగు పుష్కరములు గల కర్ణికయు రెండవ దానియందు ఇరువది నాలుగు కేసరములు, మూడవ దానియందు గజ, కుంభ సదృశములగు దశ సంధులు నాల్గవ వృత్తమునందు దళాగ్ర భాగములు పంచమ వృత్తమునందు ఆకాశ మాత్రము వుండును. ఇది సంసక్త కమలము. అసంసక్త కమలమున దళాగ్ర భాగము నందున్న దిక్కుల భాగము నందున్న దిక్కుల భాగముల విస్తారము ననుసరించి రెండు భాగములు విడచి ఎనిమిది భాగములతో దళములు ఏర్పరుప వలయును. సంధి విస్తార సూత్రముతో దాని మానమును అనుసరించి దళములను రచించవలయును. దీనియందు ఎడమనుండి, కుడికి ఏర్పరుపవలయును. లేదా సంధి మధ్య నుండి అర్ధ చంద్రాకారముగా త్రిప్పవలెను. లేదా రెండు సంధుల అగ్రమునందున్న సూత్రమును అర్ధచంద్రాకారముగ త్రిప్పవలెను. అపుడు బాల పద్మము ఏర్పడును. సంధి సూత్రము యొక్క అగ్ర భాగము నుండి పృష్ఠ భాగము వైపు సూత్రము త్రిప్పవలెను. అది తీక్ష్ణాగ్ర భాగమగు యువసంజ్ఞక కమలము, భుక్తి ముక్తిప్రదము. ముక్తి నుద్దేశించి చేయు ఆరాధనమునందు వృద్ధ కమలమును వశీకరణాదులందు బాల పద్మమును ఉపయోగించవలెను. నవనాభ కమల చక్రము ఎనిమిది హస్తముల ప్రమాణము కలదై ఉండును. దానియందు మంత్రాత్మకములగు తొమ్మిది భాగములు ఉండును. దాని మధ్య భాగమున కమలముండును. కమల మానానుసారముగపట్టిక వీథి ద్వారము యొక్క ఏడు కంఠములు, ఉపకంఠములు నిర్మించవలెను. ఐదు భాగముల వీథియుండును. దాని నలువైపుల పది భాగముల స్థానముండును. దాని ఎనిమిది దిక్కులందు ఎనిమిది కమలములున్న వీథి సహితమగు ఒక ద్వార పద్మము ఉండును. దాని బాహ్యభాగమున లతా దివి భూషితమగు ఐదు పదముల వీథియుండును. ద్వారకంఠము నందు కమలముండును. ద్వారము యొక్క ఓష్ఠ కంఠ భాగములు ఒక్కొక్క పదము నందుండును. కపోల భాగమున ఒక పదముండును. మూడు దిక్కులందును మూడు ద్వారములు స్పష్టముగా వుండును. కోణ బంధమునందు మూడు పట్టములు, రెండు పదములు, వజ్ర చిహ్నము ఉండును. మధ్య కమలము శుక్ర వర్ణము. మిగిలిన దిక్కుల కమలములు పూర్వాది క్రమమున పీత, రక్త, నీల, పీత, శుక్ల ధూమ్ర, రక్త, పీతవర్ణములై ఉండును. ఈ కమల చక్రము ముక్తిదాయకము.
పూర్వాది దిక్కులందు ఎనిమిది కమలములను శివ విష్ణ్వాది దేవతలను పూజించవలెను. శివ విష్ణ్వాదులను ప్రాసాద మధ్య కమలమందు పూజించి పూర్వాది కమలములపై ఇంద్రాది దేవతలను పూజించవలెను. బాహ్య వీథియందు ఆ దేవతల హస్త్రములను విష్ణ్వాదులను పూజించినవాడు అశ్వమేధ ఫలము పొందును. పవిత్రారోహణాదులందు మహా మండలము ఏర్పరుపవలెను. ఎనిమిది హస్తముల పొడవైన క్షేత్రమును ఇరువది ఆరుచే విభజించి మధ్యనున్న పదద్వయము నందు కమలమును తనకు తర్వాత ఒక పదమున వీథిని దిగ్విదిక్కులందు ఎనిమిది నీలకమలములను నిర్మించవలెను. మధ్యనున్న కమలము మానముతో మొత్తము ముప్పది పద్మములు నిర్మించవలెను. వాటికి దళ సంధులు వుండకూడదు. అవి నీలేందీవరములు. దాని పృష్ఠమున ఒక పాదము, వీథియు, దాని పైన స్వస్తిక చిహ్నము ఏర్పరుపవలెను. పిదప బాహ్య భాగమున వీథికయు ద్వారములు కమలములు ఉపకంటములు అన్నియు వుండవలెను. కోణములు రక్త వర్ణములు. వీథిపీత వర్ణము. మండల మధ్య కమలము నీల వర్ణము అయి వుండవలెను. విచిత్ర వర్ణములుగల స్వస్తికాది మండలములు సకల కామప్రదములు.
పంచాబ్జ మండలము ఐదు హస్తముల క్షేత్రమును అన్ని వైపుల నుండి పదిచే విభజించి నిర్మించవలెను. రెండు పదములు కమలము, దాని బాహ్య భాగమున వీథి, పట్టికా, మరల నాల్గుదిక్కులందును నాలుగు కమలములు వాటి పృష్ఠ భాగమున వీథి ఉండవలెను. దానిని ఏక పదములందుగాని పద ద్వయమునందుగాని నిర్మించవలెను. కంఠోప కంఠములుగల ద్వారములు వాటి మధ్య భాగమున కమలములు వుండవలెను. ఈ పంచాబ్జ మండలమున పూర్వ దిక్కునందున్న కమలము శ్వేత వర్ణము, పీతవర్ణము అయి ఉండును. దక్షిణ కమలము వైఢూర్య వర్ణము,పశ్చిమ కమలము శ్వేత వర్ణము ఉత్తర కమలము శంఖ తుల్యవర్ణము. మిగిలినవన్నియు విచిత్ర వర్ణములు అయి ఉండును.
సర్వకామప్రదమగు దశ హస్త మండలమును చెప్పెదను. దానిని వికార సంఖ్యచే (24) అన్ని వైపుల విభక్తముచేసి చతురస్ర క్షేత్రము ఏర్పరుపవలెను. రెండేసి పదముల ద్వారముండును. పూర్వమునందు చెప్పిన చక్రమునందువలె దీని మధ్య భాగమున కమలముండును. ఇప్పుడు విఘ్న ధ్వంస చక్రము చెప్పెదను. నాల్గు హస్తముల పురము ఏర్పరచి దాని మధ్య రెండు హస్తముల గోళాకార చక్రము ఏర్పరుపవలెను. అన్ని వైపుల నుండి స్వస్తిక చిహ్న వృత్తమగు హస్త ప్రమాణముగల వీథి యుండును. ఒక్కొక్క హస్తమున నాలుగు వైపుల ద్వారములు ఏర్పరుపవలెను. నాలుగు దిక్కులందు, కమలాంకితములగు వృత్తములు ఉండును. ఈ చక్రమున శ్వేత వర్ణములగు ఐదు కమలములు ఉండును. మధ్యవర్తి కమలమున నిరాకారుడగు పరమాత్మను పూజించవలెను. పూర్వాది దిక్కులందు హృదయాద్యంగములను విదిక్కులందు హస్తములను పూజించవలెను. సద్యోజాతాది పంచ బ్రహ్మమయ ముఖములను గూడ పూజించవలెను. ఇపుడు బుద్ధ్యాధార చక్రమును చెప్పెదను. నూరు పదముల క్షేత్రమున మధ్య యందున్న పదునైదు పదములలో ఒక కమలము అంకితముచేసి ఎనిమిది దిక్కులందును ఒక్కొక్క శివ లింగమును ఉంచవలెను. రెండు పదములలో మేఖలాభాగ సహితమగు కంఠము రచించవలెను. ఆచార్యుడు తన బుద్ధి సహాయముతో లతాదులను ఏర్పరుపవలెను. నాలుగు, ఆరు, ఐదు, ఎనిమిది ఇత్యాది సంఖ్యలో వున్న కమలములతో మండలము ఏర్పడును. ఇరువది ముప్పది కమలములున్నది కూడ ఉండును. 12,120 కమలములున్న సంపూర్ణ మండలము కూడ ఉండును. 120 కమలములు మండలము కూడ కనబడుచున్నది. విష్ణు, శివ దేవీ సూర్యులకు 1440 మండలములు ఉండును. పదిహేడు పదములతో పదిహేడు పదములను విభజించినవో 289 పదములగును. ఈ మండము నందు ‘లతాలింగము’ ఎట్లు ఉద్భవించునో చెప్పెదను వినుము. ఒక్కొక్క దిక్కుయందు ఐదు, మూడు, ఒకటి, మూడు, ఐదు పదములను తుడిచి వేయవలెను. పైన నున్న రెండు పదములతో లింగము పార్శ్వము నందున్న రెండేసి కోష్ఠములతో మందిరము ఏర్పడును. మధ్యనున్న రెండు పదములలో కమలము, మరల మరియొక కమలము ఏర్పడును. లింగ పార్పు భాగములందు రెండు భద్రములు ఏర్పడును. ఒక పదమున ద్వారముండును. దానిని తుడిచి వేయకూడదు. ఆ ద్వార పార్శ్వములందు ఆరేసి పదములను తుడిచివేయగా ద్వార శోభ ఏర్పడును. మిగిలిన పదములందు శ్రీహరికి లతలు ఏర్పడును. పైనున్న రెండు పదములను తుడిచి వేయగా విష్ణువునకు భద్రాష్టకము ఏర్పడును. మరల నాల్గు పదములను తుడిచి వేయగా రశ్మి మానాయుక్తమగు శోభా స్థాన మేర్పడును. ఇరువది ఐదు పదములచే పద్మము, పిదప పీఠము, అపీఠము రెండేసి పదములను వుంచగా ఎనిమిది ఉపశోభలు ఏర్పడును. దేవ్యాది సూచకమగు భద్రమండలము మధ్య విస్తృతముగను. ప్రాంత భాగమున లఘువుగను ఉండును. మధ్య తొమ్మిది పదముల కమలము ఏర్పడును. నాల్గు కోణము లందును నాలుగు భద్ర మండలములు ఏర్పడును. మిగిలిన పదమూడు పదములలో బుద్ధ్యాధార మండలము ఏర్పడును. దీనియందు నూట అరువది పదములు ఉండును. బుద్ధ్యాధార మండలము శివాది దేవతారాధనకు ప్రశస్తములు.(320)
